Ap Ycp: ఏప్రిల్ 3 అంటేనే వైసీపీ మంత్రులు, నాయకులు వణికిపోతున్నారు. గడప గడపకి మన ప్రభుత్వం కార్య క్రమంపై ఈనెల మూడవ తేదీన ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరగనుంది. ఈ సమావేశం గత నెలలోనే జరగాల్సి ఉన్నా మండలి ఎన్నికల నేపధ్యంలో వాయిదా వేయవలసి వచ్చింది. అయితే ఎల్లుండి జరుగబోయే ఈ సమీక్ష గత సమావేశాలకి పూర్తిగా భిన్నంగా ఉండబోతోంది. ఎందుకంటే గత ఎన్నికలలో గెలిచిన సంతోషం, వచ్చే ఎన్నికలలో మళ్ళీ గెలుస్తామనే ధీమా తప్ప రెండో ఆలోచన లేని జగన్ తొలిసారి ఓటమితో దెబ్బ రుచి చూసి దెబ్బతిన్న పులిలా ఉన్నారు.
ఈ క్రమంలో ఇప్పటికే ఓ నలభై యాభై మంది శాసనసభ్యుల పని తీరు బాగోలేదని చెప్పిన జగన్ ఈ సారి వారికి టికెట్ ఇచ్చేది అనుమానమే అంటున్నారు పార్టీ వర్గాలు. మండలి ఎన్నికలలో అభ్యర్ధుల గెలుపు బాధ్యత మంత్రులదేనని ఆయన గతంలోనే తేల్చి చెప్పారు. సాధారణంగా అయితే పని తీరు మెరుగు పరుచుకోమంటూ సుతిమెత్తగా హెచ్చరికలు జారీ చేసే జగన్ ఈ సారి ఎలా రియాక్ట్ అవుతారోనని మంత్రులు, ఎమ్మెల్యేలు హడలిపోతున్నారు. జగన్ ఇప్పటికే మంత్రివర్గం ప్రక్షాళణ దిశగా చర్యలు చేపట్టినట్లు సమాచారం. దీంతో ఎవరి పదవులు ఉంటాయో ఎవరి పదవులు ఊడతాయోనని టెన్షన్ పడుతున్నారు.
మరోవైపు జగన్ మొండి వైఖరి వల్లే మండలి స్థానాలు కోల్పోయామంటూ సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. ఎలాగూ వచ్చే ఎన్నికలలో తమకు సీటు రాదని ఓ నిర్ణయానికి వచ్చిన ఆ యాభై మంది శాసనసభ్యులు ఎమ్మెల్సీ ఎన్నికల గురించి అస్సలు పట్టించుకోనేలేదట. అందుకే పట్టభధ్రుల స్థానాలు మూడూ చేజారాయని టాక్ నడుస్తుంది. పార్టీకి బాగా పట్టున్న రాయలసీమలోనూ ఇటు రాజధానిని విశాఖకు తరలిస్తున్నాం అని చెప్పినా ఉత్తరాంధ్రలోనూ ఓడిపోవడం జగన్ కు గట్టి షాక్ ఇచ్చాయంటున్నారు వైకాపా నేతలు.
ఇలాంటి పరిస్థితుల్లో జరుగుతున్న సమీక్షలో జగన్ ఎలాంటి నిర్ణయాలు వెల్లడిస్తారో.. ఎవరిపై విరుచుకు పడతారోనని అటు మంత్రులు ఇటు ఎమ్మెల్యేలు అమ్మో..మూడవ తారీఖు అంటూ లోలోన వణికిపోతున్నారు. మరి 3వ తేదీన జరగబోయే సమావేశంలో సీఎం జగన్ ఏమైనా కీలక నిర్ణయాలు తీసుకుంటారా? లేదా? మరోసారి ఛాన్స్ ఇచ్చి చూస్తారా అనేది ప్రస్తుతానికి సస్పెన్సే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhrapradesh, Ap, Ap cm jagan, AP News, Ycp