ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వరుసగా నాలుగో ఏడాది వైఎస్ఆర్ రైతు భరోసా (YSR Rythu Bharosa) కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. రైతుల ఖాతాల్లో నగదు జమకు శ్రీకారం చుట్టిన జగన్ ఎప్పటిలాగే ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ముఖ్యంగా టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu), జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పై విమర్శలు చేశారు. రైతులకు అన్ని రకాలుగా మేలు చేస్తున్నా ప్రతిపక్షాలు మాత్రం రంధ్రాలు వెతికే పనిలో ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. అంతేకాదు పవన్ కల్యాణ్ చేపట్టిన కౌలు రైతు భరోసా కార్యక్రమంపై జగన్ తొలిసారి స్పందించారు. రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు రూ.7లక్షల చొప్పున సాయం అందిస్తునట్లు స్పష్టం చేసిన జగన్.., ప్రభుత్వం ఇక రైతులకు ఇంత చేస్తున్నా చంద్రబాబుకు దత్తపుత్రుడైన ఓ వ్యక్తి.. రైతుల పరామర్శ పేరుతో బయలుదేరి రూ.7లక్షలు అందని ఒక్క రైతు కుటుంబాన్ని కూడా చూపలేకపోయారంటూ పవన్ కల్యాణ్ ను విమర్శించారు.
రైతుల కష్టాలు తెలియని, అర్ధంకాని ఏ నాయకుడికీ రాజకీయాల్లో ఉండే అర్హత లేదని జగన్ మండిపడ్డారు. రైతులకు ఉచిత విద్యుత్ వద్దన్న నాయకుడు, వ్యవసాయం దండగ అన్న నాయకుడు, రైతులకు గుండెల మీద గురిపెట్టి కాల్పులు జరిపించిన నాయకుడు, రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసిన నాయకుడంటూ చంద్రబాబుపై మండిపడ్డారు జగన్. ఇలాంటి విషయాలను ప్రశ్నించకుండా ఇప్పుడు ప్రశ్నిస్తానంటూ దత్తపుత్రుడు బయలుదేరాడని ఎద్దేవా చేశారు సీఎం. ఇలాంటి వారిని చూపించి వాళ్లకు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదన్నారు.
రైతులకు మంచి చేయాలని ఏనాడూ ఆలోచించని గత ప్రభుత్వ నాయకులు.. ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదంటూ దష్ప్రచారం చేస్తున్నారన్నారు. అలాంటి వారికి రైతులో దగ్గరుండి వివరించాలన్నారు. 2014లో విడుదల చేసిన చంద్రబాబు.. ఆ తర్వాత పార్టీ వెబ్ సైట్ నుంచి కూడా తీసేశారని జగన్ ఆరోపించారు. మేనిఫెస్టోని చెత్తబుట్టలో పడేసిన చంద్రబాబు నైజాన్ని గుర్తించాలన్నారు. తాము మాత్రం అలా చేయడం లేదన్నారు.
చంద్రబాబు, మోదీ ఫోటోలను మేనిఫెస్టోలో పెట్టి ప్రజలను మోసం చేశారన్నారు. ఇలాంటి మోసాలను ప్రశ్నించని దత్తపుత్రుడ్ని ఏమనాలని నిలదీశారు జగన్. మంచి చేస్తున్న ప్రభుత్వంపై బురద జల్లేందుకు కొందరు లోపాలు వెతుకుతున్నారని మండిపడ్డారు. ఎన్నికలప్పుడు ఓ మాదిరిగా.. తర్వాత మరోలా ఉండే వ్యక్తి జగన్ కాదని.. ఏం చెప్పాడో.. అదే చేస్తాడని సీఎం స్పష్టం చేశారు. రుణమాఫీ పేరుతో రైతులకు రూ.15వేల కోట్ల ముష్టివేసినట్లు పడేసి వెళ్లిపోయిన వ్యక్తి చంద్రబాబు అంటూ జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైతులకు అండగా ఉంటున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Chandrababu Naidu, Pawan kalyan