ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అధికార పార్టీ వైసీపీ ప్లీనరీ (YSRCP Plenary-2022) కి సర్వం సిద్ధమైంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YSR) జయంతి సందర్భంగా పార్టీ ప్లీనరీని నిర్వహిస్తోంది వైసీపీ. రాష్ట్రంలో సీఎం జగన్ (YS Jagan) ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేపడుతున్న తొలి ప్లీనరీని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు వైసీపీ సిద్ధమైంది. రెండు రోజులపాటు గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న స్థలంలో ప్లీనరీకి అన్ని ఏర్పాట్లు చేశారు. పండుగలా నిర్వహిస్తున్న ప్లీనరీ కోసం భారీ ఏర్పాట్లు చేసిన నేతలు.. తొలి రోజు లక్ష మంది, రెండోరోజు పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ ప్రసంగ సమయానికి 3 నుంచి 4 లక్షల మంది హాజరయ్యేలా జన సమీకరణకు వైసీపీ కసరత్తు చేస్తోంది.
ప్లీనరీ వేదికకు వైఎస్సార్ ప్రాంగణం అని నామకరణం చేశారు. సీఎంతోపాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ ఛైర్మన్లు, మేయర్లు ఇలా మొత్తం 400 మంది వరకు కూర్చునేలా ప్రధాన వేదికను సిద్ధం చేశారు. రెండు రోజులు కలిపి సుమారు మూడున్నర లక్షల మందికి భోజనాలు తయారుచేస్తున్నారు. భోజనాల్లో వడ్డించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భారీగా స్వీట్లు, స్థానిక వంటకాలను తెప్పించారు. ముఖ్యంగా 25 టన్నుల తాపేశ్వరం కాజాలను కూడా తెప్పించారు.
ప్లీనరీ తొలిరోజు ఐదు తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమెదిస్తారు. అలాగే పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్ పార్టీ కమిటీలను ప్రకటిస్తారు. రెండోరోజు సాయంత్రం జగన్‌ను పార్టీ అధ్యక్షుడిగా మరోసారి ఎన్నుకోనున్నారు. తర్వాత ఆయన పార్టీ అధ్యక్షుడి హోదాలో సాయంత్రం 4 గంటలకు ప్లీనరీ ముగింపు ప్రసంగం చేస్తారు. ప్లీనరీలో భాగంగా 2024వచ్చే ఎన్నికలకు వైసీపీ కార్యాచరణను, పార్టీ విధాన నిర్ణయాలనూ జగన్ ప్రకటిస్తారు.
తొలి రోజు షెడ్యూల్ ఇదీ..
శుక్రవరం ఉదయం సీఎం జగన్ పార్టీ జెండాను ఆవిష్కరించి అధికారికంగా ప్లీనరీని ప్రారంభిస్తారు. తర్వాత దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి ముఖ్యమంత్రి, ఇతర నేతలు నివాళులర్పిస్తారు. అనంతరం పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియను ప్రకటించనున్నారు. ఆ వెంటనే ముఖ్యమంత్రి ప్రారంభోపన్యాసం చేస్తారు.
తొలి రోజు ప్లీనరీలో 5 తీర్మానాలు చేయనున్నారు. ఉదయం 11 గంటల 45 నిమిషాలకు మొదటి తీర్మానంగా మహిళా సాధికారత దిశ చట్టంపై చర్చిస్తారు. దీనిపై మంత్రులు ఉషశ్రీ చరణ్, రోజా, ఎమ్మెల్సీ పోతుల సునీత, లక్ష్మీపార్వతి, జక్కంపూడి విజయలక్ష్మి ప్రసంగిస్తారు. విద్యపై రెండో తీర్మానం ఉంటుంది. ఈ అంశంపై మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య, సుధాకర్ బాబు, అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ మాట్లాడతారు. 2.15 నిమిషాల నుంచి ఒక పావు గంట పాటు సాంస్కృతిక కార్యక్రమాలుంటాయి.
మధ్యాహ్నం 2:30 కు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పై తీర్మానం ఉంటుంది. దీనిపై మంత్రులు పెద్దిరెడ్డి, బుగ్గన, ఎమ్మెల్యేలు కొత్తగుళ్ళి భాగ్యలక్ష్మి, చెవిరెడ్డి భాస్కర రెడ్డి మాట్లాతారు. ఆ తర్వాత వైద్యంపై తీర్మానం ఉంటుంది. వైద్యం అంశంపై మంత్రులు విడదల రజిని, సిదిరి అప్పలరాజు, ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ యాదవ్, ఆళ్ల నాని ప్రసంగిస్తారు. సాయంత్రం నాలుగున్నరకు పరిపాలనా- పారదర్శకత అంశం పై చర్చిస్తారు. దీనిపై స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఎమ్మెల్యేలు పుష్ప శ్రీవాణి, పార్థసారథి మాట్లాడతారు. సాయంత్రం ఐదు గంటలతో తొలిరోజు ప్లీనరీ సమావేశం ముగుస్తుంది.
ప్లీనరీలో ప్రధానంగా పార్టీ నియమావళిలో సవరణలు చేయనున్నారు. ప్రస్తుతం దీనిపై జోరుగా చర్చ జరుగుతోంది. పార్టీ గౌరవాధ్యక్ష పదవిని రద్దు చేయడంతో పాటు శాశ్వత అధ్యక్షుడుగా వైఎస్ జగన్ ను ఎన్నుకోవడం, సంస్థాగత నిర్మాణంలో కీలక మార్పులు వంటివి పార్టీ సవరణల్లో ఉండే అవకాశమున్నట్లు వార్తలు వస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.