ఆంధ్రప్రదేశ్ లో ఓ వైపు పరిషత్ ఎన్నికల హడావిడి ఉండగానే మరోవైపు తిరుపతి ఉపఎన్నిక ప్రచారం జోరుగా సాగుతోంది. తిరుపతి స్థానాన్ని నిలబెట్టుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, గెలవాలన్న పట్టుదలతో తెలుగుదేశం.. రెండు పార్టీలకు షాక్ ఇవ్వాలని జనసేన, బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. ఉపఎన్నికకు టైమ్ దగ్గర పడుతుండటంతో అధికార వైసీపీ జోరు పెంచింది. త్వరలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతిలో ప్రచారం నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ తిరుపతి లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు లేఖలు రాశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గుర్తు చేస్తూ లబ్ధిదారులకు స్వయంగా లేఖలు రాశారు. 22 నెలల పరిపాలనా కాలంలో వైయస్సార్ కాంగ్రెస్‌పార్టీ ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ఆయా కుటుంబాలకు జరిగిన మేలును ఈ లేఖలో వివరించారు. తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీస్ లో జరిగిన కార్యక్రమంలో జగన్ తొలి లేఖపై సంతకం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైయస్సార్ సున్నావడ్డీ, వైయస్సార్ ఆసరా, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యాదీవెన, వైయస్సార్ చేయూత, వైయస్సార్ పింఛన్ కానుక, జగనన్న అమ్మ ఒడి, పేదలందరికీ ఇళ్లు తదితర పథకాల ద్వారా ఆయా కుటుంబాలకు జరిగిన లబ్ధిని ఈ లేఖల్లో పేర్కొన్నారు. గ్రామాలు, నగరాలు, వైద్యం, విద్యారంగాలు, వ్యవసాయం, రైతులు, అక్కచెల్లెమ్మలు, సామాజిక న్యాయం, పారదర్శక పాలన, అభివృద్ధి పనులు తదితర అంశాలను జగన్ ఈ లేఖల్లో ప్రస్తావించారు. ఈలేఖలో ప్రతిపక్ష పార్టీలమీద ఎలాంటి విమర్శలు చేయకుండా 22 నెలల పరిపాలనలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను, ప్రభుత్వం దార్శినికతను, వాగ్దానాలను నిలబెట్టుకున్న విధానాన్ని తెలియజేశారు. తిరుపతి ఉప ఎన్నికల్లో ఫ్యాను గుర్తుపై ఓటువేసి వైయస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న డాక్టర్ గురుమూర్తిని గెలిపించాలంటూ ఆయా కుటుంబాలను లేఖల ద్వారా అభ్యర్థించారు. ఈ లేఖలను వైసీపీ నేతలు ఓటర్లకు అందజేయనున్నారు.
ఇది చదవండి: కరోనా వ్యాక్సిన్ డోర్ డెలివరీ.. వివాదంలో వైసీపీ ఎమ్మెల్యేలు
కాగా ఈనెల 14న సీఎం జగన్ తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రచారం చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే వైసీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నారు. సభకు ఇప్పటికే అనుమతి పొందిన నేతలు... భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుపతి స్థానంలో గతంలో సాధించిన మెజారీటీ కంటే ఎక్కువ సాధించాలని వైసీపీ లక్ష్యంగా పెట్టుకుంది. కనీసం 3 లక్షల మెజారిటీ రావాలని సీఎం జగన్ టార్గెట్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలు తిరుపతిలో మకాం వేసి ప్రచారం చేస్తున్నారు. మరి జగన్ లేఖల ప్రచారం వైసీపీకి ఎంతటి మెజారిటీ చేకూరుస్తుందో వేచి చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap cm ys jagan mohan reddy, Tirupati Loksabha by-poll, Ysrcp