హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Panchayat Elections 2021: పంచాయతీ ఎన్నికలపై ఏపీ ప్రభుత్వం పిటిషన్.. విచారణ బెంచ్‌ను మార్చిన సుప్రీం కోర్టు రిజిస్ట్రీ

AP Panchayat Elections 2021: పంచాయతీ ఎన్నికలపై ఏపీ ప్రభుత్వం పిటిషన్.. విచారణ బెంచ్‌ను మార్చిన సుప్రీం కోర్టు రిజిస్ట్రీ

పంచాయతీ ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్

పంచాయతీ ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

  ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సోమవారం ఈ పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఎలాంటి తీర్పు వెలువరిస్తుందో అనే సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుప్రీం కోర్టులో ఈ పిటిషన్‌పై విచారణ జరిపే బెంచ్ మారింది. తొలుత జస్టిస్ లావు నాగేశ్వరావు ధర్మాసనం జాబితాలో ఈ పిటిషన్ ఉంచారు. అయితే తాజాగా ఈ పిటిషన్‌ విచారణను జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ రిషికేశ్ రాయ్ బెంచ్‌కు సుప్రీం కోర్టు రిజిస్ట్రీ మార్చింది. ఇక, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కరోనా వ్యాక్సినేషన్ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలను నిలుపుదల చేయాలని వైఎస్ జగన్ సర్కార్ తన పిటిషన్‌లో పేర్కొంది. మరోవైపు ఉద్యోగ సంఘాలు సైతం వేరుగా పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఇక, ఈ పిటిషన్లు సోమవారం ఉదయం 11 గంటల తర్వాత విచారణకు వచ్చే అవకాశం ఉంది.

  ఇక, ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై దుమారం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ కు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సుదీర్ఘ యుద్ధం సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. మరోవైపు ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం ఇప్పట్లో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని తెలిపాయి. అలాగే ఎస్‌ఈసీ తలపెట్టిన వీడియో కాన్ఫరెన్స్ కూడా ఉన్నతాధికారులు హాజరుకాలేదు.

  ఉద్యోగ సంఘాల నేతలు కూడా ఎస్‌ఈసీ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. మరోవైపు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ మాత్రం ఎన్నికలను అడ్డుకుంటే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీం కోర్టు ఇచ్చే ఆదేశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Andhra Pradesh, Ap local body elections, Nimmagadda Ramesh Kumar, Supreme Court

  ఉత్తమ కథలు