ఆంధ్రప్రదేశ్‌లో బలపడేందుకు బీజేపీ ఏం చేస్తుందనే విషయంలో ఎవరికీ పెద్దగా క్లారిటీ లేదు. అయితే ఆ పార్టీను వీడేందుకు సిద్ధమైన ఓ ముఖ్యనేత విషయంలో మాత్రం బీజేపీ నాయకత్వం పదే పదే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ నాయకుడు మరెవరో కాదు.. మాజీమంత్రి, ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. 2014 ఎన్నికల తరువాత కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ.. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో(ysrcp) చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే కన్నాను చేర్చుకోవద్దని బీజేపీ జాతీయ నేత వైసీపీ నాయకత్వాన్ని కోరారని.. అందుకే వైసీపీ నాయకత్వం కన్నా లక్ష్మీనారాయణను తమ పార్టీలో చేర్చుకోలేదని ఇప్పటికీ చాలామంది చెబుతుంటారు.
అయితే గత కొన్ని రోజుల నుంచి బీజేపీలో అసంతృప్తిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణను(Kanna Lakshmi Narayana) ఇటీవల జనసేన ముఖ్యనేతలు కలవడంతో ఆయన జనసేనలోకి వెళుతున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. వచ్చే ఎన్నికల్లో ఆయన జనసేన(Janasena) తరపున ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై కూడా ప్రచారం మొదలైంది. జనసేన, టీడీపీ పొత్తు కుదురుతుందని.. కన్నా లక్ష్మీనారాయణకు సత్తెనపల్లి సీటు కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయవర్గాల్లో చర్చ జరిగింది. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజుపై ఆగ్రహంతో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ బీజేపీని వీడటం దాదాపు ఖాయమే అని అంతా అనుకున్నారు.
కానీ కన్నా లక్ష్మీనారాయణ ఈ విషయంలో సడెన్‌గా యూటర్న్ తీసుకున్నట్టు బీజేపీ జాతీయ నేత శివప్రకాశ్‌ను కలిశారు. ఆయనతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో ఆయన ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజుపై ఫిర్యాదు చేశారనే ప్రచారం కూడా జరిగింది. అయితే బీజేపీ నాయకత్వం కన్నా విషయంలో ఇంతగా ఎందుకు ఫోకస్ చేస్తుందనే అంశం చాలామందికి అర్థంకావడం లేదు.
Big Breaking: ఏపీ రాజధానిపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు
Big News: టీడీపీ నుంచి పోటీ..కలకలం రేపుతున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆడియో
అప్పుడు, ఇప్పుడు బీజేపీ నాయకత్వం కన్నాను పార్టీ మారకుండా ఉండేందుకు ప్రయత్నిస్తోందని.. కన్నా వంటి వాళ్లు పార్టీని వీడితే.. మరింత మంది పార్టీని వీడి వెళతారనే ఉద్దేశ్యంతోనే ఆ పార్టీ నాయకత్వం ఇలా చేస్తోందేమో అనే చర్చ జరుగుతోంది. మొత్తానికి గతంలో ఒకసారి బీజేపీని వీడేందుకు సిద్ధపడి ఆగిపోయిన కన్నా లక్ష్మీనారాయణ.. మరోసారి అలాంటి ప్రయత్నం చేసి విరమించుకోవడం వెనుక బీజేపీ నాయకత్వం హస్తం ఉందా లేక ఆయనే ఇలా మనసు మార్చుకుంటున్నారా ? అన్నది ఎవరికీ అర్థంకావడం లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.