Death Celebrations Invitation: సాధారణంగా ఎవరైనా పెళ్లి (Marriage) కి లేదా గృహ ప్రవేశానికి (House Warming) లేదా పుట్టినరోజు (Birthday).. ఇలా వేడుక ఏదైనా ఆహ్వాన పత్రికలు పంపించడం చాలా కామన్. అందులోనూ ట్రెండీగా నిలిచేందుకు చాలామంది తాపత్రయ పడతారు.. క్రియేటివిటీని ప్రదర్శిస్తారు. కానీ ఎవరైనా మరణాన్ని (Death) ముందుగా అంచనా వేసి వేడుకలకు రావాలంటూ ఆహ్వానం పంపించడం ఎప్పుడైనా చూశారు.. ఎవరో కొందరు ఆకతాయిలు అలా చేస్తే ఆశ్చర్య పోనక్కర్లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ లోని ఓ మాజీ మంత్రి (Ex Minister) మాత్రం తన మరణవేడుకలకు రావాలని ఆహ్వాన పత్రికలను పంచుతున్నారు. తన మరణదిన వేడుకలను ఘనంగా చేసుకుంటున్నానని, అందరూ తప్పకుండా రావాలని ఆహ్వాన పత్రిక ఇస్తుంటే అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అది కూడా ఆయన సాధారణ వ్యక్తం కాదు..
మాజీ మంత్రి పాలేటి రామారావు (Paleti Ramarao) తన మరణ వేడుకలపై ఆహ్వాన పత్రికలను పంపిణీ చేసి వార్తల్లో నిలిచారు. ఈ మేరకు చీరాల ఐఎంఏ హాలులో శనివారం ఉదయం 10 గంటలకు జరిగే వేడుకలకు హాజరవ్వాలని అభిమానులను కోరారు. ఏటా జరుపుకునే పుట్టినరోజు వేడుకలు అర్థరహితమని తెలుసుకున్నా.. అందుకే ఇకపై మరణదిన వేడుకలు జరుపుకోవాలని భావిస్తున్నా అంటూ ఇలా ఆహ్వాన పత్రికలు పంచుతున్నారు.
ఇన్నాళ్ల తన జీవితాన్ని పరిశీలించుకున్నాక నా మరణ సంవత్సరాన్ని 2034గా నిర్ణయించుకున్నా అంటూ జోస్యం చెప్పారు. అయితే దానికి ఇంకా 12 సంవత్సరాలు ఉంది. ఇప్పటి నుంచి ప్రతీ సంవత్సరం మరణదిన వేడుకలు జరుపుకుంటాను అంటూ ఆయనే స్వయంగా చెప్పడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ వేడుకలకు మీరు హాజరై, తనను ఆశీర్వదించాలని కోరుకుంటున్నా అంటూ రామారావు ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం మాజీ మంత్రి లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేకాకుండా ఏపీ రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.
ఇదీ చదవండి : మాచర్లలో అసలు ఏం జరిగింది అంటే? వారిని అదుపులోకి తీసుకున్నామన్న ఎస్పీ
1959లో పుట్టిన తాను ఇప్పటికి ఎంతకాలం జీవించానో తెలిసి, ఇంకెంత కాలం మిగిలివున్నదో లెక్కించానని పాలేటి రామారావు తెలిపారు. తాను ఇంకా 12 ఏళ్లు జీవించాలని భావిస్తున్నందున ఈరోజు 12వ మరణదినాన్ని జరుపుకుంటున్నానని, అభిమానులు వచ్చి ఆశీర్వదించాలని కోరారు. తాను 75 సంవత్సరములు జీవిస్తానని కోరుకుంటున్నాని, ప్రస్తుతం 63 సంవత్సరాలు పూర్తయ్యాయన్నారు. ఇంకా 12 సంవత్సరాలు జీవించాలి కావున ఈరోజు 12వ మరణ దినాన్ని జరుపుకోవాలని ఏర్పాట్లు చేసినట్టు పాలేటి రామారావు తెలిపారు.
ఇదీ చదవండి : ప్రతి 50 ఇళ్లకు ఇద్దరు గృహ సారథులు.. సచివాలయ కన్వీనర్ల ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలదే..
ఆయన రాజకీయ జీవితం ఇదే..
పాలేటి రామారావు చీరాల మాజీ ఎమ్మెల్యే.. రెండుసార్లు గెలుపొందారు. 1994, 1999లో చీరాల నుంచి టీడీపీ తరఫున రెండుసార్లు గెలిచి ఎన్టీఆర్ కెబినేట్ లో మంత్రి పదవి చేపట్టారు. 1994లో కొణిజేటి రోశయ్యపై గెలుపొందటంతో ఎన్టీఆర్ కేబినెట్‌లో మంత్రి పదవి దక్కింది. 2004లో తిరిగి రోశయ్యపై ఓడి 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ తర్వాత వైసీపీలో చేరి.. 2019 ఎన్నికలకు ముందు టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చారు. మళ్లీ కొద్దికాలానికే వైసీపీ గూటికి చేరుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Politics, Ycp