ఏపీలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ తరువాత ఎన్నికలకు సిద్ధం కావాలంటూ మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా యాక్టివ్ అయ్యారు. ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చనే ఆలోచనతో టీడీపీ నేతలను, శ్రేణులను ఆ దిశగా సమాయత్తం చేసే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరోవైపు అధికార వైసీపీని విమర్శించే విషయంలోనూ చంద్రబాబు జోరు పెంచారు. అయితే చంద్రబాబుకు వైసీపీ నుంచి సరైన స్థాయిలో కౌంటర్ ఇవ్వడంలో మంత్రులు, నేతలు విఫలమవుతున్నారనే చర్చ జరుగుతోంది. నిజానికి చంద్రబాబుకు ఘాటుగా కౌంటర్ ఇచ్చే విషయంలో మాజీమంత్రి కొడాలి నాని అందరికంటే ముందుంటారు.
మంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబుపై ఎప్పటికప్పుడు తనదైన శైలిలో విమర్శలు చేస్తూ మీడియాలో వ్యక్తిగా నిలిచారు మంత్రి కొడాలి నాని. చంద్రబాబుకు కౌంటర్ ఇవ్వాలంటే కొడాలి నాని ఎంట్రీ ఇవ్వాల్సిందే అన్నట్టుగా పేరు తెచ్చుకున్నారు. అలాంటి కొడాలి నాని కొంతకాలం నుంచి పూర్తిగా సైలెంట్ అయిపోయారు. మంత్రి పదవి నుంచి తప్పించిన తరువాత చంద్రబాబును, టీడీపీని విమర్శించే విషయంలో మునుపటి దూకుడును ప్రదర్శించడం లేదు. మిగతా నేతలు చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చినప్పటికీ.. వాటి ప్రభావం పెద్దగా ఉండటం లేదనే వాదన వైసీపీ వర్గాల్లోనే వినిపిస్తోంది.
ఇలాంటి సమయంలో మాజీమంత్రి కొడాలి నాని, సీఎం జగన్‌తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశమయ్యారు. రాజకీయ సమీకరణాలు, విపక్షాల పొత్తులు తదతర అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. మంత్రి పదవి తొలగింపు తర్వాత కొన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న కొడాలి నాని.. ప్రస్తుతం జగన్‌తో సమావేశం కావడం ఆసక్తిని కలిగిస్తోంది. ఇక విపక్షాల వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇవ్వాలని మాజీ మంత్రులకు జగన్ ఇప్పటికే సూచనలు చేసినట్లు తెలుస్తోంది.
Chandrababu: పొత్తులపై యూటర్న్ తీసుకున్నారా..? చంద్రబాబు మాట్లకు అర్థం అదేనా..?
అయితే మంత్రి పదవి నుంచి తప్పించినప్పటికీ విపక్షాలను కౌంటర్ చేసే విషయంలో తన దూకుడు ఏ మాత్రం తగ్గదని చెప్పిన కొడాలి నాని.. చంద్రబాబు, లోకేశ్, టీడీపీని టార్గెట్ చేసే విషయంలో అప్పటి ఫైర్ చూపించడం లేదు. దీంతో ఈ విషయంలో సీఎం జగన్ స్వయంగా కొడాలి నానిని పిలిపించుకుని తగిన సూచనలు చేశారనే ఊహాగానాలు మొదలయ్యాయి. మరి సీఎం జగన్‌తో సమావేశం తరువాత కొడాలి నాని టీడీపీని టార్గెట్ చేసే విషయంలో తన మనుపటి విశ్వరూపాన్ని చూపిస్తారా ? లేక కొన్ని రోజుల నుంచి ఉంటున్నట్టుగానే సైలెంట్‌గా ఉండిపోతారా అన్నది వైసీపీ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Kodali Nani