విదేశాల్లో క్యాసినో వ్యవహారం (Casino Issue) లో ఈడీ దాడులు (ED Raids) ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో హైదరాబాద్ (Hyderabad) కు చెందిన చికొటి ప్రవీణ్, మాధవరెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై దాడులు చేసిన ఈడీ విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో బడాబాబులు జూదం ఆడేందుకు విదేశీ పర్యటనలు ఏర్పాటు చేయడమే కాకుండా, హవాలా, మనీ లాండరింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ నోటీసులిచ్చింది. ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రజాప్రతినిథుల పాత్ర ఉందన్న ఊహాగానాలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. సంక్రాంతి సందర్భంగా కృష్ణా జిల్లా (Krishna District) గుడివాడలో ఏర్పాటు చేసిన క్యాసినో వెనుక చికోటి ప్రవీణ్ ఉండటంతో మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani) పై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో గురువారం గుడివాడలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించిన కొడాలి నాని.. చికోటి ప్రవీణ్ వ్యవహారంపై స్పందించారు. టీడీపీ నేతలకు దమ్ముంటే క్యాసినో వ్యవహారంలో ఈడీ ద్వారా తనను అరెస్టు చేయించాలని సవాల్ చేశారు. బోడి గుండుకు మోకాలికి ముడి పెట్టేలా.., చికోటీపై ఈడీ రైడ్స్ ను టీడీపీ నేతలు తమకు అంటగడుతున్నారని కొడాలి నాని మండిపడ్డారు.
గుడివాడలో క్యాసినో అంటూ వచ్చిన టీడీపీ నిజనిర్ధారణ కమిటీ.. ఆ నివేదికలను ఈడీకి అందించాలని, ఎన్ని వందల కోట్లు చేతులు మారాయో ఆధారాలు ఇవ్వాలని ఛాలెంజ్ చేశారు. “దేశంలో ఏం జరిగినా చంద్రబాబు భజన బృందం, జగన్ కు మాకు ముడి పెడుతున్నారని.., పలావ ప్యాకెట్లకు ఆశపడే వ్యక్తులు మీడియా ముందుకు వచ్చి పిచ్చికుక్కల మాదిరి మొరుగుతున్నారటూ” ఘాటు వ్యాఖ్యలు చేశారు కొడాలి నాని. గుడివాడలో క్యాసినో అంటూ ఉదరగొట్టిన చంద్రబాబు అండ్ కో ఏం సాధించారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ పైనా, తమపైన ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారాయన.
ఇదిలా ఉంటే చికోటి ప్రవీణ్, మాధవ రెడ్డిలు గోవా క్యాసినోలను నిర్వహించడంతో పాటు శ్రీలంక, నేపాల్, ఇండోనేసియా, థాయ్‌లాండ్‌లో క్యాసినోలకు ప్రముఖలను తీసుకెళ్తున్నారు. మనదేశానికి చెందిన రాజకీయ నాయకులు, సంపన్నులకు ప్రత్యేకమైన టూర్లు ఏర్పాటు చేశారు. రానుపోను ఖర్చులతో పాటు ఐదు రోజులు ఉండేందుకు ఒక్కొక్కరి నుంచి రూ.3 లక్షలు వసూలు చేస్తున్నారు.
ఇటీవల నేపాల్‌లో క్యాసినోకు 10 మంది టాలీవుడ్ ప్రముఖులు వెళ్లినట్లు ఈడీ గుర్తించింది. ఈ జూదం పర్యటనలతో ఫెమా నిబంధనలను ఉల్లంఘించినట్లు పేర్కొంది. విదేశాల్లో జూదం ఆడేందుకు దొడ్డిదారిన డబ్బులను తీసుకెళ్తున్నారని.. అక్కడ గెల్చుకున్న డబ్బును కూడా అక్రమ మార్గాల్లోనే ఇండియాకు తీసుకొస్తున్నారని తేలింది. ఇటీవల హైదరాబాద్ (Hyderabad) చెందిన ఓ వ్యక్తి పెద్ద మొత్తంలో డబ్బును గెలిచి.. దానిని హవాలా మార్గంలో ఇక్కడికి మళ్లించినట్లు ఈడీకి సమాచారం అందింది. దాని ఆధారంగానే క్యాసినో టూర్ ఆపరేటర్లపై దాడులు చేస్తోంది ఈడీ.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.