Atchannaidu: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని రాజకీయాలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. ఇంకా ఎన్నికలకు ఏడాదిన్నరపైగా సమయం ఉంది. అయినా.. అన్ని జిల్లాల్లో ఎన్నికల కోలాహలం కనిపిస్తోంది. ముఖ్యంగా అన్ని పార్టీల్లోనూ ఇంటిపోరు ఇబ్బంది పెడుతోంది. ఇక ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) సైతం అదే పరిస్థితి. అసలే అధికారంలో లేదు.. మళ్లీ అధికారం సాధించాలి అంటే.. పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉండాలి.. ముఖ్యంగా నేతలమధ్య సమన్వయం అవసరం.. గ్రూపు తగాదాలకు చెక్ పెట్టాలి.. ఆ బాధ్యత కూడా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు (TDP State President Atchannaidu) పైనే ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ.. అన్ని జిల్లాల్లో పరిస్థితి చెక్కబెట్టాల్సిన బాధ్యత కూడా ఆయనపై ఉంటుంది. ఎక్కడైనా వర్గపోరు ఉన్నా.. నేతల మధ్య అంతరాయం ఉన్నా.. అక్కడ పరిస్థితి తెలుసుకుని.. చక్కబెట్టాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. కానీ అలాంటి నేతకు.. సొంత జిల్లాలో మాత్రం షాక్ తప్పడం లేదు. 2019 ఎన్నికల ముందుకు వరకు.. సిక్కోలు టీడీపీలో ఆయన చెప్పిందే వేదంగా ఉండేది. కానీ ఇప్పుడు ఏదో తేడా కొడుతోందన్నది టాక్. ప్రమాదం పొంచే ఉందని ఆయనకు సంకేతాలు అందాయి అంటున్నారు. అందుకే ఇప్పట్లో ఎన్నికలు లేకపోయినా.. దిద్దుబాటు చర్యలకు దిగారనే ప్రచారం ఉంది.
ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో రాజకీయ హాట్ హాట్ గా సాగుతోంది. ఇక్కడ ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఎమ్మెల్యే. టీడీపీకి బలమైన కేడర్ కూడా ఉంది. వైసీపీలో అంతర్గత విభేదాలు.. అధికారపార్టీలో గ్రూపు రాజకీయాలు ఎక్కువ. నేతలకు అస్సలు పొసగదు. అలాంటిది ఈ మధ్య కాలంలో వైసీపీ నేతలు ఐక్యతారాగం టీడీపీ శిబిరాన్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పటికీ ఉప్పు నిప్పులా నాయకుల మధ్య మంత్రి బొత్స సత్యనారాయణ సయోధ్య కుదిర్చినట్టు టాక్. బొత్స ఇంఛార్జ్‌గా వచ్చాక.. చాలా మార్పు కనిపిస్తోందట. ఆ మార్పే అచ్చెన్న అండ్ టీమ్‌ను ఉలిక్కి పడేలా చేస్తోందనే ప్రచారం ఉంది.
ఇదీ చదవండి : ఏపీ మూడు రాజధానులపై బీజేపీ జాతీయ నేత సంచలన వ్యాఖ్యలు.. నిర్ణయం ఎవరిదంటే?
వైసీపీ యాక్టివ్ గా ఉండడంతో.. టీడీపీ కేడర్ నిస్తేజంగా మారిందనే ప్రచారం ఉంది. దీంతో తన కాళ్ల కిందకే నీళ్లు వస్తున్నాయని అచ్చెన్న కలవర పడుతున్నారట. ఏపీ టీడీపీ అధ్యక్షుడైన తర్వాత టెక్కలిలో పార్టీ వ్యవహారాలను ద్వితీయశ్రేణి లీడర్స్‌కు అప్పగించారట. ఆయన విజయవాడలోనే ఎక్కువగా ఉంటున్నారు. దీంతో లీడర్ దూరమై.. కేడర్ కూడా కార్యక్రమాలను లైట్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. స్థానిక సమస్యలపై స్పందించేవారే కరువయ్యారని తెలుస్తోంది. పైగా అచ్చెన్నకు పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడం ఎక్కువైంది. ఇలాగే వదిలిస్తే నష్టం తప్పదని భావించిన ఆయన.. అందరినీ పిలిచి క్లాస్ తీసుకున్నారట.
ఇదీ చదవండి : ఛీ ఛీ మీరు మనుషులేనా..? దహనసంస్కారం విషయంలో 2 గ్రామాల మధ్య ఘర్షణ..
గత నుంచి అంటే 1983 నుంచి కింజరాపు ఫ్యామిలీదే టెక్కలిలో హవా. అప్పట్లో హరిశ్చంద్రపురం నియోజకవర్గంగా ఉన్నప్పటి నుంచీ ఎర్రన్నాయుడు మొదలుకొని.. ఇప్పుడు అచ్చెన్నాయుడు వరకు గెలుస్తూ వస్తున్నారు. ఒకటి రెండు సందర్భాలలో మినహా మిగతాసార్లు టీడీపీదే గెలుపు. అలాంటిచోట పార్టీ కార్యక్రమాల నిర్వహణకు తెలుగు తమ్ముళ్లు వెనకడుగు వేయడం.. అచ్చెన్న బృందానికి మింగుడు పడటం లేదంటున్నారు. నియోజకవర్గంలో టీడీపీ నేతలు నాలుగు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం మొదలుపెడితే.. అటు అటు వైసీపీ ఐక్యత రాగం అందుకోవడం మరింత ఇబ్బందికరంగా మారింది.
ఇదీ చదవండి : వైసీపీ-జనసేన మధ్య పేలుతున్న పంచ్‌లు.. కేటీఆర్ ట్వీట్ తో ప్రారంభం.. రంభల రాంబాబు అంటూ బండ్ల ఎంట్రీ
సమస్యను ఆలస్యంగా గ్రహించిన అచ్చెన్నాయుడు.. దిద్దుబాటు చర్యలైతే ప్రారంభించారు. మండలాల వారీగా పార్టీ నేతలను పిలిచి మాట్లాడుతున్నారు. చెప్పాల్సిన వారికి సుతిమెత్తంగా చెబుతున్నారు.. మందలించాల్సిన వాళ్లకు అదే టోన్‌లో హెచ్చరికలు పంపుతున్నారట. ఇన్నాళ్లుగా ఒక టీమ్‌లా పనిచేసిన టీడీపీ నేతలకు ఏమైంది అన్నది ఇప్పుడు తెలుగు తమ్ముళ్లకు ప్రశ్నగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Kinjarapu Atchannaidu, Srikakulam, TDP