BJP next target AP: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలను మరో అంశం ఇప్పుడు కుదిపేస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలను టార్గెట్ చేసిన బీజేపీ పెద్దలు.. ఏపీపై కూడా ఫోకస్ చేశారా..? తెలంగాణ (Telangana)లో టీఆర్ఎస్ (TRS) ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై అనుమానాల తరువాత.. ఏపీ పై కూడా ఇలా స్కెచ్ రెడీ అయ్యిందా అనే చర్చ మొదలవుతోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల వ్యవహారం వెలుగులోకి వచ్చిన దగ్గర నుంచే.. సోషల్ మీడియా (Social Media) లో సైతం రచ్చ జరుగుతోంది. అయితే ఆ విషయాన్ని ఎవరూ పెద్ద సీరియస్ అంశగా తీసుకోలేదు. కానీ స్వయంగా తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) వ్యాఖ్యలు పలు అనుమానాలు పెంచుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేయాలని కుట్రలు చేసిన బీజేపీ.. తరువాత ఢిల్లీ, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ లను కూడా టార్గెట్ చేసిందని ఆరోపించారు. తమ దగ్గర ఉన్న వీడియోలో దానికి సంబంధించి చర్చ కూడా జరిగింది అన్నారు.
అయితే ఆ వీడియో వైసీపీ ని చీలుస్తామని మాట్లాడుకున్నారా..? లేక.. ఆంధ్రప్రదేశ్ లో ఆ పార్టీని చీల్చేస్తామని చెప్పి ఉంటారా అని రాజకీయ విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ మధ్య కేశినేని చేసిన వ్యాఖ్యలను వారు గుర్తు చేస్తున్నారు. తెలుగు దేశం పార్టీని త్వరలో చీల్చేస్తారని.. సీఎం రమేష్ లాంటి షిండేలు టీడీపీలో ఉన్నారని కేశినేని గతంలో సంచలన ఆరోపణలు చేశారు.
తాజాగా కేసీఆర్ వ్యాఖ్యలు చూసిన తరువాత ఈ అనుమానం మరింత రెట్టింపు అయ్యింది. ఏపీ బీజేపీ నేతలు సైతం పదే పదే.. తెలుగు దేశం పార్టీకి భవిష్యత్తు లేదని.. ఆ పార్టీ త్వరలో అంతం అవుతుందని ఆరోపణలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఏపీలో అధికార వైసీపీని కాకుండా.. టీడీపీని టార్గెట్ చేయడం వెనుక పెద్ద ప్లానే ఉండొచ్చు అంటున్నారు.
ఇదీ చదవండి : యంగ్ టైగర్ కు కమలం గాలం.. బీజేపీకి జూనియర్ ఎన్టీఆర్ దగ్గర అయినట్టేనా..? టీడీపీ లెక్క ఏంటి..?
ప్రస్తుతం జగన్ కు పార్టీపై ఉన్న గ్రిప్.. నేతలపై ఆయనపై ఉన్న అభిమానంతో ఆ పార్టీని చీల్చినా పెద్దగా ప్రయోజనం ఉండదని.. తిరిగి అది తమపైనే ఎఫెక్ట్ చూపించే ప్రభావం ఉంటుందని అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికప్పుడు జగన్ ను దెబ్బ తీసే అవకాశం లేదని.. దానికి తోడు.. అన్ని విధలా జగన్ తమకు సహకరించే అవకాశమే ఉందని.. ఎప్పటికీ జగన్ కాంగ్రెస్ తో కలిసే అవకాశం లేకపోవడంతో.. వైసీపీని శాశ్వత మిత్రుడిగానే చూడాలని బీజేపీ భావిస్తోందని ప్రచారం జరుగుతోంది.
టీడీపీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రస్తుతం అధినాయకత్వంపై చాలామందికి నమ్మకం పోయింది. పార్టీ కేడర్ సైతం గందరగోళంగా ఉంది. మరోవైపు చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేస్తే గెలుస్తామనే నమ్మకం లేదనే ప్రచారం ఉంది. అందుకే పొత్తుల కోసం ఆరాటపడుతున్నారని.. దీన్నే అదునుగా చూసుకుని.. వచ్చే ఎన్నికల వరకు టీడీపీకి మద్దతు ఇస్తూ.. ఎక్కువ సీట్లు వస్తే అప్పుడు పార్టీని చీల్చే ప్రమాదం లేకపోలేదు అంటున్నారు.
అందుకే ఇప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ ను టీడీపీకి దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని.. టీడీపీలో చీలక తెచ్చి.. ఒక వర్గాన్ని నందమూరి కుటుంబానికి మద్దతుగా తయారు చేసి.. ఎన్టీఆర్ ను ముందు పెడితే.. టీడీపీని అంతం చేయడం పెద్ద కష్టం కాదన్నది బీజేపీ ప్లాన్ అయ్యి ఉండొచ్చని.. రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amit Shah, Andhra Pradesh, Ap cm jagan, AP News, Modi