ఏపీలోని ప్రతిపక్షాలపై సీఎం జగన్ (AP CM YS Jagan) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో వైఎస్ఆర్ మత్స్యకార భరోసా (YSR Matsyakara Bharosa) కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్.. టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu Naidu), జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పై విమర్శలు గుప్పించారు. ప్రజలకు నేను ఇది చేస్తాను అనే చెప్పై దైర్యం ఆ దత్తపుత్రుడికి లేదంటూ పవన్ ను పరోక్షంగా విమర్శించారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల్లో 95శాతం పూర్తి చేశామని ఇంటింటికీ వెళ్లి చెప్పే నైతికత కేవలం మాకు మాత్రమే ఉందని జగన్ స్పష్టం చేశారు. తాము చేసే మంచిని దుష్టచతుష్టంతో పాటు దత్తపుత్రుడికి కడుపు మంట, ఈర్ష్య పుట్టుకొస్తుందన్నారు. ఆరోగ్యం బాగోలేకపోతే ఆరోగ్య శ్రీ ద్వారా జగనన్న వైద్యం చేయిస్తాడని.. కానీ ఈర్ష్య, కడుపు మంటకు మాత్రం వైద్యం దేవుడు మాత్రమే చేస్తాడని సీఎం సెటైర్లు వేశారు.
పరీక్ష పేపర్లు వీళ్లే లీక్ చేయించి.. లీక్ చేసిన వాడిని సమర్ధించే ప్రతిపక్షాన్ని ఎక్కడైనా చూశారా అని జగన్ ప్రశ్నించారు. కార్మిక మంత్రిగా ఉంటూ ఉద్యోగస్తులకు మంచి చేయాల్సింది పోయి ఆ డబ్బులు కొట్టేసిన నాయకుడిని విచారించడానికి వీల్లేదంటున్నవారిని ఎక్కడైనా చూశారా అని నిలదీశారు. కొడుక్కి మోసాలు, అబద్ధాలు నేర్పి పంపుతున్న చంద్రబాబు లాంటి తండ్రిని ఎక్కడైనా చూశారా అని ప్రశ్నించారు. మంత్రిగా పనిచేసిన మంగళగిరిలో ఓడిన సొంత పుత్రుడు, రెండు చోట్ల పోటీచేసి గెలవని దత్తపుత్రుడు మరొకరని.. ప్రజలను కాకుండా ఇలాంటి వారిని నమ్ముకున్న చంద్రబాబు లాంటి రాజకీయ నేతను ఎక్కడైనా చూశారా అని ప్రశ్నించారు. ప్రజలను నమ్మకుండా దత్తపుత్రుడ్ని, కొడుకుని నమ్ముకుంటున్న ఇలాంటి సీనియర్ నేతను చూశారా అని ప్రశ్నించారు.
పేదలు ఇళ్లస్థలాలను కూడా కొందరు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని.. వీరంటున్న అమరావతి అనే రాజధానిలో పేదలకు ఇళ్లు ఇస్తే కోర్టులో పిటిషన్ వేశారని జగన్ మండిపడ్డారు. ఇలాంటి రాబందులకు ప్రజలకు ఎలాంటి మంచి జరిగినా అస్సలు నచ్చదని విమర్శించారు. పేదలకు మంచి చేయడం కోసం రాష్ట్రానికి వచ్చే నిధులను కూడా అడ్డుకుంటున్నారన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, బ్యాంకుల నుంచి రావాల్సిన అప్పులను కోర్టులో పిటిషన్లు వేసి అడ్డుకుంటున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిని రాష్ట్ర ద్రోహులు అనాలా.. లేక దేశద్రోహులు అనాలా..? అని ప్రశ్నించారు.
గడపగడపకు వెళ్తున్న ప్రజాప్రతినిథులను చూసి ఓర్వలేక.. చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. 27ఏళ్లుగా కుప్పంగా ఉన్న చంద్రబాబుకు అక్కడ ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచన కూడా రాలేదన్నారు. ఈ రోజు జగన్ పాలనను మూడేళ్లు చూశాడో లేదో కుప్పంలో ఇల్లు కట్టుకుంటున్నారన్నారు. వక్రబుద్ధి ఉన్న దుష్టశక్తుల నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని దేవుడ్ని కోరుకుంటున్నట్లు జగన్ తెలిపారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.