ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మంత్రివర్గం (AP Cabinet) గురువారం చివరిసారిగా భేటీ అయింది. కేబినెట్లోకి కొత్తమంత్రులు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతమున్న మంత్రులు రాజీనామా చేస్తున్నారు. దీంతో సెక్రటేరియట్లోని మంత్రుల పేషీల్లో సందడి నెలకొంది. మంత్రిగా చివరి రోజు కావడంతో రాష్ట్ర రవాణా, సమాచార, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని (Perni Nani) మీడియాతో గెట్ టు గెదర్ నిర్వహించారు. ఈ సందర్భంగా పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఊపిరి ఉన్నంత వరకు మీడియాను గుర్తు పెట్టుకుంటానని.. తనకు నాకు మీడియా చేసిన సహాయం అమోఘమని అభిప్రాయపడ్డారు. ఈ మూడేళ్ళలో మీడియా మిత్రులు అందరినీ పేరుతో పిలిచేఅంత దగ్గరయ్యారన్నారు. మంత్రి గా అవకాశం ఇచ్చిన జగన్ రుణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేని భావోద్వేగానికి గురయ్యారు.
పేర్ని నాని ఇచ్చిన విందులో మంత్రులు కొడాలి నాని, బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా పాల్గొన్నారు. పలు చానళ్లు, పత్రికలకు సంబంధించిన మీడియా ప్రతినిథులను పేర్ని నాని పేరుపేరునా పలుకరించారు. అనంతరం మంత్రివర్గ సమావేశానికి హాజరయ్యారు. తన మంత్రి పదవి గురించి ముందుగానే పేర్ని నాని క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రవాణా శాఖకు సంబంధించిన సమావేశంలో పాల్గొన్న ఆయన.. కొత్తమంత్రికి అన్ని విధాలుగా సహకరిస్తానని.. అవసరమైన సీఎంతో కూర్చొని సమస్యలు పరిష్కరిస్తానని స్పష్టం చేశారు.
ఇక చివరి కేబినెట్ సమావేశంలో అజెండాలోని అంశాలపై చర్చ తర్వాత మంత్రులు రాజీనామాలు చేయనున్నారు. ఈనెల 11వ తేదీన కొత్త మంత్రుల ప్రమాస్వీకారం ఉండటంతో 10వ తేదీ నాటికి జాబితా బయటకు వచ్చే అవకాశముంది. సామాజిక వర్గాలు, కొత్త జిల్లాల వారిగా కొన్ని పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి.
కొత్త కేబినెట్ లో తొమ్మిది మంది బీసీలు, ఆరుగురు ఎస్సీలు, ముగ్గురు కాపులు, ముగ్గురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు, ఇద్దరు ఎస్టలు, ఒక కమ్మ, ఒక మైనార్టీ వర్గానికి చెందిన వారికి అవకాశం ఇవ్వాలని జగన్ నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఐతే వైశ్య, బ్రాహ్మణ సామాజిక వర్గాలకు చోటు ఉంటుందా లేదా అనేది సస్పెన్స్ గా మారింది. వీటిలో చివరి నిముషంలో చిన్నచిన్న మార్పులు జరిగే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది.
బీసీల్లో ప్రస్తుత మంత్రులు గుమ్మనూరు జయరాం, చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణలను కొనసాగిస్తారన్న వార్తలు వస్తున్నాయి. వీరితో పాటు కొలుసు పార్థసారథి, జోగి రమేష్, విడదల రజిని, ఉష శ్రీచరణ్, పొన్నాడ సతీష్, తమ్మినేని సీతారామ్, ధర్మాన ప్రసాదరావు పేర్లు వినిపిస్తున్నాయి. ఎస్సీ వర్గం నుంచి మేరుగ నాగార్జున, ఎలీజాతో పాటు మరికొందరి పేర్లు ప్రచారంలో ఉన్నాయి.
రెడ్డి సామాజిక వర్గంలో నెల్లూరు జిల్లా నుంచి కాకాణి గోవర్ధన్ రెడ్డి, కర్నూలు నుంచి శిల్పా చక్రపాణి రెడ్డితో పాటు రోజా, చెవిరెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. కాపు సామాజిక వర్గంలో ముగ్గురికి ఛాన్స్ దక్కనుందట. గతంలో నలుగురు కాపులు మంత్రివర్గంలో ఉండగా ఈసారి మూడు తగ్గించినట్లు తెలుస్తోంది. వీరిలో దాడిశెట్టి రాజా, గుడివాడ అమర్నాథ్ తో పాటు సామినేని ఉదయభాను, అంబటి రాంబాబులో ఒకరికి ఇచ్చే అవకాశమంది. కమ్మ సామాజిక వర్గం నుంచి కొడాలి నాని స్థానంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి పేర్లు వినిపిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.