ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీ (AP Assembly) లోపల, బయట వైసీపీ (YSRCP), టీడీపీ (TDP) నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బడ్జెట్ పై జరగాల్సిన చర్చ రాజకీయ విమర్శలు, ఆరోపణలతో హోరెత్తుతోంది. ఓ వైపు జంగారెడ్డిగూడెం ఇష్యూ.. మరోవైపు పెగాసస్ అంశంపై రెండు పార్టీలు ఢీ అంటే ఢీ అనే విధంగా విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యేలపై మంత్రి పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు బయటకు వచ్చి, శాసనసభలో నిస్సిగ్గుగా మేము ఈలలు వేశాము, అల్లరి చేశాం.. అని చెప్పే పరిస్థితి ఉందంటే... ఇంతకన్నా బరితెగింపు, ఇంతకన్నా దారుణం ఏమైనా ఉందా అని పెర్ని నాని ప్రశ్నించారు.
ఒక్కసారి ప్రజల చేత ఓట్లు వేయించుకుని గెలిచి, చట్ట సభల్లోకి అడుగు పెట్టాక, మీకు గతంలో ఎన్ని అవలక్షణాలు ఉన్నా చట్ట సభల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంటుందని పేర్ని నాని అన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలంతా సభను దిగజార్చే ప్రయత్నం చేస్తే.. మీ నియోజకవర్గాల ప్రజలు మీ గురించి ఏమనుకుంటారో అన్న ఇంగిత జ్ఞానం కూడా ఉండక్కర్లేదా..? అని అన్నారు. ఇప్పటికేనా వారి బుద్ధి మార్చుకోవాలని హితవు పలికారు.
తమను రోజూ సస్పెండ్ చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారని.. శాసనసభలో వారి అల్లరి చిల్లర రాజకీయాన్ని భరించలేక గత్యంతరం లేకే... సభ నిర్వాహణ కోసమే బయటకు పంపిస్తున్నా వారి వ్యవహార శైలి మార్చుకోవడం లేదన్నారు.
ఇక ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న నరసాపురం జిల్లాకు భీమవరం కేంద్రంగా ఎంపిక చేయడంపై మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు చేసిన కామెంట్స్ ను పేర్ని నాని ఖండించారు. వైసీపీ ఎమ్మెల్యేని గెలిపించి తప్పుచేశాననడం సరికాదన్న ఆయన.. బాధ్యతాయుతమైన పదవులు ఎన్నో చేసి, ప్రజా జీవితంలో సుదీర్ఘకాలం పనిచేసిన కొత్తపల్లి సుబ్బారాయుడు, ఏ రకంగా ప్రవర్తించాలో, ఏం మాట్లాడాలో కూడా తెలియని వ్యక్తిలా మాట్లాడి, ఆయన విలువని ఆయనే తగ్గించుకున్నారని అభిప్రాయపడ్డారు. నరసాపురానికి జిల్లా కేంద్రంగా భీమవరాన్ని ప్రభుత్వం ప్రకటించిందని.., దానికీ, నరసాపురం ఎమ్మెల్యేకు ఏం సంబంధం..? అని ప్రశ్నించారు. భీమవరం అనేది... నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు అందుబాటులో ఉంటుందనే జిల్లా కేంద్రంగా ఎంపిక చేశామన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.