హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP-TS Water War: తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ కౌంటర్... ఆ విషయంలో అభ్యంతరం

AP-TS Water War: తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ కౌంటర్... ఆ విషయంలో అభ్యంతరం

సీఎం వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

సీఎం వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

ఆంధ్రా-తెలంగాణ ప్రభుత్వాల మధ్య జలజగడం మరింత ముదిరింది. పరస్పర ఆరోపణలతో వాతావరణం వేడెక్కింది.

  ఆంధ్రప్రదేశ్-తెలంగాణ ప్రభుత్వాల మధ్య నీటి వివాదం మరింత ముదురుతోంది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును తెలంగాణ వ్యతిరేకిస్తుంటే.. కృష్ణానదిపై అనుమతుల్లేకుండా ప్రాజెక్టులు కడుతున్నారంటూ ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీంతో ఈ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. తెలంగాణ మంత్రుల విమర్శలు.. ఏపీ మంత్రుల ఎదురుదాడి వెరసి తెలుగు రాష్ట్రాల మధ్య వాతావరణం వేడెక్కింది. ఇప్పటికే కృష్ణాట్రైబ్యునల్ తో పాటు ఎన్జీటీ నుంచి ఏపీ ప్రభుత్వానికి హెచ్చరికలు వచ్చాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చేలా ఏపీ ప్రభుత్వం మరోవాదనను తెరపైకి తెచ్చింది. శ్రీశైలం జలాశయం నుంచి తెలంగాణ జెన్‌కో చేస్తున్న విద్యుదుత్పత్తిని తక్షణమే నిలుపుదల చేయాల్సిందిగా ఏపీ ప్రభుత్వం కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు (కేఆర్‌ఎంబీ)ను కోరింది. ఈ మేరకు రాష్ట్ర జలవనరుల శాఖ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ సి. నారాయణరెడ్డి కేఆర్‌ఎంబీ సభ్య కార్యదర్శికి లేఖ రాశారు.

  కేఆర్‌ఎంబీ నీటి విడుదలకు ఆదేశాలు జారీ చేయకపోయినా తెలంగాణ ప్రభుత్వం జూన్ 1 నుంచి ఏకపక్షంగా నీటిని విడుదల చేస్తూ విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని ఏపీ ప్రభుత్వం ఆరోపించింది. కనీస డ్రాయింగ్‌ లెవల్‌ 834 అడుగులు అయితే.. అంతకన్నా తక్కువ 808.40 అడుగులు నుంచే తెలంగాణ జెన్‌కో ఈ నెల 1 నుంచే విద్యుదుత్పత్తికి నీటిని వినియోగిస్తోందని లేఖలో పేర్కొన్నారు. ఇప్పటివరకు 8.89 టీఎంసీలు శ్రీశైలం జలాశయంలోకి రాగా.. అందులో 3 టీఎంసీలు అంటే 34 శాతం నీటిని తెలంగాణ జెన్‌కో విద్యుత్‌ ఉత్పత్తికి వాడేసిందని వివరించారు.

  అవసరం లేకున్నప్పటికీ తెలంగాణ జెన్‌కో ఇలా నీటిని వినియోగించడంవల్ల రిజర్వాయర్లో నీటిమట్టం పడిపోతోందని.. జలాశయం నీటి మట్టం పెరగడానికి ఇంకా చాలా సమయం పడుతుందని లేఖలో నారాయణ రెడ్డి వివరించారు. తెలంగాణ చర్యల వల్ల పోతిరెడ్డిపాడు, చెన్నైకు తాగునీరు, ఎస్‌ఆర్‌బీసీ, కేసీ కెనాల్, జీఎన్‌ఎస్‌ఎస్‌కు నీటి సరఫరాకు తీవ్ర జాప్యం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. జలాశయంలో కనీసం 854 అడుగులు ఉంటేనే ఏడు వేల క్యూసెక్కులు డ్రా చేయగలమని ఆయన పేర్కొన్నారు.

  నదికి వరద వచ్చిన సమయంలో తప్ప మిగిలిన సమయాల్లో కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు ఆదేశాల మేరకే శ్రీశైలం, నాగార్జునసాగర్‌ సాగునీటి, విద్యుత్‌ అవసరాలకు నీటిని వినియోగించాల్సి ఉందని, అయితే అందుకు విరుద్ధంగా తెలంగాణ జెన్‌కో శ్రీశైలం నుంచి విద్యుత్‌ ఉత్పత్తికి నీటిని వినియోగిస్తోందని ఆరోపించారు. కేఆర్ఎంబీ ఆదేశాలు లేకుండా కనీసం సమాచారం ఇవ్వకుండా ఆపరేషన్‌ ప్రొటోకాల్‌కు విరుద్ధంగా శ్రీశైలం జలాశయం నుంచి తెలంగాణ జెన్‌కో ఏకపక్షంగా చేస్తున్న విద్యుదుత్పత్తిని తక్షణం నిలుపుదల చేయాలని కోరారు.

  ఏపీ ప్రభుత్వం చేసిన ఆరోపణలపై కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ ఏ విధంగా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదం తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ఈ లేఖ చర్చనీయాంశమైంది.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Krishna River Management Board, Telangana, Water

  ఉత్తమ కథలు