పోలవరం (Polavaram) పై తెలుగు రాష్ట్రాల రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వరదల తర్వాత తెలంగాణ (Telangana) మంత్రి పువ్వాడ అజయ్ కామెంట్స్ తో పాటు ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు వైసీపీ (YSRCP) కౌంటర్ ఇస్తోంది. తాజాగా ఏపీ మంత్రి అంబటి రాంబాబు (AP Minister Ambati Rambabu) పోలవరంపై ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చారు. పోలవరం ఆలస్యం కావడానికి తమ ప్రభుత్వమే కారణమనే ముద్ర వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని.., కేవలం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు వల్లే ప్రాజెక్టు ఆలస్యం అవుతోందని రాంబాబు విమర్శించారు. కాఫర్ డ్యామ్ నిర్మాణం కాకుండా డయాఫ్రామ్ వాల్ నిర్మించటం వల్ల అది వరదల్లో కొట్టుకు పోయిందని వివరించారు. భారీగా వరదలు వచ్చినా ఎక్కడా ప్రాణ నష్టం లేకుండా చూశామని.., బాధిత కుటుంబాలకు రెండు వేల రూపాయల చొప్పున చెల్లించిన ప్రభుత్వం తమదన్నారాయన.
కాళేశ్వరం ప్రాజెక్టు లో కొన్ని భాగాలు కొట్టుకుపోయాయంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు అంబటి రాంబాబు. తాము మాత్రం 28 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా ప్రాజెక్టు దగ్గరే ఉండి కాపాడుకున్నామని తెలిపారు. పోలవరం ప్రాజక్టు మొత్తం వాళ్ళే కట్టినట్టు టిడిపి మాట్లాడుతోందని.., పోలవరంలో బావర్ సంస్థ ఏమైనా ఊరికే పని చేసిందా అని ప్రశ్నించిన అంబటి.., రూ.400 కోట్లు తీసుకుని డయా ఫ్రం వాల్ కడితే అది వరదలకు మునిగిపోయిందన్నారు. చంద్రబాబు 40 సార్లు, దేవినేని ఉమ 90 సార్లు పోలవరం వెళ్లి ఒరగబెట్టిందేమీ లేదన్నారు.
వైసీపీ ప్రభుత్వం వచ్చాకే స్పిల్ వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్ పూర్తి చేసినట్లు అంబటి రాంబాబు వివరించారు. నదీ మళ్లించి స్పిల్ వే ద్వారా నీళ్ళు వదులుతున్నది తమ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. 2018 లోనే ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్ళు ఇస్తామని చెప్పిన ఉమ 5 ఏళ్ల లో ఏం చేశాడో చెప్పాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. మంత్రిగా నాకు సాంకేతిక అంశాలు తెలియాల్సిన అవసరం లేదగానీ కామన్ సెన్స్ ఉందన్నారు. దేశంలో ఆరోగ్య శాఖ ల మంత్రులు ఆస్పత్రుల్లో ఆపరేషన్లు చేస్తారా అని ప్రశ్నించారు. ఇక పోలవరం ఎత్తు తో తెలంగాణకు ఎలాంటి నష్టం లేదని.., ముంపు ప్రాంతాలను ఆర్డినెన్సు ద్వారానే ఏపీలో కలిపారన్న విషయాన్ని తెలంగాణ నేతలు గుర్తించాలని అంబటి రాంబాబు హితవు పలికారు.
పోలవరం జాతీయ ప్రాజెక్టు అయిన తర్వాత దానిని తామే నిర్మిస్తున్నట్లు భ్రమింప చేస్తున్నారని.., జాప్యం జరగటానికి కారణం ఏపీ ప్రభుత్వమేనని కేంద్రం చెప్పిందని.. ఇందులో ఐదేళ్లు టీడీపీ, మూడేళ్లు వైసీపీ అదికారులో ఉందని.. ఎక్కువ సమయం ఎవరు అధికారంలో ఉన్నారో చెప్పాలని అంబటి రాంబాబు అన్నారు. భూ సేకరణ, పరిహారానికి రూ.20వేల కోట్లు వెచ్చిస్తే తప్ప ప్రాజెక్టు పూర్తి అవ్వదని ఆయన స్పష్టం చేశారు. కొత్త డీపీఆర్ ఆమోదం అంశం కేంద్ర ప్రభుత్వం వద్దే పెండింగ్ లో ఉందని.., ఇంకా కేంద్రం నుంచి 2700 కోట్ల రూపాయలు ఏపీకి రావాల్సి ఉందని మంత్రి రాంబాబు అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ambati rambabu, Andhra Pradesh, Polavaram