మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయనకు సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో మంచి సంబంధాలున్నాయని, చిరంజీవిని ప్రతినిధిగా పేర్కొంటూ 2027 వరకు డెలిగేట్ ఐడి ఉందని అన్నారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశాక చిరంజీవి (Megastar Chiranjeevi) రాజ్యసభ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా ఉన్నారని రుద్రరాజు పేర్కొన్నారు. ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలపై పూర్తి ఫోకస్ పెట్టారని అన్నారు. కాగా కొన్ని రోజుల క్రితం రాజకీయాలకు నేను పూర్తి దూరంగా ఉన్నానని చిరంజీవి (Megastar Chiranjeevi) పేర్కొన్నారు. ఈ క్రమంలో ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి.
క్షేత్రస్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం చర్యలు చేపట్టామని రుద్రరాజు అన్నారు. ఈ సందర్బంగా జగన్ సర్కార్ పై మండిపడ్డారు. రాష్ట్రంలో నియంత్రిత్వ పాలన కొనసాగుతుంది. అక్రమాలు, అత్యాచారాలు వంటివి పెరిగిపోయాయని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ, కేంద్రంలో బీజేపీ ప్రజా వ్యతిరేక పాలనపై జనం విసిగిపోయారన్నారు.
పొత్తులపై కీలక వ్యాఖ్యలు..
2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని, అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తుందని అన్నారు. ఇందుకోసం జిల్లాల వారిగా కమిటీలు, నాయకులను సిద్ధం చేసి సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతీ ఒక్కరు కష్టపడాలని సూచించారు. ఈనెల 26 నుంచి మార్చి 26 వరకు కార్యకర్తలు పాదయాత్ర చేపట్టాలని రుద్రరాజు పిలుపునిచ్చారు.
ప్రస్తుతం చిరంజీవి సినిమాలపై పూర్తి దృష్టి సారించారు. వాల్తేరు వీరయ్య ఇచ్చిన భారీ సక్సెస్ ను మెగాస్టార్ ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు భోళా శంకర్ సినిమాను పట్టాలెక్కిస్తున్నాడు. అయితే రాజకీయాలకు దూరంగా ఉన్న చిరు రాబోయే రోజుల్లో ఎలాంటి స్టెప్ తీసుకుంటారనేది ఇప్పుడు మరోసారి చర్చకు వచ్చింది. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో టాక్ ఆఫ్ ఏపీగా చిరంజీవి రాజకీయం గురించి మాట్లాడుకుంటున్నారు. మరి చిరు మనసులో ఏముందో మరి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhrapradesh, Ap, AP Congress, AP News, Congress, Megstar chiranjeevi