కొంతకాలంగా ఏపీలో బీజేపీలో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న ఆ పార్టీ నేత, మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ(Kanna LakshmiNarayana) కమలం పార్టీని వీడుతున్నట్టు వస్తున్న వార్తలపై స్పందించారు. జనసేన,(Janasena) బీజేపీ(BJP) పొత్తులో ఉన్న పార్టీలు అని ఆయన అన్నారు. భాగస్వామ్యపక్షాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. అందుకే జనసేన నాయకులు నాతో టచ్‌లో ఉంటారని చెప్పుకొచ్చారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు(Somu Veerraju) ఒంటెద్దు పోకడల వల్ల ఇబ్బందులు వస్తున్నాయని అన్నారు. తాను పార్టీ వ్యవహారాలపై గుర్రుగా ఉన్న మాట వాస్తవమే అని కన్నా లక్ష్మీనారాయణ అంగీకరించారు. అయితే తాను బీజేపీని వీడతాననే మాట సరైనది కాదని వ్యాఖ్యానించారు. తాను బీజేపీలోనే కొనసాగుతానని తెలిపారు. ఏపీలో బీఆర్ఎస్ పుంజుకునే అవకాశమే లేదని కన్నా లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు.
సోము వీర్రాజు వియ్యంకుడు బీఆర్‌ఎస్‌లో చేరారని, దీనికి వీర్రాజు సమాధానం చెప్పాలన్నారు. ఏపీ సీఎం జగన్ , తెలంగాణ సీఎం కేసీఆర్ కుట్రలో భాగంగానే బీఆర్ఎస్‌లోకి ఏపీ నేతలు వెళ్తున్నారని ఆరోపించారు. ఆంధ్రాలో పవన్ కల్యాణ్ ను, తెలంగాణలో బండి సంజయ్‌ను బలహీనం చేసే కుట్ర జగన్, కేసీఆర్‌లు కలిసి చేస్తున్నారని ఆరోపంచు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా కాపు నేతలపై బీఆర్ఎస్ దృష్టి పెట్టిందన్నారు. ఈ సమయంలో పవన్‌కు తాము అండగా ఉంటామని చెప్పారు. కాపులపై ఈ మధ్య కాలంలో మీడియా దుష్ప్రచారం చేస్తోందని కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు.
ఏపీలో బీజేపీ జిల్లా అధ్యక్షుల మార్పును కన్నా తప్పుబట్టారు. ఈ విషయంలో సోము వీర్రాజుపై అసహనం వ్యక్తం చేశారు. కోర్ కమిటీలో చర్చ జరగకుండానే జిల్లా అధ్యక్షులను మార్చడం ఏమిటని ప్రశ్నించారు. అధ్యక్షుల మార్పు విషయం గురించి తనతో చర్చించలేదన్నారు. ఇప్పుడు తొలగించిన వాళ్లంతా తాను నియమించిన వాళ్లే అని చెప్పారు. తాను రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఎంతో మందిని బీజేపీలో చేర్చానని కన్నా తెలిపారు. అయితే ఇప్పుడు వాళ్లంతా ఎందుకు పార్టీ వీడుతున్నారో వీర్రాజు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
KCR: ఏపీ ప్రజలను కేసీఆర్ ఎలా కన్విన్స్ చేస్తారు ?.. ఆయన ముందున్న మార్గాలేంటి ?
Telangana-Bjp: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఈటెల రాజేందర్?
కొంతకాలం క్రితం వరకు సోము వీర్రాజుపై అంతర్గతంగానే అసహనం వ్యక్తం చేస్తూ వచ్చిన కన్నా లక్ష్మీనారాయణ.. ఇప్పుడు బాహాటంగానే ఆయనను టార్గెట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా బీజేపీలో ఈ రకమైన ధోరణి కనిపించదు. కానీ కన్నా ఈ రకమైన వ్యాఖ్యలు చేయడంతో ఏపీ బీజేపీ నేతల్లోనూ చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఆ పార్టీ నాయకత్వం ఏ రకమైన చర్యలు తీసుకుంటుందనే అంశం కూడా ఆసక్తికరంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.