Go 1 Fight: ఆంధ్రప్రదేశ్ లో జీవో 1 దుమారం రోజు రోజుకూ ముదురుతోంది. విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి జీవో 1 ను వ్యతిరేకిస్తున్నాయి. వెంటనే జీవో ఉపసహరించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఓ వైపు న్యాయపోరాటం చేస్తూనే.. మరోవైపు ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి. తెలుగు దేశం పార్టీ, జనసేన కలిసి ఉమ్మడి పోరుకు సిద్ధమవుతుంటే.. ఇతర పార్టీలు కూడా వారితో గొంతుకలిపే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఇప్పటికే జీవో 1 ను ఏపీ హై కోర్టు తీవ్రంగా తప్పు పట్టింది. ఆ జీవో అమలుపై స్టే విధించింది హైకోర్టు. ఈ నెల 23వ తేదీ వరకు స్టే అమలులో ఉంటుంది ఆదేశాలిచ్చింది. దీంతో హైకోర్టు నిర్ణయాన్ని విపక్షాలన్నీ స్వాగతించాయి. ఇలాంటి చీకటి జీవోలు ఎప్పుడూ నిలవవని విపక్షాలు చెబుతున్నాయి. ఇటీవల భోగీ మంటల్లో జీవో నెంబర్ 1 కాపీలను దహనం చేసి నిరసన తెలిపారు.
ఇంతకీ ఈ చట్టం ఏంటంటే..? రోడ్లపై బహిరంగ సభల్ని నిషేధిస్తూ తీసుకొచ్చిందే జీవో.. అయితే ఈ జీవో కేవలం విపక్షాల గొంతు నొక్కేందుకే జీవో అని.. అలాగే పాద యాత్రలు.. బస్సు యాత్రలు అడ్డుకునేందుకు ఇలాంటి జీవో లు తెచ్చింది అన్నది విపక్షాల వాదన.. అయితే ఈ జీవో నెంబర్ వన్ అంశంలో సుప్రీంకోర్టుకు వెళ్లింది ఏపీ ప్రభుత్వం. ఇటీవల హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టులో అప్పీల్‌కు వెళ్లింది రాష్ట్రం.
ఇటీవలి పరిణామాలు, జరిగిన దుర్ఘటనలను వివరిస్తూ రోడ్లపై బహిరంగ సభల్ని మాత్రమే నిషేధిస్తూ జీవో తెచ్చామని, హైకోర్టు ఇచ్చిన స్టేను రద్దు చేయాలని పిటిషన్ వేసింది. దీనిపై అత్యున్నత ధర్మాసనంలో విచారణ జరగాల్సి ఉంది. మరోవైపు ప్రతిపక్షాల సభలకు వస్తున్న జనాదరణ చూసి భయపడే ప్రభుత్వం జీవో వన్ తెచ్చిందని విమర్శించింది టీడీపీ .
కేవలం లోకేష్ పాదయాత్ర ఆగబోదన్నారు సీనియర్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్. ఎవరైనా నోరెత్తి మాట్లాడేందుకు భయపడే పరిస్థితులు సృష్టించారని ఆరోపించారు. అంతేకాకుండా చర్చకు రాకుండా ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. జీవో నెంబర్ .1 తమ కార్యక్రమాలను నియంత్రించలేవని పయ్యావుల స్పష్టం చేశారు. లోకేశ్ పాదయాత్రకు కూడా మంచి స్పందన వస్తుందని వెల్లడించారు.
టీడీపీ విమర్శల్ని ఖండిస్తోంది వైసీపీ . రోడ్‌షోలను, పాదయాత్రలను ఎక్కడా అడ్డుకోలేదన్నారు మంత్రి అమర్‌నాధ్. కేవలం రోడ్లపై సభలు మాత్రమే వద్దన్నది ప్రభుత్వ ఉద్దేశమన్నారు. అయితే హైకోర్టు ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన అప్పీల్‌పై సుప్రీంకోర్టు ఎలాంటి డైరెక్షన్స్ ఇస్తుందన్నది ఆసక్తిగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Supreme Court