AP POLITICS ANDHRA PRADESH NEW DISTRICTS WILL START FROM APRIL SECOND CM JAGAN ALREADY FOCUSED NGS GNT
AP New Districts: కొత్తగా 13 జిల్లాలు.. 16 రెవిన్యూ డివిజన్లు.. ఏప్రిల్ 2న కొత్త జిల్లాలు ప్రారంభం..!!
ప్రతీకాత్మక చిత్రం
AP New Districts: ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటుకు తుది కసరత్తు పూర్తైంది. ఏప్రిల్ రెండో తేదీనే ఈ కొత్త జిల్లాలను ప్రారంభించనున్నట్టు సమాచారం. అయితే ముందుకు అనుకున్న దానికంటే.. రెవిన్యూ డివిజన్లు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీనికి సబంధించిన విధివిధానలను కూడా పూర్తి చేశారు. కొత్త జిల్లాలపై సీఎం జగన్ యాక్షన్ ప్లాన్ ఇదే.
AP New Districts: ఆంధ్రప్రదేశ్ (Andra Pradesh) లో కొత్త జిల్లాల (New District) ఏర్పాటు తుది దశకు చేరుకుంది. ఈ విషయంలో విపక్షాల విమర్శలు.. అభ్యంతరాలు సంగతి ఎలా ఉన్నా.. సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) దూకుడుగానే ముందుకు వెళ్లారు. ముందునుంచి ఆయన చెబుతున్నట్టుగానే.. ఉగాది (Ugadi) నాటికి ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేసేస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు వెనుక రాజకీయ పరమైన కారణాలు కూడా ఉన్నాయనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికే సీఎం జగన్ 2024 ఎన్నికల్లో గెలుపుపై ఫోకస్ చేశారని.. కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభమైనప్పటి నుంచే.. ఇక పార్టీ పరంగా ఆయన రంగంలోకి దిగాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అంతేకాదు.. జిల్లా ఏర్పాటు అయిన వెంటనే.. కొత్త మంత్రి వర్గ విస్తరణ చేయాలని.. ఏ మాత్రం ఆలస్యం అవ్వకూడదని సంకల్పంతో ఉన్నట్టు తెలుస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత.. ప్రస్తుతం మంత్రులుగా కొనసాగుతున్న వారితో రాజీనామాలు చేయించి.. కొత్త జిల్లాల్లో పార్టీ బాధ్యతలను ఆయా మంత్రులకు అప్పగిస్తారని వైసీపీ వర్గాల టాక్.. పరిపాలనా వికేంద్రీకరణే తమ ప్రభుత్వ నినాదం అని చెబుతోంది ప్రభుత్వం. అయితే మూడు రాజధానులు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఆ నిర్ణయం ముందుకు వెళ్లే అవకాశం కూడా తక్కువగానే ఉన్నాయి. న్యాయపరమైన ఇబ్బందులు తప్పవు. అందుకే ముందుగా ఈ జిల్లాల విభజన పూర్తి చేసి.. పరిపాలనా వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని ప్రజలకు గట్టిగా చెప్పాలని సీఎం జగన్ నిర్ణయించారు.
కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ఎన్ని అభ్యంతరాలు వ్యక్తం అయినా.. ఆయన ఈ విషయంలో దూకుడుగానే ముందడుగు వేశారు. ఇప్పటికే 13 కొత్త జిల్లాలకు సంబంధించి ముసాయిదా విడుదల అవ్వడం.. దానిపై అభ్యంతరాలు.. సలహాలు స్వీకరించారు. అన్ని పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు..సంస్థలు.. ప్రజల నుంచి దాదాపుగా 10 వేలకు పైగా అభ్యర్ధనలు వచ్చాయి. అందులో కీలకమైనవి.. రాజకీయ విబేధాలు లేని అంశాలను అధికారులు స్క్రూటినీ చేసారు. ముఖ్యంగా జిల్లాల పేర్లు పైన అభ్యంతరాలు.. జిల్లా ప్రధాన కేంద్రాల పైన డిమాండ్లు.. రెవిన్యూ డివిజన్ల పెంపు వంటి అంశాల పైన ఎక్కవ మొత్తంలో డిమాండ్లు వచ్చాయి. అయితే ఆ అభ్యంతరాలు, సూచనలను సీఎం పరిశీలించి.. తుది నిర్ణయం కూడా తీసుకోవడం జరిగిందని సమాచారం.
కొత్త జిల్లాలకు సంబంధించి ఈ నెల 29వ తేదీ నాటికి తుది నోటిఫికేషన్ విడుదుల కానుంది వైసీపీ వర్గాల టాక్. అలాగే 30, 31 తేదీల్లో అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేస్తారు. కొత్త జిల్లాలకు కలెక్టర్, ఒక జేసీ, ఎస్పీని నియమకాలకు సంబంధించిన కసరత్తు కూడా పూర్తైనట్టు సమాచారం. ఉద్యోగుల సర్దుబాట్లు.. అధికారుల నియామకం పైన తుది కసరత్తు పూర్తి చేశారని తెలుస్తోంది. అన్ని అనుకున్నట్టు జరిగితే ఏప్రిల్ 1న కొత్త జిల్లాల పైన తుది నోటిఫికేషన్ విడుదల కానుంది. కొత్తగా 13 జిల్లాలతో పాటు.. మొదట ప్రతిపాదించిన 11 కొత్త రెవిన్యూ డివిజన్ల సంఖ్యను 16కు పెంచుతూ సీఎం నిర్ణయం తీసుకున్నారని ప్రచారం ఉంది. 1వ తేదీ సాయంత్రం కొత్త జిల్లాల అధికారిక గజెట్ విడుదలతో పాటుగా వాటికి కలెక్టర్లు..ఎస్పీల నియామక ఉత్తర్వులు జారీ కానున్నాయి సమాచారం.
అలాగే కొత్త జిల్లాల్లో పని చేసేందుకు తాత్కాలిక కేటాయింపుల కింద సుమారుగా 10 వేల మంది ఉద్యోగులను ఎంపిక చేసారు. వారికి వర్క్ టు ఆర్డర్ కింద జిల్లాలకు కేటాయించేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. సీనియార్టీకి.. సర్వీసుకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదే సమయంలో కొత్త జిల్లాల ఏర్పాటు పైన న్యాయ పరమైన చిక్కులు సైతం లేకుండా ఆచి తూచి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. అన్నీ పూర్తి చేసిన తరువాత ఉగాది రోజున సీఎం జగన్ ఒకే సమయంలో కొత్త జిల్లాలను అధికారికంగా ప్రారంభిస్తారని వైసీపీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.