P Bhanu Prasad, News18, Vizianagaram
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్నదొర (Minister Rajanna Dora) సంచలన కామెంట్స్ చేశారు. మన్యం పార్వతీపురం జిల్లా నియోజకవర్గ ప్లీనరీలో పాల్గొన్న ఆయన.. వైసీపీలో తాను ఎదుర్కొన్న.., ఎదుర్కొంటున్న పరిస్థితులను వివరించారు. గత ప్రభుత్వంలో టీడీపీలో చేరితే.. మంత్రి పదవితో పాటు తనకు రూ.30 కోట్లు ఇస్తామన్నారని, అమరావతిలో మంచి బిల్డింగ్ ఇస్తామని ఆఫర్ చేశారని.. అంతేకాదు పిల్లలను చదివిస్తామని కూడా తనకు రేటు పెట్టారంటూ సంచలన ఆరోపణలు చేసారు. అయినా జగన్ పై అభిమానంతో తాను పార్టీని వీడలేదని రాజన్న దొర తెలిపారు. ఒకవేళ తాను పార్టీని వీడినా తన గుండెలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, సీఎం జగన్ ఉంటారని టీడీపీ నేతలకు చెప్పానన్నారు.
గత ప్రభుత్వ పాలనకు, ప్రస్తుత పాలనకు ఉన్న తేడాను వైసీపీ నాయకులు, కార్యకర్తలు గుర్తించుకోవాలన్నారు. సమ సమాజ పాలన, నవ సమాజ పాలన వైసీపీ పాలన అని అన్నారు. పార్టీని నమ్ముకొని ఉంటే.. కార్యకర్తలు, నాయకులకు అంచెలంచెలుగా ఒక్కొక్క అవకాశం వస్తుందని గుర్తించుకోవాలన్నారు. తాను పార్టీని నమ్ముకున్నాను కానీ అమ్ముడు పోలేదన్నారు రాజన్న దొర. ఈ రోజు అవకాశం రాని వారికి, 2024లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవకాశాలు తప్పక వస్తాయన్నారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, తనకన్నా జూనియర్ అయినా పుష్పశ్రీవాణికి మంత్రి పదవి ఇచ్చినప్పుడు కూడా పార్టీ కి వ్యతిరేకంగా మాట్లాడలేదని, ఎక్కడా అక్కసు వెళ్లగక్కలేదన్నారు. మీడియాలో తనపై ఏవేవో రాసుకున్నా.. తాను మాత్రం పార్టీ పెద్దల నిర్ణయానికి విధేయుడినే అని స్పష్టం చేశారు. కానీ తాను ఎక్కడా మీడియాకు ఎక్కలేదని, మంత్రి పదవి ఇవ్వలేదని, వాట్సప్ మెసేజ్ లు పంపలేదన్నారు. తాను కొంచెం చిరాకుగా మాట్లాడుతాను గానీ, నా మనసు వెన్న అని పుష్పశ్రీవాణి కూడా చెప్పిన సంగతిని రాజన్నదొర గుర్తుచేశారు. పార్టీని నమ్ముకొని ఉంటే పదవులు వస్తాయని, పార్టీకోసం పని చేయాలన్నారు.
ఇక అమ్మఒడి పథకంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలని రాజన్నదొర కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 75 శాతం హాజరు ఉంటేనే అమ్మఒడి ఇస్తామని ప్రభుత్వం చెప్పందని, 2019లోనే అందుకు సంబంధించిన జీవో ఇచ్చారన్నారు. ఇలా అమ్మఒడిపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తుంటే.. కార్యకర్తలు, నాయకులు ఎందుకు వాస్తవాలతో తిప్పి కొట్టడం లేదంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో 25 లక్షల మందికి చేయూత ఇస్తున్నామని, కానీ ఎందుకు ప్రజలకి వివరించ లేకపోతున్నామని వైసీపీ నాయకులను , కార్యకర్తలను ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా 62 లక్షల మందికి వివిధ రకాలైన పింఛన్లు ఇస్తున్న దేశంలో ఏకైక రాష్ట్రం ఏపీ అన్నారు. ప్రజలకు ఇంత మంచి చేస్తున్నా ప్రచారం చేసుకోలేకపోతున్నామని రాజన్నదొర ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ysrcp