ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో మరోసారి పొత్తుల కుంపటిరాజుకుంది. మొన్నామధ్య ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా వైసీపీ (YSRCP)ని గద్దె దించాలంటే అన్ని పార్టీలు కలిసి పనిచేయాలని, అవసరమైతే ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమంటూ చంద్రబాబు (Chandrababu) పొత్తు పల్లవి ఆలపించడం దరిమిలా.., రాష్ట్రంలో పొత్తు రాజకీయాలు తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలోనే బాబు మాటలకు వైసీపీ నేతలు కౌంటర్ ఇవ్వడం... బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సైతం ఆ త్యాగాలు ఏపాటివో తెలుసంటూ చంద్రబాబును ఎద్దేవా చేయడంతో పొత్తు రాజకీయాలు కాస్తా వేడెక్కెయి.. తాజాగా పవన్ కల్యాణ్ నంద్యాల కౌలు రైతు భరోసా సభలో జనంకోసం పొత్తు గురించి ఆలోచిస్తామంటూ చెప్పడం.... ఇందుకు కొసాగింపుగా సోము వీర్రాజు మరోసారి పొత్తులపై మాట్లాడం చూస్తుంటే ప్రస్తుతం రాజకీయాలన్నీ పొత్తుల చుట్టూ తిరుగుతున్నట్లు కనిపిస్తోంది.
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు పొత్తుల ఎత్తులకు సిద్ధమవుతున్నాయి. 2019లో ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా భారీ మెజారిటీతో గెలిచిన వైసీపీ.. అధికారాన్ని చేజిక్కించుకుంది. మరోసారి అదే స్థాయిలో ప్రభంజనం సృష్టించాలని పార్టీ సీనియర్ నేతలంతా ఎన్నికల పథక రచన చేస్తుండగా.., మరోవైపు ఎలాగైనా వైసీపీని గద్దె దించేందుకు ప్రతిపక్షాలు సైతం వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే పొత్తు రాజకీయాలు తెరపైకి వచ్చాయి.
ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా మాజీముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు... వైసీపీని ఓడించేందుకు అవసరమైతే ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని ముఖ్యమంత్రి పదవిని సైతం త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పరోక్షంగా చెప్పడం పొత్తు పొడుపు రాజకీయాలకు బీజం వేసింది. అయితే ప్రభుత్వంపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతో లేక ఈసారి అధికారంలోకి రావడం కొంచెం కష్టమనే భావనలో ఉన్న వైసీపీ నేతలు కాస్త డోసు పెంచుతూ టీడీపీ, చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. సింగిల్ గా పోటీచేసే దమ్ములేక చంద్రబాబు అండ్ కో పొత్తు పాట పాడుతున్నారంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.
ఆ కాక సర్దుమణగక ముందే కమల దళం రాష్ట్ర అధ్యక్షుడు సైతం.. చంద్రబాబు వ్యాఖ్యలకు కౌంటర్ గా ఆ త్యాగాలు మాకొద్దంటూ పొత్తు అవసరం లేదనే విషయాన్ని బహిరంగంగానే వెల్లడించారు. అయితే బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జనసేనాని మాత్రం పొత్తు దిశగా ఆలోచిస్తున్నట్లు నంద్యాలలో మాట్లాడిన మాటలను చూస్తే అర్థమవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర శ్రేయస్సు, జనం మంచి కోసం అవసరమైతో పొత్తు గురించి ఆలోచిస్తామని పవన్ కల్యాణ్ చెప్పడం., టీడీపీతో పొత్తుకు సుముఖంగానే ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అయితే పొత్తుల విషయంలో చర్చ జరగాలని చెప్పడం కొసమెరుపు.
అయితే ఇదివరకే టీడీపీతో పొత్తు పెట్టుకోవడం, అది కాస్తా మూణ్ణాళ్ల ముచ్చటగా మారడం.., ఆ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు... బీజేపీ జాతీయ నాయకత్వం, ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలతో ఆ పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు. ఈ క్రమంలోనే జనసేన అధినేత వ్యాఖ్యలపై మరోసారి స్పందించిన సోము వీర్రాజు.. జనసేనతో తమ పొత్తు కొనసాగుతుందని... ప్రస్తుతం రెండు పార్టీల మధ్య సత్సంబంధాలు ఉన్నాయన్నారు. కాకపోతే టీడీపీతో పొత్తు విషయాన్ని పవన్ కల్యాణ్ నే అడగాలని బాల్ ని పవన్ కోర్టులోకి నెట్టారు. దీంతో టీడీపీకి తాము ఎప్పటికీ సమాన దూరం పాటిస్తామనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. అయితే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు కాబట్టి బీజేపీ కేంద్ర నాయకత్వంతో చంద్రబాబుకు సత్సంబంధాలు ఉండటం, జనసేనాని సైతం పొత్తుకు సై అంటుడటం చూస్తుంటే భవిష్యత్తులో పొత్తు పొడిచే అవకాశాలు లేకపోలేదు.
ఈ మొత్తం ఎపిసోడ్ ను అలా ఉంచితే మరోవైపు వైసీపీకి పొత్తు భయం పట్టుకుంది. ఓ వైపు సంక్షేమం పేరుతో నేరుగా జనాలకు డబ్బులు పంచుతున్నా.., ఎక్కడో వారిలో చిన్న అసంతృప్తి ఉందనే విషయాన్ని పార్టీ అధినాయకత్వం గుర్తించింది. దీనికి తోడు రాష్ట్రంలో పొత్తు రాజకీయాలు రోజుకో మలుపు తీసుకుంటుండం అధికార పార్టీకి మింగుడుపడటం లేదు. ఓ వైపు సింగిల్ గా పోటీ చేసే దమ్ములేదంటూ ప్రతిపక్ష పార్టీలను రెచ్చగొడుతూనే.., టీడీపీ, జనసేన, బీజేపీ ఎక్కడ జతకట్టి ఎన్నికల యుద్ధం ప్రకటిస్తాయోనని ఆ పార్టీ కొంత మీమాంసలో పండింది. ఏదేమైనా ఈ పొత్తు రాజకీయాలు ఓ మలుపు తీసుకోవాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే..!
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh