ఏపీలో సంచలనం రేపిన దుర్గగుడి వెండి సింహాల కేసు మిస్టరీ వీడింది. కొన్ని నెలలుగా లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఈ కేసులో పశ్చిమ గోదావరికి చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 15.4 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. బెజవాడ కనకదుర్గమ్మ రథానికి ఉండాల్సిన నాలుగు వెండి సింహల్లో మూడు చోరీకి గురైనట్లు 2020 సెప్టెంబర్ 17న ఫిర్యాదు నమోదయింది. అప్పట్లో దీనిపై పెద్ద రచ్చే జరిగింది. బీజేపీ నేతలు ఆలయాన్ని సందర్శించి.. రథాన్ని పరిశీలించారు. ఏపీలో ప్రముఖమైన ఆలయంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యహరిస్తారా..? అని ఆలయ అధికారులపై మండిపడ్డారు. జగన్ హయాంలో హిందూ ఆలయాలకు రక్షణ లేకుండాపోయిందని విరుచుకుపడ్డారు.
అన్ని వైపుల నుంచి విమర్శలు రావడతో పోలీసులు ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్నారు. ప్రత్యేక బందం రంగంలోకి దిగి.. దాదాపు 140 మందిని విచారించి, అన్ని కోణాల్లో సమగ్రమైన దర్యాప్తు జరిపింది. చోరీ ఎప్పుడు జరిగిందో నిర్దిష్టంగా తెలీకపోవడం, ఆధారాలు లభించకపోవడం, సీసీ టీవీ ఫుటేజ్ 15వ రోజులకు మించి అందుబాటులో లేకపోవడం దర్యాప్తు క్లిష్టంగా మారింది. అనేక మంది పాత నేరస్తులను విచారించిన అనంతరం పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన జక్కంపూడి సాయిబాబా వెండి సింహాల చోరీకి పాల్పడినట్లు గుర్తించామని పోలీసులు వెల్లడించారు. దుర్గగుడిలో దొంగిలించిన వెండి సింహాలను తణుకు తీసుకెళ్లి, ముత్త కమలేష్ అనే బంగారు వ్యాపారికి విక్రయించాడు.
నిందితులు సాయిబాబా, కమలేష్ లను అరెస్టు చేసిన పోలీసులు.. అమ్మవారి వెండి సింహాలకు చెందిన 9 కిలోల వెండితో సహా మొత్తం 15.4 కిలోల వెండి దిమ్మెలను స్వాధీనం చేసుకున్నారు. ఇటువంటి సున్నితమైన అంశాలపై ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు, మీడియా సంయమనంతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనతో అప్రమత్తమయ్యామని.. కమిషనరేట్ పరిధిలో దేవాలయాల వద్ద ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టామని తెలిపారు. దేవాలయాలపై దాడులకు పాల్పడేవారిని అడ్డుకోవడంలో ప్రజల సహకారం కీలకమని చెప్పారు. ఇక వెండి సింహాల చోరీ కేసును చేధించిన ఏసీపీ హనుమంతరావు, సీఐ పి.వెంకటేశ్వర్లు, ఇబ్రహీంపట్నం హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్‌కు రివార్డులు అందిస్తామని పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు.
Published by:Shiva Kumar Addula
First published:January 23, 2021, 20:48 IST