మంత్రి పదవిపై ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం (Speaker Tammineni Seetharam) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై మీడియాతో మాట్లాడిన ఆయన.. తానెప్పుడూ పదవులను ఆశించలేదని తెలిపారు. సీఎం జగన్ (CM YS Jagan) కు నేను సమస్య కాకూడదన్న ఆయన ఏ పని అప్పగించినా చేయటానికి నేను సిద్ధమని స్పష్టం చేశారు. మంత్రి పదవులు రాని వాళ్లకు కొంత బాధ ఉంటుందనేది వాస్తవమన్నారు. నన్ను కచ్చితంగా గెలుచి రావాలన్నా అని సీఎం గతంలో చెప్పారని.., కానీ అనేక సమీకరణాల నేపథ్యంలో ఆయన నిర్ణయాలు ఉంటాయని.., స్పీకర్ గా ఉండాలని నాకు చెప్పడానికి కూడా అప్పుడు ఇబ్బంది పడ్డారని తమ్మినేని తెలిపారు. తనకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి బాధ్యతగా తీసుకున్నట్లు వివరించారు.
కొత్త కేబినెట్ కూర్పు బాగుందన్న తమ్మినేని సీతారాం.., అన్ని వర్గాల దామాషా పద్ధతితో మంత్రి పదవులు కేటాయించారని అభిప్రాయపడ్డారు. మాట్లాడేవాళ్లు, చర్చించే వాళ్లు వెళ్లి వాస్తవాలు తెలుసుకోవాలని హితవుపలికారు. బీసీలు టీడీపీకి ఎప్పుడో దూరం అయ్యారన్న తమ్మినేని.. ఉద్యమ కెరటం వస్తుందని., సామాజిక న్యాయ విప్లవంలో టీడీపీ కొట్టుకుపోవాల్సిందేనన్నారు. అంతేకాదు ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రాకుండా పోతారని.. ఇది రాసిపెట్టుకోవాలని ఛాలెంజ్ చేశారు. స్పీకర్ గా కాదు.. ఒక బీసీ నాయకుడిగా తాను చెబుతున్నాని ఇది నిజమని స్పష్టం చేశారు.
తనకు మంత్రిపదవి వస్తుందని పత్రికలు రాసినా తాను మాత్రం ఆశలు పెట్టుకోలేదని తమ్మినేని సీతారాం అన్నారు. స్పీకర్ గా అప్పగించిన బాధ్యతను గౌరవంగా భావించానని.., మంత్రి వర్గకూర్పులో జగన్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని చాలా మంది తనకు ఫోన్ చేశారన్నారు. వెనుబడినవర్గాల వారికి వెనుకబాటుతనం లేదనే ధైర్యం జగన్ కల్పించారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల విజయాలు చూశామని.., రేపు ఎమ్మెల్యే ఎన్నికలలో కూడా విజయాన్ని ప్రజలే చూస్తారని జోస్యం చెప్పారు..
ఇక మాజీ హోంమంత్రి మేకతోటి సుచరితపైనా స్పీకర్ స్పందించారు. ఆమె రాజీనామా లేఖ రాలేదన్న తమ్మినేని.., వైసీపీలో పూర్తి ప్రజాస్వామ్యం ఉంది కాబట్టే చాలామంది తమ అభిప్రాయం ఓపెన్ గా చెప్పారన్నారు. స్పీకర్ గా చేసిన వాళ్లు గెలవలేరన్న రికార్డును తాను తిరగరాస్తానని.., వచ్చే ఎన్నికలలో నేను గెలిచి చరిత్ర సృష్టిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఆమదాలవలసలో తాను గెలవడం ద్వారా వైసీపీ ప్రభుత్వం మళ్లీ రావడం ఖాయమన్నారు తమ్మినేని.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP Politics, AP Speaker Tammineni Seetharam