ఆంధ్రప్రదేశ్లో తొలివిడత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. శనివారం ఉదయం విజయవాడలోని ఎస్ఈసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు రమేష్ కుమార్ తెలిపారు. ఎన్నికలకు సంబంధించి సుప్రీం కోర్టు తీర్పు వస్తే తప్పుకుండా పాటిస్తామని స్పష్టం చేశారు. రెవెన్యూ డివిజన్ ప్రతిపాదికగానే ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. విజయనగరం, ప్రకాశం మినహా మిగిలిన 11 జిల్లాల్లో తొలి విడత ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తొలి విడతకు జనవరి 25 నుంచి నామినేషన్ల స్వీకరించనుండగా.. ఫిబ్రవరి 5వ తేదీన పోలింగ్ జరుగుతుందని చెప్పారు. ఎన్నికల జాబితా సకాలంలో అందించడంలో పంచాయతీరాజ్ అధికారులు విఫలమయ్యారని అన్నారు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో 2019 ఓటర్ల జాబితాతోనే ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎన్నికలపై సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నామని.. సీఎస్, డీజీపీ సహా ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొనాలని కోరుతున్నాం అన్నారు.
ఎన్నికలు సకాలంలో నిర్వర్తించడం ఎన్నికల కమిషన్ విధి అని అన్నారు. ఎన్నికల సంఘానికి నిధులు, సిబ్బంది కొరత వంటి సమస్యలు ఉన్నాయని చెప్పారు. వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన సరైనా పరిష్కారం లభించలేదని.. అందుకే కోర్టును ఆశ్రయించామని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్లో తక్కువ మందే ఉన్న సమర్ధవంతంగా పనిచేస్తున్నారని అన్నారు. ఈ ఎన్నికల నిర్వహణ తమకు పెను సవాలేనని అన్నారు. దేశమంతటా ఎన్నికలు జరుగుతున్నా ఏపీలో వద్దనడం సరికాదని వ్యాఖ్యానించారు. ఉద్యోగ సంఘాలు భిన్నవాదనలు వినిపించాయని చెప్పారు. ఏకగ్రీన ఎన్నికపై కమిషన్ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఐజీ స్థాయి అధికారితో పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఎన్నికల సక్రమ నిర్వహణకు ప్రభుత్వం సహకరించాలని కోరారు.
తొలి దశ పంచాయతీ ఎన్నికల పూర్తి షెడ్యూల్..
జనవరి 23- తొలిదశ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్
జనవరి 25- అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ
జనవరి 27- అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసేందుకు తుది గడవు
జనవరి 28- అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ల పరిశీలన
జనవరి 29- నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన
జనవరి 30- అభ్యంతరాలపై తుది నిర్ణయం
జనవరి 31- మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉప సంహరణకు తుది గడవు. అనంతరం పోటీలో నిలిచిన అభ్యర్థుల జాబితా విడుదల
ఫిబ్రవరి 5- పోలింగ్( ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్). అనంతరం మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి. ఆ తర్వాత ఉప సర్పంచి ఎన్నిక ప్రక్రియ.