ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికలు సైలెంట్‌గా మొదలయ్యాయి. ఉదయాన్నే ఓటు వేసేద్దామని ఓటర్లు 7 గంటల కంటే ముందే పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్... సాయంత్రం 5 గంటల వరకూ జరగనుంది. రాష్ట్రంలో మొత్తం 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 71 మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 78,71 272 మంది ఓటర్లు తమ ఓటు వేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 12 కార్పొరేషన్లలోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మొత్తం 50 డివిజన్లు ఉన్నాయి. అన్ని డివిజన్లకూ నోటిఫికేషన్ విడుదల కాగా.. ఇందులో 3 డివిజన్లను అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవం చేసుకుంది. మిగిలిన 47 డివిజన్లకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. కొత్తగా విలీనమైన పంచాయతీలతో కలిపి ఏలూరు కార్పొరేషన్ పరిధిలో మొత్తం 2,88,951 మంది జనాభా ఉన్నారు. వీరిలో 2,47,631 మంది ఓటర్లు తమ ఓటు వేస్తున్నారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) 75 పురపాలక సంస్థలు, నగర పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా ఇందులో నాలుగు మున్సిపాలిటీలు ఏకగ్రీవమయ్యాయి. ఏకగ్రీవమైన మున్సిపాలిటీలను పరిశీలిస్తే.., గుంటూరు జిల్లాలోని మాచర్ల, పిడుగురాళ్ల, చిత్తూరు జిల్లా పుంగనూరు, కడప జిల్లా పులివెందుల మున్సిపాలిటీలలో అన్ని వార్డులు ఏకగ్రీవమవడంతో ఆ నాలుగు మున్సిపాలిటీలు మినహాయించి 71 పురపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో నేడు పోలింగ్ జరుగుతోంది. 2,215 డివిజన్లు, 7,552 మంది వార్డు సభ్యుల స్థానాలకు అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
మొత్తం 7,915 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో సగానికిపైగా సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నందున భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 2,320 అత్యంత సమస్యాత్మక, 2,468 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా ప్రకటించారు. వీటిలో విజయవాడలోనే అత్యధికంగా 221, విశాఖపట్నంలో 185, గుంటూరులో 139, కడపలో 137, తిరుపతిలో 130, కర్నూలులో 123 అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. ఇక్కడ ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేసి ఎన్నికలలు ప్రశాంతంగా జరిగేలా చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మొత్తం 78,71,272 ఓటర్లు ఉండగా ఇందులో పురుషులు 38,72,264, మహిళలు 39,97,840, ఇతరులు 1,168 మంది కాగా, పురుషుల కంటే మహిళలు 1.6 శాతం ఎక్కువగా ఉన్నారు. రాష్ట్రంలో జరిగే నగర పాలక, పురపాలక సంస్థలు, నగర పంచాయతీ ఎన్నికల పోలింగ్ కోసం 48,723 మంది ప్రభుత్వ ఉద్యోగుల సేవలను వినియోగించనున్నారు. నగరపాలక సంస్థల్లో 21,888, పురపాలక, నగర పంచాయతీల్లో 26,835 మందిని కేటాయించారు. మరోవైపు సుప్రీంకోర్టు కూడా ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైకోర్టు ఉత్తర్వులను కొందరు సుప్రీంలో సవాల్ చేయగా.. అత్యున్నత ధర్మాసనం హైకోర్టు ఆదేశాలను సమర్ధిస్తూ తీర్పునిచ్చింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Gold price: 3 రోజుల తర్వాత మళ్లీ తగ్గిన బంగారం ధరలు... తాజా రేట్లు ఇవీ...
ఈసారి అన్ని పార్టీల ప్రముఖులు తమ అభ్యర్థుల విజయావకాశాలు మెరుగుపర్చేందుకు అన్ని చోట్లా ప్రచార సభలు నిర్వహించారు. రాష్ట్రంలో చాలా వరకు ఓటర్ల స్లిప్పుల పంపిణీ కూడా పూర్తైంది. చివరి నిమిషం వరకు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు ప్రయత్నాలు సాగించారు. ఈనెల 14న వెలువడే ఫలితాలతో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra pradesh news, Ap cm ys jagan mohan reddy, Ap local body elections, AP News, Local body elections