భార్య శవాన్ని భుజాన మోసుకొని వెళ్లిన భర్త.. కొడుకు మృతదేహాన్ని చేతలపై తీసుకెళ్లిన తండ్రి.. ఇలాంటి వార్తలను అప్పుడప్పుడూ పేపర్లు,టీవీల్లో చూస్తుంటాం. ప్రైవేట్ అంబులెన్స్‌లకు డబ్బులు ఇవ్వలేక.. ప్రభుత్వ ఆస్పత్రులను అంబులెన్స్‌లను పంపించక.. కొందరు అభాగ్యులు.. భుజాలపైనా తమ అయినవారి మృతదేహలను తీసుకెళ్లిన ఘటన గతంలో పలు చోట్ల జరిగాయి. ఈ కాలంలోనూ ఇలాంటి హృదయ విదారకర ఘటనలు జరగడం శోచనీయం. తాజాగా ఏపీలోని విజయనగరం జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఆస్పత్రిలో మరణించిన భార్య మృతదేహాన్ని ఇంటికి తరలించేందకు డబ్బులు లేకపోవడంతో.. ఆమె భర్త భుజాలపైనే మృతదేహాన్ని తీసుకెళ్లాలనుకున్నాడు. అది కూడా తక్కువ దూరం కాదు. ఏపీ నుంచి ఒడిశాకు..! అతడి కష్టాన్ని చూసి.. పోలీసులు చలించిపోయారు. అంబులెన్స్ ఏర్పాటు చేసి.. స్వస్థలానికి పంపించారు.
ఒడిశాలోని కొరాపుట్ జిల్లా పొట్టంగి మండలం సొరడ గ్రామానికి చెందిన ఈడె గురు (30) అనే మహిళ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె భర్త సాములు విశాఖ జిల్లా తగరపువలసలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. వారం రోజులయినా ఆరోగ్యం కుదుట పడలేదు. మరోవైపు చేతిలో డబ్బులు కూడా లేవు. ఉన్న డబ్బంతా ఖర్చయింది. వైద్య చికిత్సను కొనసాగించలేక.. ఆస్పత్రి నుంచి ఆమెను బుధవారం డిశ్చార్జి చేశారు. సాములు తన భార్యను సొంతూరికి తీసుకెళ్లాలని అనుకున్నాడు. మొదట సాలూరుకు వెళ్లి.. అక్కడి నుంచి ఒడిశాకు వేరే వాహనంలో వెళ్దామని భావించారు. ఓ ఆటోను మాట్లాడుకొని అందులో ఎక్కారు. ఐతే ఆటో విజయనగరం జిల్లా గంట్యాడ మండలం రామవరం సమీపంలోకి చేరుకోగానే.. గురు చనిపోయారు. ఆమె చనిపోవడంతో.. ఆటో డ్రైవర్ వారిని మధ్యలో వదిలేసి. వెళ్లిపోయాడు. నడిరోడ్డుపై అలా వదిలేయడంతో.. సాములుకు ఏం చేయాలో తెలియలేదు. చేతిలో డబ్బులు కూడా లేవు. దిక్కుతోచని పరిస్థితిలో... తన భుజంపై భార్య మృతేదేహాన్ని మోస్తూ.. ముందుకెళ్లాడు. ఆయనకు రోడ్డు కూడా తెలియదు. ఎటు వైపు వెళ్తాన్నాడో తెలియడం లేదు. తెలుగు రాకపోవడంతో ఆయన అడిగేది ఎవరికీ.. అర్ధం కాలేదు. తాను వచ్చిన దారిలోనే తిరిగి నాలుగు కిలోమీటర్లు వెనక్కి వెళ్లిపోయాడు.
సాములు తన భార్య మృతదేహాన్ని భుజంపై వేసుకొని వెళ్తుండగా.. కొందరు స్థానికులు గమనించి.. పోలీసులుకు సమాచారం ఇచ్చారు. వెంటనే గంట్యాడ. సీఐ టి.వి.తిరుపతిరావు, ఎస్సై కిరణ్‌కుమార్ రామవరం వద్దకు చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సాములుకు భోజనం పెట్టించారు. ఓ ప్రైవేటు అంబులెన్సును మాట్లాడి స్వగ్రామానికి పంపించారు. అక్కడి నుంచి సాములు స్వస్థలం 125 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంబులెన్స్‌లో ఎక్కించిన తర్వాత.. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని పాచిపెంట సీఐ, ఎస్సైలకు కూడా సమాచారమిచ్చారు. బాధితుడి బంధువుల వివరాలను సేకరించి.. వారికి సమాచారం ఇవ్వాలని చెప్పారు. అలా సామూలు తన ఊరికి వెళ్లే వరకు.. ఫాలో అప్ చేశారు. భార్యను కోల్పోయి.. పుట్టెడు దు:ఖంలో ఉన్న వ్యక్తికి.. విజయనగరం పోలీసులు మానవత్వంతో సాయం చేయడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Vizianagaram