ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అధికార పార్టీలో తీవ్ర చిచ్చురేపింది. పదవులు కోల్పోయినవారిలో కొందరు, పదవులు దక్కనివారు ఇంకొందరు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై అలకవహించారు. దాదాపు అన్ని జిల్లాల్లో వైసీపీ కార్యకర్తలు తమ అభిమాన నాయకులకు పదవులు దక్కలేదంటూ నిరసనలు, ఆందోళనలకు దిగారు. సీఎం నిర్ణయాలతో అసంతృప్తి చెందిన పలువురు నేతలు తీవ్ర నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఓవైపు బుజ్జగింపుల పర్వం కొనసాగుతూనే కొత్త మంత్రివర్గం తుది జాబితాలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సోమవారం ఉదయం ప్రమాణస్వీకారాలు చేసే సమయానికి ఏం జరగుగుతోందోనని పార్టీలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది..
కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో తీవ్ర కలకలానికి దారితీసింది. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి పదవి ఇవ్వలేదనే అసంతృప్తిలో ఆయన అభిమానురాలు మంటల్లోకి దూకేందుకు ప్రయత్నించింది. కొత్త కేబినెట్ లో ఎన్టీఆర్ జిల్లాకు ప్రాతినిధ్యం లేదంటూ నిరసనలు వ్యక్తమయ్యాయి. గుంటూరు జిల్లాలో సంచలన పరిణామంగా మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత రాజీనామాకు సిద్ధమైనట్లు తెలుస్తోంది..
జగన్ కేబినెట్ 2.0లో పాత మంత్రులు పలువురిని కొనసాగించారు. ప్రధానంగా దళితవర్గానికి చెందిన మంత్రుల్లో ఒక్క సుచరితను తప్ప మిగతా అందరినీ కొనసాగిస్తున్నారు. సీఎం నిర్ణయంపై మేకతోటి సుచరిత తీవ్ర మనస్తాపం చెందినట్లు తెలుస్తోంది. ఎస్సీ వర్గానికి చెందిన మంత్రులు అందరినీ కొనసాగిస్తూ తనను మాత్రం తప్పించడమేంటని సుచరిత సన్నిహితుల వద్ద వాపోయారు. తాను ఏ తప్పు చేశానని తొలగిస్తున్నారో అర్థం కావట్లేదని ఆమె వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.
సీఎం జగన్ నిర్ణయంపై అసంతృప్తిగా ఉన్న మేకతోటి సుచరిత ప్రత్తిపాడు ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారని తెలింది. స్పీకర్ ఫార్మాట్ లో ఆమె రాజీనామా లేఖను కూడా సిద్ధం చేసుకున్నారట. నిజానికి కొత్త కేబినెట్ కూర్పుపై పార్టీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో మాట్లాడేందుకు సుచరిత గత రెండు రోజులుగా ప్రయత్నించినా, సజ్జల అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, ఇప్పుడు ఏకంగా మంత్రి పదవి కోల్పోవడాన్ని సుచరిత తీవ్ర అవమానంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాజీనామా విషయమై సుచరిత తన అభిమానులతో మాట్లాడిన తర్వాత మీడియా ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. మరోవైపు,
నెల్లూరు జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మనస్తాపానికి గురయ్యారు. పండగ పూట నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు. లిస్టులో తన పేరు లేదని భావోద్వేగం వ్యక్తం చేశారు. తనకు మంత్రి పదవి దక్కడంలేదని వాపోయారు. అయినా సీఎం జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. పార్టీ గెలుపు కోసం కృష్టి చేస్తానని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP cabinet, Ap cm jagan, Kotamreddy sridhar reddy, Mekathoti sucharitha, Ys jagan, Ysrcp