అమలాపురం (Amalapuram) ఘటనలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోందని హోం మంత్రి తానేటి వనిత (Home Minister Taneti Vanitha) స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ ఘటనపై డీజీపీతో సమీక్షించామన్నారు. ఆందోళనలు జరగకుండా అడిషనల్ డీజీ, డీఐజి, ఎస్పీ లను, అదనపు బలగాలను పంపించామని.., అమలాపురంలో ఆందోళన పరిస్థితులను పోలీసులు అదుపులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. ప్రజలెవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న మంత్రి.., అందరూ ధైర్యంగా ఉండొచ్చని.., హింసకు పాల్పడిన ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. గతంలో 7కు పైగా కేసులు ఉన్న వారిని 72 మందిని పోలీసులు గుర్తించి.. వారిలో 46 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లపై దాడి చేసిన వారిని గుర్తించి అదుపులోకి తీసుకుననామని.., శాసన సభ్యులు, మంత్రి గారి ఇళ్లపై, జిల్లా ఎస్పీ, డీఎస్పీ, ఇతర పోలీసులపై కూడా దాడి చేయడాన్ని ఖండిస్తున్నట్లు మంత్రి చెప్పారు.
ఆందోళనకారులు దాడి చేస్తున్నప్పటికీ ఎదురుదాడి చేయకుండా పోలీసులు సంయమనం పాటించారని.,. అమలాపురం ఘటనలో ప్రాణనష్టం జరగకుండా, ప్రజలకు, ఆందోళనకారులు ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారని తానేటి వనిత అన్నారు. పోలీసులు తాము గాయపడినప్పటికి ప్రజలకు రక్షణగా ఉంటూ.. ఆందోళనకారులను అదుపు చేసినట్లు వివరించారు. పోలీసులు వ్యవరించిన తీరే ఫ్రెండ్లీ పోలీసింగ్ కు నిదర్శనం. పోలీసులను అభినందిస్తున్నట్లు మంత్రి చెప్పారు..
సోషల్ మీడియా ద్వారా రూమర్స్ వెళ్ళకుండా అమలాపురం లో ఇంటర్నెట్ సేవలను నిలిపేశామని.., ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పూర్తి అప్రమత్తంగా ఉన్నారని వనిత వివరించారు. ఇదిలా ఉంటే.. అమలాపురంలో అల్లర్లకు కారణమని భావిస్తున్న అన్యం సాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అమలాపురం వైసీపీ నేతతో దగ్గరి సంబంధాలున్నాయని భావిస్తున్న అన్యం సాయి.., ఈనెల 20న కోనసీమ సాధన సమితి ఆందోళనలో పాల్గొన్నాడు. కోనసీమ జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. అన్యం సాయిపై గతంలోనే రౌడీషీట్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఐతే ఇప్పుడు అన్యం సాయి ఏపార్టీ వాడనేదానిపైనా చర్చ జరుగుతోంది. సాయి వైసీపీ కార్యకర్తంటూ జనసేన నేతలు కొన్ని ఫోటోలు బయటపెడుతుంటే.. వైసీపీ కూడా జనసేనకు చెందిన వాడంటూ ఫోటోలు వైరల్ చేస్తున్నాడు. ఐతే సాయి సోషల్ మీడియా ఎకౌంట్లలో చూస్తే మాత్రం అమలాపురంకు చెందిన వైసీపీ నేతలతో దిగిన ఫోటోలే కనిపిస్తున్నాయని జనసేన ఆరోపిస్తోంది. సీఎం జగన్ బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న ఫోటోలు, మాజీ హోంమంత్రి సుచరిత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, జక్కంపూడి రాజాతో పాటు జనసేనలో గెలిచి వైసీపీకి మద్దతిస్తున్న రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తో దిగిన ఫోటోలను జనసైనికులు వైరల్ చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP Politics, East godavari