AP POLITICS AP CABINET RESHUFFLE LEADS INTERNAL FIGHT IN YSRCP AMID PRESSURE CM JAGAN TO CONTINUE 11 MINISTERS MKS
AP New Cabinet: జగన్ జగమొండి ఇక పాతమాట? -కొత్త కేబినెట్ కూర్పులో బీజేపీ, కుటుంబ ఒత్తిళ్లు?
సీఎం జగన్ (పాత ఫొటో)
ఏపీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ క్రమంలో తొలిసారి సొంత పార్టీలోనే జగన్ నిర్ణయాలపై వ్యతిరేకత, ముఖ్యనేతపై విమర్శలు పొడచూశాయి. ఒత్తిళ్ల వల్లే సీఎం దాదాపు సగం మంది మంత్రులను కొనసాగిస్తున్నట్లు చర్చ జరుగుతోంది..
‘భారత రాజకీయాల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మించిన జగమొండి నేత ఉండరు..’అని ప్రత్యర్థులు విమర్శించినా, ‘తాను జైలుకు వెళతాననే భయం కూడా లేకుండా నాడు శక్తిమంతమైన సోనియా గాంధీనే ఢీకొట్టిన జగమొండి మొనగాడు జగన్’అని అస్మదీయులు పొగిడినా వైసీపీ అధినేతగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ తనదైన శైలిలో ముందుకువెళ్లారు. అయితే, అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత జగన్ తొలిసారి ఒత్తిళ్లకు తలగ్గినట్లు తెలుస్తోంది.
ఏపీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ క్రమంలో తొలిసారి సొంత పార్టీలోనే జగన్ నిర్ణయాలపై వ్యతిరేకత, ముఖ్యనేతపై విమర్శలు పొడచూశాయి. మంత్రులందరినీ మార్చేస్తానన్న సీఎం.. దాదాపు సగం మందిని కొనసాగిస్తుండటం తీవ్ర చర్చకు దారి తీసింది. జగన్ జగమొండి ఇక పాత మాటేనా? అనే కామెంట్లు వస్తున్నాయి. కొత్త కేబినెట్ కూర్పులో పొరుగు రాష్ట్రాలకు చెందిన బీజేపీ నేతల ఒత్తిళ్లు, ఇంకొందరి విషయంలో సొంత కుటుంబం నుంచే ఒత్తిళ్లు జగన్ పై పని చేశాయని, అందుకే ఆయన కేబినెట్ మొత్తాన్ని కాకుండా సగాన్నే ప్రక్షాళన చేశారని, తద్వారా తొలిసారి జగన్ నిస్సహాయత బహిరంగంగా వెల్లడైందనే వాదనలూ వినిపిస్తున్నాయి..
వైఎస్సార్ మరణం తర్వాత కాంగ్రెస్ తో విభేధించి, పలు అవినీతి, అక్రమాస్తుల కేసుల్లో జైలుపాలైన జగన్, 2011లో వైఎస్సార్ సీపీని స్థాపించినప్పటి నుంచి గడిచిన 11 ఏళ్లుగా ఇంటా బయటా తిరుగులేని నేతగా తనదైన ముద్రను కనబర్చారు. పార్టీలోగానీ, ప్రభుత్వ పరంగాగానీ పూర్తిగా ఆయన విచక్షణాధికారంపైనే నిర్ణయాలు ఉంటాయనే ప్రచారం ఉంది. ఆర్థికపరంగా ఏపీ తీవ్రమైన ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నప్పటికీ జగన్ లోని మొండితనమే పేదలకు సంక్షేమ పథకాలను కొనసాగించడానికి తోడ్పడుతోందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తారు.
తనపై సీబీఐ కేసుల విషయంలో జగన్ కేంద్రంతో రాజకీయంగా కాంప్రమైజ్ ధోరణి అనుసరిస్తున్నట్లు చాలా సార్లు బయటికి వెల్లడైనా, అంతర్గతంగా వైసీపీలో మాత్రం ఆయన మాటకు ఎదురులేకుండేది. సీఎం నిర్ణయాన్ని ఇప్పటివరకు ఎవరూ ధిక్కరించిందీ లేదు. అలాంటిది కేబినెట్ పునర్వ్యవస్థీకరణ అంశంలో మాత్రం తొలిసారి జగన్ తీరుపై విమర్శలు, ఆయన నిర్ణయాలపై వ్యతిరేకత బాహాటంగా వ్యక్తమవుతోంది. చాలా జిల్లాల్లో ఆయా నేతల అనుచరులు రోడ్లపైకొచ్చి రాస్తారోకోలు, టైర్లకు నిప్పుపెట్టి ఆందోళనలకు చేయడాలు లాంటివి వైసీపీలో తొలిసారి చోటుచేసుకున్న పరిణామాలు.
కొత్త కేబినెట్ కూర్పు విషయంలో జగన్ పై అనేక రకాల ఒత్తిళ్లు పనిచేసినట్లు వార్తలు వస్తున్నాయి. కర్ణాటక బళ్లారికి చెందిన బీజేపీ నేత శ్రీరాము లు సిఫారసును గౌరవించే జగన్.. గుమ్మనూరు జయరాంకు మళ్లీ మంత్రిగా అవకాశం కల్పించారని, జగన్ తల్లి తరఫు సమీప బంధువైన బాలినేని శ్రీనివాస రెడ్డి తిరిగి మంత్రిపదవి పొందేందుకు మంకుపట్టుపట్టారని, ఈ విషయంలో సీఎం ఇరుకునపడ్డారని, బొత్స సత్యనాయారణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి సీనియర్లను తొలగించలేని స్థితిలో జగన్ ఉన్నారని, కొత్త మంత్రి వర్గ కూర్పులో జగన్ నిస్సహాయత కనిపించిందని, ఫైనల్ లిస్టులోని పేర్లు చేర్చుతూ, తీస్తూ కసరత్తుచివరి నిమిషందాకా సాగిందని మీడియాలో కథనాలు వచ్చాయి.
మంత్రులు అందిచేతా రాజీనామాలు చేయించిన సీఎం జగన్.. సీనియర్ల సేవలను పార్టీకి వాడుకోవాలని భావించినా, బాలినేని శ్రీనివాసరెడ్డి, మేకతోటి సుచరిత లాంటి ఊస్టింగ్ మంత్రులు ఏకంగా రాజీనామాలకు సిద్ధం కావడం సంచలనంగా మారింది. ఎస్సీ వర్గానికి చెందిన పాత మంత్రులు అందరినీ కొనసాగిస్తూ తానొక్కదానినే తీసేయడమేంటని సుచరిత అలకవహించారు. ఆమె అనుచరులు సజ్జలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాలినేనిని బుజ్జగించడానికి సజ్జల స్వయంగా రెండుసార్లు వెళ్లాల్సి వచ్చింది. దాదాపు అన్ని జిల్లాల్లో పదవులు దక్కని వైసీపీ నేతల అనుచరులు రోడ్లపైకొచ్చి రాస్తారోకోలు చేశారు. టైర్లు దహనం చేసి జగన్ నిర్ణయాలపై వ్యతిరేకత కనబర్చారు. సోమవారం ఉదయం 11.30కు కొత్త కేబినెట్ కొలువుదీరనుంది. సీఎం జగన్ తన మంత్రివర్గంలోకి కొత్తగా తీసుకున్న, కొనసాగిస్తోన్న, తొలగించినవారి జాబితా ఇదే...
CPI(M): సీపీఎం సంచలనం.. చరిత్రలో తొలిసారి దళిత నేతకు చోటు.. కార్యదర్శిగా మళ్లీ సీతారాం ఏచూరి
కొత్తగా 14 మంది..
జగన్ కేబినెట్ లో 14 మంది మంది మంత్రులు కొత్తగా చేరనున్నారు. 1) ధర్మాన ప్రసాదరావు, 2) పీడిక రాజన్నదొర, 3) గుడివాడ అమర్నాథ్, 4) బూడి ముత్యాలనాయుడు, 5) దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా), 6) కారుమూరి వెంకట నాగేశ్వరరావు, 7) కొట్టు సత్యనారాయణ, 8) జోగి రమేశ్, 9) అంబటి రాంబాబు, 10) మేరుగ నాగార్జున, 11) విడదల రజని, 12) కాకాణి గోవర్ధన్ రెడ్డి, 13) ఆర్.కె.రోజా, 14) ఉష శ్రీ చరణ్
11 మంది కొనసాగింపు..
రకరకాల కారణాలతో సీఎం జగన్ తన పాత కేబినెట్ లో 11 మంది మంత్రులను తిరిగి 2.0లోనూ కొనసాగిస్తున్నారు. 1) సీదిరి అప్పలరాజు, 2) బొత్స సత్యనారాయణ, 3) పినిపే విశ్వరూప్, 4) చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, 5) తానేటి వనిత, 6) ఆదిమూలపు సురేశ్, 7) అంజాద్ బాషా, 8) బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, 9)గుమ్మనూరు జయరాం, 10) పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, 11) కె.నారాయణస్వామి తిరిగి మంత్రులుగా ఇవాళ ప్రమాణం చేస్తారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.