ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఇటీవల కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. పాతమంత్రుల్లో 11మందిని కొనసాగించిన జగన్.. 15మంది కొత్తవారికి అవకాశం ఇచ్చారు. ఐతే మంత్రిగా ఛాన్స్ దక్కించున్నవాళ్లు, రెండోసారి కొనసాగింపు పొందిన వాళ్లు సీఎం జగన్ (CM YS Jagan) పై ఎక్కడా లేని స్వామిభక్తి ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ప్రమాణస్వీకారం చేసిన సమయంలో ఒకళ్లిద్దరు తప్ప మిగిలిన మంత్రులంతా జగన్ కాళ్లకు నమస్కరించారు. సీఎం కంటే వయసులో పెద్దవారు కూడా ఆయన కాళ్లమీద పడిపోయారు. ఆ తర్వాత కూడా అవకాశం వచ్చినప్పుడల్లా సీఎం జగన్ ను పొగడ్తలతో ముంచెత్తిన సందర్భాలు చాలా ఉన్నాయి. తాజగా ఓ మంత్రి చేసిన పని.. చూపిన స్వామిభక్తి అందర్నీ ఆశ్చర్యపరిచింది.
రెండోసారి మంత్రిగా అవకాశం వచ్చిన వారిలో బీసీ సంక్షేమ, సమాచారశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ఒకరు. ఛాన్స్ దొరికినప్పుడల్లా సీఎ జగన్ ను దైవంతోనూ, ప్రతిపక్షాలను రాక్షసులతోనూ పోలుస్తూ విమర్శిస్తుంటారాయన. అలాగే సీఎంను ఆరాధించండండూ పదవీ బాధ్యతలు చేపట్టిన సమయంలో మీడియాకు సలహాలు కూడా ఇచ్చారు. జగన్ ను ఆరాధిస్తేనే పదవి వచ్చిందని కూడా చెప్పారు. తాజాగా కొనసీమ జిల్లాలో అమలాపురంలో జరిగిన మాజీ ఎమ్మెల్యే కుడుపూడి చిట్టబ్బాయి సంస్మరణ సభలో మంత్రులు చెల్లుబోయిన వేణు, పినిపే విశ్వరూప్, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ మార్గాని భరత్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ఇది చదవండి: చిరంజీవి ఇంటికెళ్లిన మంత్రి రోజా.. ఆచార్య రిలీజ్ రోజే మీటింగ్.. ఏం చర్చించారంటే..!
ఈ సభలో ప్రసంగించిన మంత్రి వేణు మరోసారి పార్టీ పైన, పార్టీ ప్రధాన నేతల పట్ల తనదైన శైలిలో స్వామిభక్తిని చాటుకున్నారు. ప్రసంగిస్తున్న సమయంలో వైవీ సుబ్బారెడ్డి ముందు మోకరిల్లి నమస్కారం చేశారు మంత్రి వేణు. మంత్రి చర్యతో అక్కడున్నవాళ్లంతా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. మంత్రి చర్యతో వైవీ సుబ్బారెడ్డి కూడా ఒకింత అసౌకర్యానికి గురయ్యారు.
ఐతే పార్టీ ముఖ్యనేతల పట్ల మర్యాదగా, హుందాగా వ్యవహరించాల్సిందిపోయి.. మరీ ఇంత భక్తిని ప్రదర్శించడం అవసరమా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఎంత రెండోసారి మంత్రి పదవి వస్తే మాత్రం పార్టీ ముఖ్యనేతల ముందు మోకరిల్లాల్సిన అవసరమేముందంటూ అక్కడున్న కార్యకర్తలు చెవులు కొరుక్కున్నట్లు ప్రచారం జరుగుతోంది. పైగా ఓ బీసీ నాయకుడి సభలో కులాన్ని ప్రస్తావిస్తూ ఆలా ప్రవర్తించడం విమర్శలకు తావిస్తోంది. మరి ఈ ఘటనపై మంత్రి ఎలాంటి వివరణ ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే మంత్రులు జగన్ ముందు మోకరిల్లారంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో మంత్రి వేణు చర్య ఆ పార్టీలకు కొత్త ఆయుధాన్నిచ్చిందన్న చర్చ జరుగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ysrcp