Anna Raghu, Sr. Correspondent, News18, Amaravati
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం త్వరలో మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యమంత్రి కార్యాలయం (AP CMO) దీనికి వేదిక కాబోతోంది అని వినికిడి. "ప్రజాదర్బార్" కార్యక్రమం నిర్వహించి ముఖ్యమంత్రి నిత్యం ప్రజలను కలుస్తారని వైసీపీ (YSRCP) అధికారంలోకి వచ్చిన నాటి నుండి చెబుతూనే ఉన్నా ఇప్పటి వరకూ ఆ కార్యక్రమం చేపట్టలేదు. ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలోనైనా ప్రజలకు మరింత చేరువ కావాలనే ఉద్దేశ్యంతో సీఎం జగన్ వీలైనంత త్వరగా ప్రజాదర్బార్ నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నారని సీఎంఓ వర్గాలు అంటున్నాయి. ఐతే ఈ కార్యక్రమం ద్వారా జగన్ ప్రత్యక్షంగా ప్రజలను కలవడమా లేక ఫోన్ ద్వారా సమస్యలు స్వీకరించడమా అనేది ఇంకా తేలాల్సి ఉంది. ఈ కార్యక్రమానికి "జగనన్నకు చెబుదాం" అనే పేరు పరిశీలనలో ఉందని సమాచారం.
ఏ సమస్య ఐనా సరే ఫిర్యాదు చేసిన వెంటనే సంభంధిత అధికారులు స్పందించి తక్షణం చర్యలు తీసుకొని సదరు సమస్యను పరిష్కరించాలనే సదుద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా "స్పందన" కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. మొదట్లో వారం వారం "స్పందన" కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నేరుగా సమీక్షించేవారు. ఐతే తమ సమస్యలపై స్పందన కార్యక్రమంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారుల నుండి స్పందన కరువైందనే భావన ప్రజల్లో ఏర్పడింది. స్పందన పై వచ్చిన ఫిర్యాదులు చాలావరకు అపరిష్కృతంగానే మిగిలిపోతున్నాయనేది అభిప్రాయం వారిలో ఉంది. ఇప్పుడు ఇదే కార్యక్రమాన్ని మరింత మెరుగు పరచడమా లేక ఈ కార్యక్రమానికి సమాంతరంగా వేరొక కార్యక్రమాన్ని నిర్వహించడమా అనేదానిపై ఇంకా ఓ నిర్ణయానికి రావలసి ఉంది.
ఇటీవల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ప్రజలకు వచ్చే ప్రతి సమస్యకు ఖఛ్ఛితమైన పరిష్కారం చూపించవలసిన అవసరం ఉందని, దీని కోసం ఓ ప్రత్యేకమైన విధానం తీసుకురావలని ఆదేశించారు. ప్రజలు ఇచ్చే ప్రతి ఫిర్యాదుకూ పరిష్కారం చూపే విధంగా నూతన విధానం ఉండాలని ఆయన ఆదేశించారు. "స్పందన" కార్యక్రమం కంటే మరింత మెరుగ్గా, సమర్ధవంతంగా "జగనన్నకు చెబుదాం" కార్యక్రమం నిర్వహించాలని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రయత్నాలు ప్రారంభించిందని విశ్వసనీయ సమాచారం.
ఐతే ప్రభుత్వం మూడున్నరేళ్లుగా స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నా.. ఇంకా బెటర్ అనేలా మరో కార్యక్రమానికి సన్నాహకాలు చేస్తుండటంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. మరి ఇన్నాళ్లూ స్పందనలో అర్జీలు స్వీకరించడం, వాటికి నెంబర్లు కేటాయించడం, డెడ్ లైన్ సెట్ చేయడం వంటివన్నీ వర్కవుట్ కాలేదా..? గ్రామ సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి సమస్యను స్వీకరిస్తున్నా పనిచేయలేదా అనే చర్చ నడుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.