ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్ బాధ్యతలు స్వీకరించారు. చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని పదవీకాలం నేటితో ముగుస్తోంది. దీంతో ఆమె స్థానంలో ఆదిత్యనాథ్ దాస్ కొత్త సీఎస్‌గా నియమిస్తూ ప్రభుత్వం వారం క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రోజు ఆదిత్యనాథ్ దాస్ కొత్త చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు. ఆదిత్యనాథ్ దాస్ సొంత రాష్ట్రం బీహార్. తల్లిదండ్రులు డాక్టర్ గౌరీ కాంత్ దాస్, కుసుం కుమారి. 1987వ బ్యాచ్ ఐఏఎస్ అధికారి. బెనారస్ హిందూ యూనివర్సిటీలో బీఎస్సీ హానర్స్ (1980-84), ఢిల్లీలోని జేఎన్‌యూలో ఇంటర్నేషనల్ స్టడీస్(1984-86) చేశారు. విజయనగరం, విజయవాడ అసిస్టెంట్ కలెక్టర్‌గా, కృష్ణా జిల్లా జేసీగా, వరంగల్ కలెక్టర్‌గా, మురికివాడల అభివృద్ధి పథకం పీడీ, అదనపు కమిషనర్, మునిసిపల్ పరిపాలన కమిషనర్ అండ్ డైరెక్టర్, నీటి పారుదల శాఖ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీగా కూడా ఆయన సేవలందించారు. 2007 నుంచి ఆయన ఇరిగేషన్ శాఖలో కీలక బాధ్యతల్లో ఉన్నారు. అయితే, టీడీపీ హయాంలో ఆయన్ను పక్కన పెట్టారు. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత ఆదిత్యనాథ్ దాస్ సీఎంఓ ముఖ్య కార్యదర్శి అవుతారని అంతా భావించారు. అయితే, జగన్ మాత్రం ఆయన్ను నీటిపారుదల శాఖలోనే కొనసాగించడానికి మొగ్గుచూపారు. తాజాగా సీఎస్ నీలం సాహ్ని పదవీకాలం ముగిసిపోవడంతో ఆయన సీఎస్ అయ్యారు.
ఆదిత్యనాథ్ దాస్ మీద సుమారు 20 ఏళ్ల క్రితం హత్యాయత్నం జరిగింది. ఆయన మీద నక్సల్స్ కాల్పులు జరిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వరంగల్ జిల్లా కలెక్టర్‌గా ఉన్న సమయంలో ఆయన ఏటూరునాగారంలో ఐటీడీఏ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. అయితే, ఆ సమయంలోనే ఆయన మీద ఎటాక్ జరిగింది. నక్సల్స్ ఎటాక్ చేశారు. ఆ కాల్పుల్లో ఆదిత్యనాథ్ దాస్ భుజానికి బుల్లెట్ తగిలింది. అదే సమయంలో ఆయన కారు డ్రైవర్‌కు కూడా బుల్లెట్ గాయాలు అయ్యాయి. ఆ టైమ్‌లో డ్రైవర్ సమయస్ఫూర్తిగా వ్యవహరించారు. వెంటనే వేగంగా కారును కొంచెం దూరం ముందుకు తీసుకెళ్లిపోయారు. అయితే, అదే సమయంలో మరో ఘటన కూడా జరిగింది. తమ టార్గెట్ ఆయన కాదని, అసలు టార్గెట్ వేరే అయితే, పొరపాటున ఆదిత్యనాథ్ దాస్ మీద కాల్పులు జరుపుతున్నామని భావించిన నక్సలైట్ నాయకుడు ఒకరు కూడా కాల్పులు ఆపేశాడు. దీంతో కాల్పుల మోత ఆగింది.
ఆ ఘటన జరిగిన వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాల్పుల్లో గాయపడిన డ్రైవర్‌ను అత్యవసర చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు ఆదిత్యనాథ్ దాస్. తన భుజానికి కూడా బుల్లెట్ గాయం అయినా కూడా ఆయన ప్రైవేట్ ఆస్పత్రిలో చేరకుండా వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. ఆ రోజు తన ప్రాణాలను సమ్మక్క సారలమ్మ తల్లులే కాపాడారని చెబుతారాయన.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh