ఏపీ సీఎం వైఎస్ త్వరలోనే పూర్తిస్థాయిలో జనంలోకి వెళ్లనున్నారు. ఏప్రిల్ నుంచి ఆయన నేరుగా ప్రజలను కలవనున్నారు. వారితో కలిసి పల్లె నిద్ర చేయనున్నారు. ఏప్రిల్ నుంచి బస్సు యాత్రకు జగన్(YS Jagan) శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగా మండలంలో ఒకటి రెండు పల్లెలను ఎంచుకుని అక్కడే ప్రజలతో ముఖాముఖి కాబోతున్నారు. వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించబోతున్నారు. ఎన్నికలకు మరో ఏడాది సమయం మాత్రమే ఉండటంతో ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు.. ఆ దిశగా సమాయత్తం అవుతున్నాయి. ఓ వైపు ప్రజల్లో ఉంటూనే.. ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి.
టీడీపీ ముఖ్యనేత నారా లోకేశ్(Nara Lokesh) పది రోజుల క్రితమే సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. పాదయాత్ర(Padayatra) ద్వారా టీడీపీని మళ్లీ ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు తనవంతు కృషి చేస్తున్నారు. ఇక బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెడీ అవుతున్నారు. సమయం చూసుకుని చంద్రబాబు కూడా బస్సు యాత్ర చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత తొందరగానే ఎన్నికల ప్రచారం కోసం ప్రజల్లోకి వెళ్లాలని ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ భావిస్తున్నారు. ఇందుకోసం ఆయన ఏప్రిల్ నుంచి బస్సు యాత్ర చేయాలని అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఇందులో భాగంగానే మండలంలోని రెండు పల్లెల్లో పల్లె నిద్ర చేసే విధంగా వైసీపీ నాయకత్వం ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి ప్రతి మండలాన్ని టచ్ చేయాలనే ఆలోచనలో ఏపీ సీఎం జగన్ ఉన్నారని తెలుస్తోంది. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు విస్తృత ప్రచారం కల్పించాలనే యోచనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి.. వాటికి విపక్షాలు అడ్డుపడుతున్నాయని ఆరోపిస్తున్నారు.
ఇదే విషయాన్ని బలంగా జనంలోకి తీసుకెళితే.. మరోసారి తమ పార్టీకి అధికారం ఖాయమనే ధీమాతో ఉన్నారు ఏపీ సీఎం జగన్. నిజానికి సీఎం జగన్ గత ఏడాది బస్సు యాత్ర చేస్తారనే వార్తలు వచ్చాయి. కానీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు ప్రజల్లోకి వెళ్లడం ద్వారా ప్రచారాన్ని ముమ్మరం చేసినట్టు అవుతుందని.. ప్రతిపక్షాల విమర్శలకు చెక్ చెప్పొచ్చనే ఆలోచనలో వైసీపీ నాయకత్వం ఉంది. అందుకే వచ్చే ఎన్నికలు ఉండటంతో.. ఈ ఏడాది నుంచే సీఎం జగన్ జనంలోకి వెళతారని.. అందుకు తగ్గట్టుగా కార్యక్రమాలు రూపొందించుకునే పనిలో పడింది వైసీపీ నాయకత్వం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.