అసెంబ్లీ సమావేశాల (AP Assembly Sessions) నిర్వహణకు ఏపీ ప్రభుత్వం సమాయత్తమవుతోంది. సెప్టెంబరు 19 నుంచి శాసనసభను నిర్వహించాలని భావిస్తోంది. సెప్టెంబరు 7న జరిగే కేబినెట్ సమావేశంలో (AP Cabinet Meeting) ఎజెండాను నిర్ణయించే అవకాశం ఉంది. వారం పాటూ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని భావిస్తోంది. గత నెలలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని జగన్ సర్కార్ భావించినప్పటికీ... పలు కారణాలతో వాయిదా వేసింది. ఇక ఈ సమావేశాల్లో ఎలాగైనా మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెట్టాలన్న యోచనలో జగన్ (YS Jagan) ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ వ్యూహాలతోనే అసెంబ్లీ సమావేశాలను ఆలస్యంగా నిర్వహించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 24 నుంచి శరన్నవరాత్రులు మొదలుకానుండటంతో ఆలోపే అసెంబ్లీ సమావేశాలను ముగించవచ్చనే చర్చ కూడా జరుగుతోంది. సెప్టెంబరు 19 నుంచి 24 వరకు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించవచ్చని తెలుస్తోంది. దీనిపై ఏపీ ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
ఇక మూడు రాజధానుల బిల్లు (AP 3 Capitals Bill) మళ్లీ ప్రవేశపెట్టే అంశంపై.. ఈ నెల 7న జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఏపీ ప్రభుత్వం చర్చించనుంది. ఈసారి పక్కాగా బిల్లును ఆమోదింపజేసుకోవాలని భావిస్తోంది. మూడు రాజధానుల బిల్లు తీసుకువచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దానిపై రివ్యూ పిటిషన్ వేసే అంశంపై ప్రభుత్వం చర్చలు జరుపుతున్నట్లు అడ్వకేట్ జనరల్ ఇటీవల హైకోర్టు త్రిసభ్య ధర్మాసనానికి చెప్పారు. మూడు రాజధానుల బిల్లులో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నందున.. మరింత మెరుగైన బిల్లుతో వస్తామని సీఎం వైఎస్ జగన్ అప్పట్లోనే చెప్పారు. ఆ తరువాత ఇప్పటివరకు దాని గురిచి చర్చ జరగలేదు. ఈ నేపథ్యంలో ఈసారి బిల్లును ప్రవేశపెట్టాలని.. మూడు రాజధానులపై ఆలస్యం చేయకూడదని జగన్ భావిస్తున్నట్లు సమాచారం.
ఏపీ ప్రభుత్వం ఈసారి మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో... మరి ప్రతిపక్ష పార్టీ టీడీపీ వైఖరి ఎలా ఉంటున్న దానిపై హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది. బడ్జెట్ సమావేశాలను టీడీపీ బహిష్కరించింది. మళ్లీ సీఎంగానే అసెంబ్లీలోకి అడుగుపెడతానని చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) శపథం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు, టీడీపీ సభ్యులు అసెంబ్లీకి వస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఏపీలో టీడీపీ, వైసీపీ పార్టీల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. కుప్పంలో ఇరు వర్గాల కొట్లాటలతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి హాజరైతేనే బాగుంటుందని తెలుగు తమ్ముళ్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ వైఫల్యాలను చట్ట సభల్లో ఎండగడితేనే బాగుటుందని సూచిస్తున్నారు. మరి చంద్రబాబు నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP Assembly, Ap assembly sessions, Ap cm ys jagan mohan reddy, AP News