GT. హేమంత్ కుమార్, తిరుపతి ప్రతినిధి, న్యూస్18, ఏపీ సీఎం జగన్ కు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. అయన్ను ఒక్క మాట అన్నా ఊరుకునేది లేదనే అభిమానులు చాలామందే కనిపిస్తారు. సామాన్య కార్యకర్తలే కాదు.. ప్రజా ప్రతినిధుల్లో సైతం ఆయనకు వీరాభిమానులు ఉన్నారన్నది అతిశయోక్తి కాదు. కొందరు మంత్రులు సైతం తాము జగన్ కు భక్తులం అని చెప్పుకుంటారు.. తాజాగా ఓ ఎమ్మెల్యే సీఎం జగన్ పై అభిమానం అందరికీ తెలిసేలా ఆలయాన్నే నిర్మించారు. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత పేదల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా నవరత్నాలను అమలు చేస్తూ వస్తున్నారు. పాదయాత్రలో ఇచ్చిన తొమ్మిది ముఖ్యమైన హామీలను ప్రజల దగ్గరకు తీసుకొచ్చి.. సంక్షేమ ఫలాలు అందిస్తున్నారు. అధికారం చేపట్టిన రెండేళ్ల కాలంలో అన్ని పథకాలు ఇప్పటికే 90 శాతం అమలు చేసినట్లు పార్టీ క్యాడర్., మంత్రులు చెబుతున్నారు. చెప్పడం ఏమో కానీ.. ఓ నియోజవర్గంలో సీఎం జగన్ పథకాల పేరుతో ఏకంగా ఆలయాన్ని కట్టేస్తున్నారు ఎమ్మెల్యే.. మున్సిపల్ కమిషనర్, ఎమ్మెల్యే చొరవతో జగనన్న నవరత్నాల దేవాలయం నిర్మించేశారు. ఆ దేవాలయంలో సీఎం జగన్ చేపడుతున్న పథకాలకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నమూనాను ఏర్పాటు చేసారు. ఇంతకు ఆ ఆలయం ఎక్కడ నిర్మించారు....? నిర్మాణానికి కృషి చేసిన ఆ ఎమ్మెల్యే ఎవరు అనుకుంటున్నారా..?
జగన్ కు భక్తుడిగా చెప్పుకొనే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఈ ఆలయ నిర్మాణానికి నాంది పలికారు. జగన్ పై ఉన్న అభిమానాన్ని ఇలా చాటుకుంటున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జగనన్న ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టి అందరి దృష్టిని తనవైపు మలుచుకుంటున్నారు. 10 లక్షల మేర నిధులు వెచ్చించి ఆలయ నిర్మాణం చేపట్టారు. ఈ ఆలయ నిర్మాణాన్ని.. శ్రీకాళహస్తి నియోజకవర్గం లోని వైఎస్ఆర్ జగన్ అన్న కాలనీలో చేపట్టారు. ఈ ఆలయానికి పక్కనే దివంగత సీఎం వైఎస్ఆర్ విగ్రహం ఏర్పాటు చేసారు. ఆలయానికి ముందు భాగంలో నవరత్న పథకాలకు సంబంధించిన ఫీ-రీఎంబర్స్మెంట్., ఆరోగ్య శ్రీ. మద్యపాన నిషేధం., అమ్మఒడి., వైఎస్ ఆర్ ఆసరా, పేదలందరికీ ఇల్లు., పెన్షన్ పెంపు తదితర పథకాల స్థూపాలను ఏర్పాటు చేసారు.
రైతు భరోసాకు సింబల్ గా ఎడ్ల బండిపై ధాన్యాలు ముట్టగట్టుకొని రైతులు రైతు భరోసా కేంద్రాలకు వెళ్లేలా ముందు బాగానే సుందరంగా నిర్మాణం చేపట్టారు. ఇక ఆలయం లోపల ఒక్కో పథకానికి సంబంధించి ఒక్కో బోర్డును ఏర్పాటు చేసి.. ఎలా అప్లై చేసుకోవాలి.. ఎవరికీ వర్తిస్తాయో వాటి పూర్తి వివరాలు అందులో పొందు పరచి గోల్డ్ ఫ్రేమ్ లో వాటిని ఉంచారు. ఆ పథకాల వివరాలపై సీఎం జగన్ ఫొటోను పొందు పరిచారు. రాష్ట్రంలో మంత్రులు నోటితో చెప్పిన పథకాలను.. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ప్రజలకు అర్థం అయ్యే రీతిలో చెప్పబోతున్నారు. ఈ ఆలయం కోసం ఇప్పటికే 2 కోట్ల రూపాయల దాకా ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. అలాగే పంచ లోహాలతో విగ్రహాలు తయారు చేయిస్తున్నారు. అయితే దీని కోసం ఎమ్మెల్యే 75 సొంత నిధులు వెచ్చించగా.. మిగిలినది వైసీపీ నేతలు, కార్యక్రతలు చందాలు వేసుకొని ఇచ్చినట్టు సమాచారం. ఆలయం లోపల మొత్తం గ్లాస్ డిజైన్ తో తల తల మెరిసేలా చేస్తున్నారు.
రాష్ట్రంలో సీఎం జగన్ పథకాలపై నిర్మించిన ఏకైక దేవాలయంగా దీన్ని చెప్పుకోవచ్చు. . ఈ జగన్ అన్న నవరత్నాల ఆలయం త్వరలోనే సందర్శకులకు అందుబటులోకి రానుంది. జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతుల మీదుగా ఈ ఆలయ ప్రారంభోత్సవం కార్యక్రమం చేపట్టనున్నట్లు సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Navaratnalu, Tirupati