ఏపీలో కొత్త జిల్లాల (AP New Districts) పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు మంత్రి పేర్ని నాని (Minister Perni nani) కౌంటర్ ఇచ్చారు. టీడీపీ (TDP), జనసేన (Janasena) తో పాటు వామపక్షాలపై మండిపడ్డారు. కొత్త జిల్లాల ఏర్పాటు చేతగాక సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ, కింగ్ మేకర్ అనుకునే బాబు ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించిన పేర్ని నాని.., చేతకాని పవన్ కల్యాణ్ కు కోతలెక్కువ అని ఎద్దేవా చేశారు. ఏపీ రాష్ట్ర చరిత్రలో ఒక మైలు రాయి కొత్త జిల్లాలు నిలుస్తాయన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసమే కొత్తగా 13 జిల్లాలు ఏర్పాటు చేశామని.., ప్రజల ఆకాంక్షల మేరకు నడిచే ప్రజా ప్రభుత్వం ఇదని స్పష్టం చేశారు. స్వామి భక్తితో బాబు దగ్గర పనోడులా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలున్నాయంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ హయాంలో పవన్ కల్యాణ్ తీసుకున్న బాధ్యతలకే దిక్కూ దివాణం లేదన్నారు.
అమరావతి రాజధానిని నిర్ణయించేటప్పుడు అఖిలపక్షాన్ని పిలవాలని కమ్యూనిస్టులు ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు తెరపైకి పవన్ కల్యాణ్, నారాయణ, రామకృష్ణ వస్తారని మండిపడ్డారు. ఎర్రజెండాను పసుపురంగులో ముంచిన మీరా మాట్లాడేదని ప్రశ్నించిన పేర్ని నాని.. సీపీఐని క్యాపిటలిస్టుల పార్టీ ఆఫ్ ఇండియాగా మార్చేశారని ఎద్దేవా చేశారు. సీపీఐ (చంద్రబాబు) అని పేరు పెట్టుకుంటే బాగుంటుందేమో..! అంటూ సెటైర్లు వేశారు.
ప్రతి పార్లమెంట్‌ను ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామని పాదయాత్రలో ఇచ్చిన మాటను సీఎం జగన్ తూచ తప్పకుండా అమలు చేస్తూ.. 25 అని చెప్పి ఈరోజు 26 జిల్లాలను ఏర్పాటు చేశారన్నారు. వినేవారు ఉంటే చంద్రబాబు పెద్ద పెద్ద డైలాగులు చెబుతారని.., తనకున్న అనుభవం మీ ఊళ్లో మర్రి చెట్టుకు, వేప చెట్టుకు కూడా లేవని బాబు ప్రగల్భాలు పలికేవారన్నారు.
40 ఏళ్ల రాజకీయం నడిపిన కింగ్‌మేకర్, విజన్ 2020 అని కథలు చెప్పిన వ్యక్తి... కుప్పంను రెవెన్యూ డివిజన్ చేయాలంటూ అభ్యర్థించే స్థాయిలో జగన్ పరిపాలన చేయడం, పరిపాలనలో విప్లవాత్మకమైన ఎన్నో నిర్ణయాలు తీసుకోవడం అనేది పవన్ కల్యాణ్‌కు, సీపీఐ నారాయణ, రామకృష్ణలకు ఎందుకు కనిపించడం లేదనేది అర్థం కావడం లేదన్నారు.
సీఎం జగన్ కొత్త జిల్లాలకు శ్రీకారం చుట్టిన వెంటనే పవన్ కల్యాణ్‌ను తెరమీదకు వదిలారని.., చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం, పవన్ లుంగీ - పంచె కట్టుకుని మాటమాటకు కలిసేవాడన్నారు. ఏటపాక ఏ జిల్లాలోనిది? అల్లూరి సీతారామరాజు జిల్లాలోనిదికాదా? కుక్కునూరు ఏ జిల్లాలోనిది? కుక్కునూరుకు ఏలూరు జిల్లా కేంద్రం అయితే, పాడేరు వెళ్లాలంటారు?. ఇది చూస్తుంటే సమస్యల పట్ల కనీస అవగాహన కూడా లేకుండా రాతలు, మాటలా? అని పేర్ని నాని ప్రశ్నించారు. చంద్రబాబు దగ్గర నుంచి ఒక ఫ్యాక్స్, వాట్సాప్, మెయిల్ వెళుతుందని.., దాన్ని జనసేన లెటర్ హెడ్ మీద అచ్చేసి, ఒక సంతకం గీకేసి మీడియాకు పంపించడం పవన్ కు రివాజుగా మారిందని ఎద్దేవా చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.