ప్రతిపక్షాలపై సీఎం జగన్ (AP CM YS Jagan) మరోసారి మండిపడ్డారు. శ్రీసత్యసాయి జిల్లాలో వైఎస్ఆర్ ఉచిత పంట బీమా పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి.. టీడీపీ (TDP), జనసేన పార్టీ (Janasena Party) లపై ఫైర్ అయ్యారు. చంద్రబాబు (Chandrababu), పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తీరును తప్పుబట్టారు. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మంచి చేస్తుంటే.. చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు రైతు సమస్యలపై రాజకీయం చేస్తున్నారని జగన్ మండిపడ్డారు.. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన ఆయన.. పరిహారం అందని ఒక్క రైతును చూపించలేకపోయారన్నారు. సీసీఆర్సీ కార్డు ఉండి నష్టపరిహారం అందించని ఒక్క రైతును చూపించాలన్న తన సవాల్ ను నిరూపించలేకపోయారని విమర్శించారు.
చంద్రబాబు హయాంలో ఆత్మహత్య చేసుకున్న 458 కుటుంబాలకు జగన్ ప్రభుత్వమే పరిహారం ఇచ్చిందన్నారు. అప్పుడు రైతులను పరామర్శించాలన్న ఆలోచన దత్తపుత్రుడుకి గుర్తుకు లేదన్నారు. ఇక తాము అమూల్ సంస్థను తీసుకొచ్చిన తర్వాతే చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ సంస్థ రైతులకు ధరలు పెంచి చెల్లిస్తోందని జగన్ చెప్పారు. గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు మరిస్తే ఎవరూ ప్రశ్వించలేదన్నారు. చంద్రబాబు ఏది అవసరమైతే పరుగెత్తుకుంటూ వచ్చి అదే పనిచేసే వ్యక్తి ఆయన దత్తపుత్రుడని ఎద్దేవా చేశారు. వీళ్లిద్దరూ తోడుదొంగల మాదిరి ప్రజలను మోసం చేశారని.. వారు రాజకీయాల్లో ఉండటానికి అర్హులేనా అని ప్రశ్నించారు.
ఈ మధ్య ప్రభుత్వం ఏం మంచి పనిచేసినా.. చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు, వారి అనుకూల మీడియా టాపిక్ డైవర్ట్ చేసేందుకు యత్నిస్తున్నాయని జగన్ ఆరోపించారు. చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు మీ దగ్గరకు వస్తే.. వారి మేనిఫెస్టోలోని హామీలపై నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు జగన్.
క్రాప్ హాలీడే అంటూ కోనసీమ రైతులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు పెట్టిన విత్తనాలు, ధాన్యం బకాయిలు జగన్ తీర్చినందుకు క్రాప్ హాలిడే అంటూ చంద్రబాబు, పవన్ ను ప్రశ్నిస్తున్నానను అన్నారు జగన్. కరోనా కారణంగా రెండేళ్ల విరామం తర్వాత టెన్త్ పరీక్షలు నిర్వహించామని.. అందులో 67శాతం మాత్రమే పాసయ్యారన్నారు. గుజరాత్ లో 65 శాతమే పాసయ్యారని జగన్ అన్నారు. టెన్త్ తప్పిన విద్యార్థులకు ఆత్మస్థైర్యం కోసం సప్లిమెంటరీ పరీక్షలను కూడా సాధారణ పాస్ గా పరిగణిస్తుంటే వీళ్లంతా రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా తాను మాత్రం ధైర్యంగా నిలబడతానని.. అందర్నీ ఎదుర్కొంటానని సీఎం జగన్ స్పష్టం చేశారు. కోనసీమకు అంబేద్కర్ పేరుపెడితే అల్లర్లు చేయించారని.. దళిత మంత్రి ఇంటి, ఓ బీసీ ఎమ్మెల్యే ఇంటినీ తగలబెట్టారని జగన్ మండిపడ్డారు. కోనసీమలో విధ్వంసం సృష్టించింది కూడా ప్రతిపక్ష పార్టీలేనని జగన్ ఆరోపించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Chandrababu Naidu, Pawan kalyan