ఏపీ రాజకీయాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికలకు సమాయత్తమవుతున్న తరుణంలో.. ఎన్నికలకు ముందు పార్టీలు మారే నేతల కూడా అప్పుడే తమ పని మొదలుపెట్టినట్టు కనిపిస్తోంది. తాజాగా నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy) కూడా ఈ కోవలోకే వస్తారనే చర్చ జరుగుతోంది. ఏపీలోని వైసీపీ ప్రభుత్వం సొంత పార్టీ ఎమ్మెల్యే అయిన తనపై ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిందని.. అందుకే తాను వైసీపీలో కొనసాగాలని అనుకోవడం లేదని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తాను టీడీపీ తరపున పోటీ చేయాలని అనుకుంటున్నట్టు మనసులోని మాటను కూడా బయటపెట్టారు. ఎన్నికలకు చాలా సమయం ఉండగానే పార్టీ మారినప్పటికీ.. కోటంరెడ్డిని ఎన్నికలకు ముందు పార్టీ మారే నాయకుడిగానే చూస్తోంది వైసీపీ నాయకత్వం.
కోటంరెడ్డి కంటే ముందు వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి (Anam Ramanarayana Reddy) కూడా ఇదే రకంగా వైసీపీ నాయకత్వం, ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. దీంతో వైసీపీ నాయకత్వం ఆయనను పక్కనపెట్టింది. ఇలా ఒక్క నెల్లూరు(Nellore) జిల్లాలోనే ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేయడానికి దాదాపుగా రెడీ అయిపోయినట్టు రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. అయితే ఇలా ఎన్నికలకు ముందు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్న నాయకుల్లో ఇంకా ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ముఖ్యనేతలు ఉన్నారనే దానిపై వైసీపీ వర్గాల్లోనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆ మాట మాజీ హోంమంత్రి సుచరిత సైతం పార్టీ మార్పుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అయితే ఇలాంటి నేతలంతా పార్టీ మారేందుకు ఎందుకు సిద్ధపడుతున్నారనే దానిపై కూడా పార్టీలో చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గెలిచే అవకాశం ఉన్న వారికే మళ్లీ టికెట్లు వస్తాయని.. గెలుపు అవకాశం లేని వారిని పక్కనపెడతామని సీఎం జగన్ పదే పదే పార్టీ సమావేశాలు, సమీక్షల్లో చెబుతున్నారు. ఈ విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదని చెబుతూ వస్తున్నారు.
వైసీపీలో అసమ్మతి రాగం.. ఎమ్మెల్యేల కామెంట్స్ దేనికి సంకేతం..?
Pawan Kalyan: జగన్ సర్కార్ పై పవన్ కళ్యాణ్ ట్వీట్ల దాడి..ధనిక సీఎం పాలనలో పేద ఏపీ అంటూ..
దీంతో వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ తమకు పోటీ చేసే అవకాశం ఇవ్వరని కచ్చితంగా సమాచారం ఉన్న నేతలే.. ఈ రకంగా పక్కచూపులు చూస్తున్నారేమో అనే ఊహాగానాలు కూడా వైసీపీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అలాంటి నేతలు ఎంతమంది ఉన్నారు ? ఇకపై మెల్లిమెల్లిగా ఏదో రకంగా పార్టీ వీడతారా ? అనే చర్చ మొదలైంది. మొత్తానికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారం వైసీపీలో కొత్త రకమైన చర్చకు తెరలేపినట్టు కనిపిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Kotamreddy sridhar reddy