ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. బలం ఉన్న చోట సైతం వైసీపీ ఓడింది. మొన్నటి గ్రాడ్యుయేట్ ఎన్నికల ఫలితాల నుంచి తేరుకోకముందే.. ఇప్పుడు సొంత పార్టీ నేతలే షాక్ ఇవ్వడం ఊహించని దెబ్బ.. టీడీపీకి కేవలం 19 మంది సభ్యుల బలం ఉంటే.. ఆ పార్టీకి 23 ఓట్లు వచ్చాయి. అయితే అందులో వైసీపీ రెబల్ నేతలు కోటం శ్రీధరెడ్డి.. ఆనం రామనారాయణ రెడ్డి తమ ఓట్లకు టీడీపీకి వేశారనే ప్రచారం ఉంది. ఇక మిగిలిన రెండు ఓట్లు ఎవరు వేశారు అనేదానిపై జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో కోలా గురువులు, జయమంగళం ఇద్దరికీ 21 ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే వారిద్దరికీ కేటాయించన వారే క్రాస్ ఓటు వేశారని అంచనా వేస్తున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం ఉండవల్లి శ్రీదేవి.. మేకపాటు చంద్రశేఖర్ రెడ్డి లు క్రాస్ ఓటింగ్ వేసి ఉంటారని వైసీపీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే తనపై జరుగుతున్న ప్రచారంపై ఉండవల్లి శ్రీదేవి క్లారిటీ ఇచ్చారు. ఆమె ఏమన్నారంటే..?
తనకు క్రాస్ ఓటింగ్ కు పాల్పడాల్సిన అవసరం లేదన్నారు. తన నియోజకవర్గంలో 2019 నుంచి అసంతృప్తి ఉందని, అంత మాత్రాన తాను పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసే వ్యక్తిని కాదన్నారు. తాను రాజకీయ విలువలను పాటిస్తానని అన్నారు. అయితే నిజం నిలకడమీద తెలుస్తుందని ఉండవల్లి శ్రీదేవి అన్నారు. నిజాలు తెలుసుకుని మాట్లాడితే మంచిదని ఆమె తెలిపారు. తాను పార్టీకి కట్టుబడి ఉన్నానని ఆమె చెప్పారు.
ఇంకా ఆమె ఏమన్నారంటే..? ఈ రోజు ఉదయమే తాను సీఎం జగన్ ను కలిశాను అన్నారు. రాజధాని ప్రాంతం కావడంతో వచ్చే ఎన్నికల్లో వేరే చోట తనకు సీటు ఇస్తారని జగన్ హామీ ఇచ్చారని ఆమె అంటున్నారు. కేవలం దళిత మహిళ అనే తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను వైసీపీ అభ్యర్థికే ఓటు వేశానని అన్నారు.
అవసరమైతే తాను ఓటు ఎవరికి వేశానో చూపిస్తాను అని అన్నారు. అయితే అలా చూపించి ఓటు వేస్తే అధి చెల్లని ఓటుగా మారి పార్టీకి ఇబ్బంది అవుతుందని భావించాను అన్నారు. రాజకీయాల్లో నైతిక విలువలు పాటించే తనను జగనన్న ఉదయమే దీవించారని, నవ్వమని కూడా తనను ప్రోత్సహించారని ఆమె తెలిపారు. తన పాపను కూడా జగన్ దీవించారన్నారు ఆమె.. మరోవైపు క్రాస్ ఓటింగ్ పై సజ్జల సైతం సంచలన వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు డబ్బులతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ఆరోపించారు. ఆనం రామనారాయణరెడ్డి , కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని తాము లెక్కలోకి తీసుకోలేదన్నారు. తమది రాజకీయ పార్టీ అని, వారిపై ఏం చర్యలు తీసుకుంటామని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో విప్ అనేది చెల్లదన్నారు. ఈ ఫలితాలు సాధారణ ఎన్నికల్లో ప్రభావం చూపవని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాము బలం చూసుకుని ఎన్నికల్లో తమ అభ్యర్థులను పోటీకి నిలబెట్టామని, చంద్రబాబు ఏం చూసి అభ్యర్థిని నిలబెట్టారని ఆయన ప్రశ్నించారు. ఎవరు క్రాస్ ఓటింగ్ చేశారో తమకు తెలుసునని, సరైన సమయంలో చర్యలుంటాయని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Politics, Chandrababu Naidu, Sajjala ramakrishna reddy