జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) తనదైన శైలిలో సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో పెద్ద జోకర్ అని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో మళ్లీ భీమవరం, గాజువాక నుంచి పోటీ చేస్తారా ? అని ప్రశ్నించారు. అసలు జనసేన 25 సీట్లకు మించి పోటీ చేస్తుందా ? అని అన్నారు. అసలు ఎవరితో కలిసి పోటీ చేస్తారని నిలదీశారు. ఈ నాలుగు ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సమాధానం చెబితే ఆయనకు దండం పెడతానని అన్నారు. రాజకీయాల్లో ఎవరూ తాను పెద్ద జ్ఞానిని అని చెప్పుకోరని.. అలా చెప్పుకుంటే వారంతా అజ్ఞాని మరొకరు ఉండరని పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి అన్నారు. జనసేన(Janasena) ముమ్మాటికీ రౌడీ సేన అని మరోసారి ఆరోపించారు. విప్లవ సేన అని చెప్పుకునే వాళ్లు కమ్యూనిస్టులతో కలిసి మళ్లీ మోదీతో కలుస్తారా ? అని ప్రశ్నించారు.
సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వులను మంత్రి అంబటి రాంబాబు స్వాగతించారు. సుప్రీం వ్యాఖ్యలు వికేంద్రీకరణకు బలాన్ని ఇస్తున్నాయని అన్నారు. గ్రాఫిక్స్ చూపించారు తప్ప అమరావతిలో నిర్మాణాలు చేయలేదని అన్నారు. రైతుల వేషాలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని అనుకున్నారని ఆరోపించారు. రాజధానిని 3 నెలలు లేదా 6 నెలల్లో కట్టాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. న్యాయస్థానాల పని న్యాయస్థానాలు.. ప్రభుత్వాల పని ప్రభుత్వాలు చేయాలని అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులతో అమరావతి యాత్రకు శాశ్వత విరామం ఇచ్చారని మంత్రి అంబటి రాంబాబు కామెంట్ చేశారు.
అంతకుముందు ఏపీ రాజధాని అమరావతి అంశంపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఏపీ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై పూర్తిస్థాయి స్టే ఇచ్చేందుకు నిరాకరించినా.. ఏపీ ప్రభుత్వానికి ఊరట కలిగించేలా పలు అంశాలపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని నిర్మాణాలపై హైకోర్టు విధించిన కాలపరిమితికి సంబంధించి మాత్రమే సుప్రీంకోర్టు స్టే విధించింది. అలాగే రాజధానిపై అసెంబ్లీకి చట్టం చేసే అధికారం లేదన్న హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ అంశంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ జనవరి 31వ తేదీకి వాయిదా వేసింది. జస్టిస్ కేఎం జోసెఫ్, బీవీ నాగరత్న ఆధ్వర్యంలోని ధర్మాసనం తాజా ఆదేశాలు జారీ చేసింది.
Breaking News: ఏపీ సర్కార్ కు బిగ్ షాక్.. స్టే ఇవ్వడానికి సుప్రీం నిరాకరణ
నెల రోజుల్లో కొన్ని పనులు, ఆరు నెలల్లో మరికొన్ని పనులు పూర్తి చేయాలన్న కాల పరిమితులపై స్టే విధించింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు పలు వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు ఏమైనా టౌన్ ప్లానరా? ఇలాంటి అంశాల్లో నైపుణ్యం లేకుండా ఆదేశాలిస్తారా? కోర్టులు ఎప్పటికీ ప్రభుత్వాలు కాదని పేర్కొంది. అలాంటి ఆదేశాలు ఇవ్వొచ్చా? మీరే ప్రభుత్వమైతే అక్కడ క్యాబినెట్ ఎందుకు? హైకోర్టు ప్రభుత్వంలాగా వ్యవహరిస్తోందా?అని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వం తరఫున కేకే వేణుగోపాల్, నిరంజన్ రెడ్డి, శ్రీరామ్ అనే న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. హైకోర్టు ఆదేశించిన ఏడు అంశాలపై స్టే ఇవ్వాలని న్యాయవాదులు కోరగా, కాల పరిమితికి సంబంధించిన అంశాలపై మాత్రమే సుప్రీంకోర్టు స్టే విదించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Pawan kalyan