AP POLITICS ANDHRA PRADESH CM JAGAN MOHAN REDDY KEY ANNOUNCEMENTS AT PLEENARY ON NEXT ELECTIONS NGS
YSRCP Plenary: వైసీపీ ప్లీనరీకి భారీ ఏర్పాట్లు.. 23 నుంచి వైసీపీ నియోజకవర్గ స్థాయి ప్లీనరీ.. అందరి చూపు ఆమెపైనే?
సీఎం జగన్
YSRCP Plenary: వచ్చే ఎన్నికలకు ప్లీనరీ నుంచి సమర శంఖం పూరించేందుకు అధినేత జగన్ మోహన్ రెడ్డి సిద్ధమయ్యారు. ఇప్పటికే ప్లినరీ వేదికగా ఆయన కీలక ప్రకటనలు చేస్తారనే ప్రచారం ఉంది. మరోవైపు ఈ నెల 23 నుంచి వైసీపీ నియోజకవర్గ స్థాయి ప్లీనరీ జరగనుంది. అయితే ఈ ప్లీనరీలో సీఎం జగన్ ఏం ప్రకటన చేస్తారు అనే దాని కంటే.. అందరి చూపు ఆమెపైనే ఉంది.. కారణం ఏంటంటే?
YSRCP Plenary: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని అధికార వైసీపీ (YCP).. వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) జయంతిని పురస్కరించుకుని జూలై 8, 9 తేదీల్లో ప్లీనరీ నిర్వహణకు సిద్ధమైంది. గుంటూరు-విజయవాడ (Guntur Vijayawada) నగరాల మధ్యలో నాగార్జున యూనివర్శిటీ సమీపంలో ప్లీనరీకి ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జులు, జిల్లా అధ్యక్షులు, కో-ఆర్డినేటర్లతో ప్లీనరీ ఏర్పాట్లపై పార్టీ పెద్దలు ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూనే ఉన్నారు. పార్టీ ప్లీనరీని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని పార్టీ పెద్దలు పదే పదే నేతలకు చెబుతూ వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్లీనరీ వేదికగా సీఎం జగన్ (CM Jagan)పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు. అలాగే 2024లో జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కీలక ప్రకటనలు కూడా చేస్తారనే ప్రచారం ఉంది. ఈ ప్లీనరీ కోసం కేవలం వైసీపీ నేతలు, ఆ పార్టీ కేడర్ మాత్రమే కాదు.. విపక్షాలు సైతం ఉత్కంఠగ ఎదురుచూస్తున్నాయి. అందుకు ప్రధాన కారణం ప్లీనరీ వేదికగా సీఎం జగన్ సంచలన ప్రకటన చేస్తారంటూ సోషల్ మీడియా (Social Media) లో పుకార్లు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు.. లేదా ఎమ్మెల్యేలపై వేటు.. అలాగే ముందస్తు ఎన్నిలు.. ఇలాంటి కీలక విషయాలపై క్లారిటీ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అందుకే అందరూ ప్లీనరీలో జగన్ ప్రసంగం కోసం ఇప్పటి నుంచి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
వైసీపీ రాష్ట్ర స్థాయి ప్లీనరీ సమావేశాలు వచ్చే నెల 8, 9 తేదీల్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 23 నుంచి 28 వరకు నియోజకవర్గ సాయి ప్లీనరీ సన్నాహక సమావేశాలు నిర్వహించాలని ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జిలను వైసీపీ కేంద్ర కార్యాలయం ఆదేశించింది. జిల్లాల స్థాయిలో ఈ నెల 29,30, వచ్చే నెల 1 తేదీల్లో ప్లీనరీ సన్నాహక సమావేశాలు జరపాలని సూచించింది. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జిలు, పార్టీ జిల్లా అధ్యక్షులతో సమన్వయం చేసుకుని ఏర్పాట్లు చేసుకోవాలని వైసీపీ అధిష్ఠానం ఆదేశించింది. నియోజకవర్గంలో నిర్వహించాల్సిన ప్లీనరీకి కార్యాచరణ రూపొందించుకుని వివరాలను పార్టీ కేంద్ర కార్యాలయానికి తెలియజేయాలని తెలిపింది.
అలాగే ప్లీనరీకి సంబంధించి పార్టీ నేతలు, కార్యకర్తలు, అతిధులకు సౌకర్యవంతంగా ఉండేలా ప్లీనరీ నిర్వాహణ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. మరో రెండేళ్లలో ఎన్నికలు జరగనున్న దృష్టా ప్రజల్లోకి పార్టీనీ ఏవిధంగా వెళ్ళాలన్నదానిపైనా వైసీపీ అధిష్టానం ప్రధానంగా ఫోకస్ చేస్తోంది. ప్లీనరీ వేదికగానే అధినేత జగన్ ఎన్నికల సమర శంఖం పూరించే అవకాశం ఉంది. అయితే ఇటు జగన్ ఏం మాట్లాడుతారు అన్న అంశం ఆసక్తి పెంచుతుంటే.. మరోవైపు ఆమెపైనే అందరి చూపు పడింది. వైసీపీ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న వైఎస్ విజయమ్మ (YS Vijayamma) హాజరవుతారా ? లేదా ? అన్న విషయం ఉత్కంఠ పెంచుతోంది.
నిజానికి వైసీపీకి చాలాకాలం నుంచి విజయమ్మ దూరంగా ఉంటున్నారు. ఆ పార్టీ వ్యవహారాలను ఆమె ఏ మాత్రం పట్టించుకోలేదు. పార్టీ అధినేతగా ఉన్న సీఎం వైఎస్ జగన్ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. అయితే జగన్, ఆయన చెల్లెలు షర్మిల మధ్య విభేదాలు తలెత్తిన తరువాత విజయమ్మ ఎటు వైపు అనే చర్చ జరిగింది. విజయమ్మ కొంతకాలం నుంచి పూర్తిగా షర్మిలతోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమె హాజరవుతారా లేరా అన్నది చూడాలి. మరోవైపు ప్లీనరీ కి ముందు లేదా తరువాత.. ఆమె గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం కూడా ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.