ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే నిధుల సమీకరణ కోసం ప్రభుత్వ స్థలాలను విక్రయించాలని నిర్ణయించిన జగన్ సర్కార్.. రాజధాని అమరావతి (Capital Amaravathi) విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలోని భూములు అమ్మేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. రాజధాని అభివృద్ధికి నిధుల సమీకరణలో భాగంగా రాజధాని భూములను విక్రయించాలని సీఆర్డీఏ (AP CRDA) ప్రణాళికలు రూపొందించింది. తొలి విడతలో మొత్తం 248.34 ఎకరాల భూముల అమ్మాలని నిర్ణయించింది. ఎకరా భూమి ధర కనీసం రూ.10కోట్లుగా నిర్ధారించిన ప్రభుత్వం మొత్తం దాదాపు రూ.2,500 కోట్లు సమీకరించనుంది. వేలం ద్వారా భూముల విక్రయానికి అనుమతినిస్తూ.. జీవో నెం 389 జారీ చేసింది. వచ్చే నెలలోనే భూములను వేలం ప్రక్రియ మొదలుకానుంది.
మొత్తం 600 ఎకరాల భూమిని విక్రయించేందుకు సీఆర్డీఏ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అమరావతి నిర్మాణానికి బ్యాంకులు రుణాలివ్వకపోవడంతో సొంతంగా నిధులు సమీకరించుకునే క్రమంలో భూముల విక్రయానికి సిద్ధమైంది. గతంలో బీఆర్ షెట్టి మెడిసిటీ కోసం ఇచ్చిన 100 ఎకరాలు, లండన్ కింగ్స్ కాలేజీకి ఇచ్చిన 148 ఎకరాలను విక్రయించాలని ప్రభుత్వం విక్రయించనుంది. ఆయా సంస్థలకు భూములు కేటాయించినా ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఆ భూములు విక్రయించాలని భావిస్తోంది. ప్రభుత్వం అమ్మాలనుకున్న 600 ఎకరాలను ఏడాదికి 50 ఎకరాల చొప్పున విక్రయించేందుకు కసరత్తు చేస్తోంది. ఇటీవల మున్సిపల్ శాఖపై సీఎం జగన్ (AP CM YS Jagan) నిర్ణయించిన సమీక్షలో భూములు విక్రయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే అమరావతి భూముల విక్రయంపై ప్రతిపక్షాలుగానీ, రైతులు గానీ ఇంకా స్పందించలేదు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజధాని అంశంపై దుమారం రేగుతూనే ఉంది. ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటన చేయడంతో అమరావతి ప్రాంత రైతులతో పాటు రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీంతో రాజధాని అంశం దాదాపు రెండేళ్లపాటు రగిలింది. చివరకు రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తోందని.. తమతో కుదుర్చున్న ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని కోర్టుకు తెలిపారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. రైతులకు అనకూలంగా తీర్పునిచ్చింది. అమరావతిని పూర్తి చేయడంతో పాటు రైతులకు ప్లాట్లను అప్పగించేందుకు గడువు విధించింది.
ఈ నేపథ్యంలో ప్లాట్లను రైతుల పేరిట రిజిస్ట్రేషన్ చేసేందుకు సీఆర్డీఏ సిద్ధమైనా రైతులు పలు ప్రశ్నలు లేవనెత్తారు. మరోవైపు రాజధానిలో నిర్మాణ పనులను కూడా ప్రభుత్వం మొదలుపెట్టింది. ఇదే సమయంలో ప్రభుత్వం భూముల విక్రయానికి సిద్ధమవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీనిపై ఎలాంటి స్పందనలు వస్తాయో వేచిచూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amaravati, Andhra Pradesh, Ap government, Crda