Deputy CM: ఏపీ ఆ డిప్యూటీ సీఎం తీరే వేరు.. అధినేతకు వీర విదేయుడిని అంటారు..? ఆయన బొమ్మఉండే ఉంగరం ధరిస్తారు. అధినేత కాళ్లకు మొక్కుతారు.. ఆయన చూపించే అతిభక్తే రెండోసారి కేబినెట్ ఛాన్స్ అనే ప్రచారం ఉంది. అలాంటి డిప్యూటీ సీఎం ఇప్పుడు.. నేరుగా సీఎం వర్గంపైనే సంచలన ఆరోపణలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.
Deputy CM: వివాదాలకు కేరాఫ్ గా నిలుస్తున్నారు ఆ మంత్రి.. కేవలం మంత్రి మాత్రమే కాదు డిప్యూటీ సీఎం (Deputy CM) కూడా. అది కూడా సీఎం జగన్ (CM Jagan)రెండో కేబినెట్ లో డిప్యూటీ హోదా దక్కించుకున్నారు. అయితే ఆయకు ఈ పదవి రావడానికి ప్రధాన కారణం ఆయన చూపించే స్వామి భక్తే అని ప్రచారం ఉంది. ఎంతలా అంటే..? అధినేత ఫోకస్ తనపైన పడాలి అనే ఉద్దేశంతో ఆయన బొమ్మ ఉన్న ఉంగరాన్ని ధరించారు. ఇక ఏ మాత్రం అవకాశం వచ్చినా అధినేత కాళ్లకు మొక్కుతారు.. అక్కడితోనే ఆయన ఆగలేదు.. ఏకం సీఎంను దేవుడు కూడా చేశారు. జగన్ లో దేవుడికి ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయంటూ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలా అధినేత అంటే ప్రాణం ఇచ్చేందుకు వెనుకాడను అంటారు. అలాంటి ఆయన ఇప్పుడు నేరుగా సీఎం జగన్ వర్గాన్నే టార్గెట్ చేశారు. అయితే ఇవి ఆయన నోరు జారీ చేసిన వ్యాఖ్యలా..? లేక ఉద్దేశ పూర్వకంగానే ఈ వ్యాఖ్యాలు చేశారా అన్నది వైసీపీ ( YCP) వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. డిప్యూటీ సీఎం ఏంటి అంత మాట అనేసారు అంటూ వైసీపీ నాయకుల్లో విపరీతంగా చర్చ జరుగుతోంది. ఈ వ్యాఖ్యలు అధినేత వరకు వెళ్తే ఏంటి పరిస్థితి అని ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ ఆయన ఏమన్నాంటే..?
వైసీపీలోని రెడ్లు వర్గ పోరుతో దళిత వాడలపై పడుతున్నారని పేర్కొన్నారు. చిత్తూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఒక్కో రెడ్డి.. కొంత మంది దళితులను సమకూర్చుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. దీంతో ఎస్సీలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో తాను గెలవడానికి రెడ్లే కారణమన్నారు. వారు తనకు సపోర్ట్ చేశారని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు వైసీపీలో రెడ్లు రెండు వర్గాలుగా విడిపోయారని ఆయన వ్యాఖ్యానించారు. చిన్న చిన్న గొడవలతో తమ పార్టీలోని రెడ్లు వర్గాలుగా విడిపోవడం చూస్తే బాధేస్తుందన్నారు. ఈ విషయంలో తానేమైనా తప్పుగా మాట్లాడి ఉంటే తన పదవికి రాజీనామా కూడా చేస్తానన్నారు.
అక్కడితోనే ఆయన ఆగలేదు. ప్రస్తుతం రెండు వర్గాలుగా విడిపోయిన రెడ్లు దళితులపై పడుతున్నారని ఆరోపించారు. వర్గాలుగా విడిపోయిన రెడ్లు ఏమైనా చేస్తారని అభిప్రాయపడ్డారు. రెడ్లు లేకపోతే తాను గెలవలేనని చెప్పారు. వర్గపోరుకు రెడ్లు స్వస్తి పలకాలని నారాయణస్వామి సూచించారు. ఈ పరిణామాన్ని తాను అసలు ఊహించలేదన్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తమ జిల్లాలో రెడ్ల పెత్తనంపై అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదే క్రమంలో ఆయన పలుమార్లు రెడ్లను టార్గెట్ చేస్తూనే, తిరిగి వారిని బుజ్జగిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ మరోసారి ఆయన రెడ్లను, ఎస్సీలను కలుపుతూ సంచలన వ్యాఖ్యలు చేసారు. వైసీపీలో రెడ్లు రెండు వర్గాలుగా విడిపోయారంటూ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి షాకింగ్ వ్యాఖ్యలు చేసారు. అలాగే వారు దళితుల్ని, ఎస్సీల్ని కూడా విభజిస్తున్నారంటూ మరో కీలక వ్యాఖ్య చేశారు.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.