YCP vs Janasena: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎన్నికల హీట్ కనిపిస్తోంది. అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ వర్సెస్ జనసేన (Janasena) పొలిటికల్ వార్ పీక్ కు చేరింది. అందులోనూ జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ను మంత్రులు టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిన్న పర్యటించారు. పట్టణంలోని 12వ వార్డులో గడపగడపకు మన ప్రభుత్వం (Gadapa Gadapaku Government) కార్యక్రమంలో మంత్రి పాల్గొని లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందజేసి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తరువాత బైపాస్ రోడ్డు నందు ప్రతిష్టించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన పవన్ తీరును తప్పు పట్టారు. అనంతరం జనసేన పార్టీకి ఓటు వేసేవారు ఆలోచించాలన్నారు. జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా చూడాలని అనుకోవాలన్నారు.
చంద్రబాబు నాయుడుకి బంట్రోతుగా ఉండి చంద్రబాబునాయుడుని ముఖ్యమంత్రి చేయాలని పవన్ పనిచేస్తూ ఉంటే జనసేన ఓటర్లు ఎలా జీర్ణించుకుంటారన్నారు. ఓటర్లు, జనసేన అభిమానులు తమ మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలన్నారు. ఇప్పటికే జనసేన కార్యకర్తలు ఆ విషయంలో ఆలోచనలో పడ్డారన్నారు.. చంద్రబాబును జనం మరిచిపోయారు కాబట్టి.. ఇప్పుడు ఆయన పవన్ జపం చేస్తున్నారని పెద్ది రెడ్డి ఆరోపించారు.
మరోవైపు సీఎం జగన్ పర్యటనపై మండిపడ్డారు జనసేన నేత నాదెండ్ల మనోహర్. సీఎం జగన్ పర్యటన తరువాత ఎచ్చెర్ల , శ్రీకాకుళం నియోజకవర్గాలలోని మత్స్యకార గ్రామాల్లో పర్యటించిన జనసేన నేత నాదెండ్ల మనోహర్ మత్స్యకారుల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమైందని విమర్శించారు. క్షేత్రస్థాయిలోకి వెళ్తే మత్స్యకారుల కష్టాలు తెలుస్తాయి. మత్స్యకార గ్రామాలలో వలసలు పోవడం దారుణం అన్నారు. మత్స్యకారుల యువతకు పార్టీ పరంగా సహకారం అందిస్తాం అన్నారు.
కర్ఫ్యూ వాతావరణం లోనే ముఖ్యమంత్రి జిల్లాకు రావాల్సి వచ్చిందన్నారు.151 స్థానాలు వచ్చిన వ్యక్తికి ఎందుకు భయపడాల్సి వచ్చింది. జనంలోకి కొచ్చి మాట్లాడడానికి జగన్ భయపడుతున్నారన్నారు. పరిపాలన చేతగాని వ్యక్తికి ముఖ్య మంత్రి పదవి ఇస్తే ఇలానే ఉంటుందని.. జనసేన పార్టీలో మత్స్యకార వికాస విభాగాన్ని ఏర్పాటు చేసి చైర్మన్ కూడా ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ వేదికలను రాజకీయం కోసం వ్యక్తిగత ఆరోపణల కోసం వాడుతున్నారని విమర్శించారు. ప్రజాదనంతో ఏర్పాటు చేసిన సభలను కేవలం పవన్ కళ్యాణ్ విమర్శించడానికి వాడుతున్నారని ఆరోపించారు. దమ్ముంటే పోలీసులు అధికారి యంత్రాంగం లేకుండా జగన్ బయటకు రాగలరా అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర యువత ఉపాధి కోరుకుంటుంది కానీ మూడు రాజధానులు కోరుకోవడం లేదన్నారు. మంత్రులకు నిజాయితీ ఉంటే యువతకి ఉపాధి కల్పించాలని మనోహర్ డిమాండ్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Janasena party, Nadendla Manohar, Peddireddy Ramachandra Reddy, Ycp