ఏపీ ప్రభుత్వం, వైసీపీలో సీఎం జగన్ తరువాతి స్థానం ఎవరిదంటే ఎవరికైనా గుర్తొచ్చేది ఆ పార్టీ ముఖ్యనేతల్లో ఒకరైన సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy). ప్రభుత్వ సలహాదారుగా ఉంటూ ప్రభుత్వ వ్యవహారాలను చక్కబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి.. పార్టీ వ్యవహారాలను చక్కబెట్టడంలోనూ తనదైన పాత్ర పోషిస్తుంటారు. పార్టీ నేతల మధ్య తలెత్తే విబేధాలతో పాటు నేతల మధ్య సమన్వయం అంశాలను కూడా ఎక్కువగా సజ్జల దగ్గరే పరిష్కారమవుతుంటాయి. సజ్జల రామకృష్ణారెడ్డి చెబితే.. సీఎం జగన్ చెప్పినట్టే అని వైసీపీ నేతలు, శ్రేణులు భావిస్తుంటారు. అలాంటి సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడికి కూడా సీఎం జగన్(YS Jagan) కీలక బాధ్యతలు అప్పగించారు. ఏపీలో అధికార పార్టీ వైసీపీకి చెందిన సోషల్ మీడియా విభాగం బాధ్యతలను సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డికి(Sajjala Bhargav Reddy) అప్పగిస్తూ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు.
నేడు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన భార్గవ్ రెడ్డి సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ సోషల్ మీడియాను మరింత బలోపేతం చేసే దిశగా చేపట్టాల్సిన చర్యలపై వారి మధ్య చర్చ జరిగింది. 2024 ఎన్నికలకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో విపక్షాలు టీడీపీ , జనసేన, బీజేపీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా మారిపోయాయి. అనేక అంశాలపై అధికార వైసీపీని ఆయా పార్టీలు సోషల్ మీడియా ద్వారా టార్గెట్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ సోషల్ మీడియాను కూడా మరింత యాక్టివేట్ చేయాలని భావించిన జగన్.. ఆ వింగ్‌కు భార్గవ్ రెడ్డిని చీఫ్‌గా నియమించారు. ఇక భార్గవ్ రెడ్డి ప్రస్తుతం వైసీపీ మీడియా వింగ్‌ను పర్యవేక్షిస్తున్నారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తి కావడంతో.. వచ్చే ఎన్నికలపై సీఎం జగన్ పూర్తిగా ఫోకస్ చేశారు. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేల పనితీరుపై రివ్యూలు చేస్తున్నారు. ఎమ్మెల్యేల పనితీరు ఏ రకంగా ఉందనే విషయాన్ని ఎప్పటికప్పుడు వారికి వివరిస్తూ.. పని చేసేవారికి మళ్లీ టికెట్లు వస్తాయని స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంలో ఎవరికీ మినహాయింపు ఉండదనే విషయాన్ని పదే పదే గుర్తు చేస్తున్నారు.
TDP: టీడీపీలో ఆ సీనియర్ నేత హవా ముగిసినట్లేనా..? చెక్ పెడుతున్న కీలక నేత..?
Viveka Murder Case: వివేకా హత్య కేసులో సీబీఐ చేతులెత్తేసిందా..? విచారణ ఈ నెల 22కు వాయిదా..?
తాజాగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు పార్టీ తరపున అబర్వర్లను కూడా నియమించారు సీఎం జగన్. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందనే విషయాన్ని అంచనా వేయడంతో పాటు అక్కడ పార్టీని బలోపేతం చేయడానికి ఏ రకమైన చర్యలు తీసుకోవాలనే అంశాలను ఈ అబ్జర్వర్లు ప్రభుత్వానికి వివరిస్తారని తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.