ఏపీ మంత్రిని భయపెడుతున్నఆ సెంటిమెంట్? అందుకే దూరం.. దూరం..

వెల్లంపల్లి శ్రీనివాస్

వివాదాలకు కాస్త దూరంగా ఉండాలని వెల్లంపల్లి నిర్ణయించుకున్నారట. అందుకే కాంట్రవర్సీల జోలికి వెళ్లడం కంటే సీఎం జగన్ తనకు ఇచ్చిన రెండున్నరేళ్ల పదవీకాలాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకునేందుకే వెల్లంపల్లి మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.

 • Share this:
  (సయ్యద్ అహ్మద్, విజయవాడ కరెస్పాండెంట్, న్యూస్ 18)

  తెలుగు రాష్ట్రాల్లో దేవాదాయ మంత్రిగా పనిచేసిన వారికి ఆ పదవి నుంచి తప్పుకున్నాక రాజకీయ భవిష్యత్తు ఉండబోదనే సెంటిమెంట్ ఉంది. గతంలో ఉమ్మడి రాష్ట్ర్రంలో దేవాదాయ శాఖకు మంత్రులుగా పనిచేసిన వారితో పాటు ఏపీలో గత టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన మాణిక్యాలరావు వరకూ అంతా పదవి నుంచి దిగిపోగానే రాజకీయంగా ప్రాధాన్యం కోల్పోయిన వారే. ఇందులో ఒకే ఒక మినహాయింపుగా తెలంగాణ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని చెబుతుంటారు. ఇప్పుడు ఈ సెంటిమెంట్ తనకూ వర్తిస్తుందని ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే మంత్రి వెల్లంపల్లి తన శాఖలో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

  జగన్ కేబినెట్ విస్తరణలో పలు సమీకరణాల దృష్ట్యా ఏపీ దేవాదాయ శాఖ మంత్రి పదవి దక్కించుకున్న విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కు అధికారం మాత్రం అందని ద్రాక్షగానే మారుతోంది. చేతిలో అమాత్య పదవి ఉన్నా కీలక ఆలయాల వ్యవహారంలో తలదూర్చాలంటే ఆయన వణికిపోతున్నారు. రాష్ట్రంలో కీలకమైన టీటీడీ బోర్డు ఛైర్మన్ పదవిలో జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి ఉండటం, మిగతా ఆలయాల విషయంలోనూ పార్టీలో స్ధానిక నేతలకు ఉన్న పట్టు కారణంగా మంత్రి వెల్లంపల్లి నామమాత్రంగా మిగిలిపోతున్నారు. గతంలో దేవాదాయశాఖ మంత్రులుగా పనిచేసిన వారంతా అనంతరం రాజకీయంగా ప్రాధాన్యం కోల్పోవడం, ఇతర సెంటిమెంట్ల కారణంగా తనకు ఇచ్చిన రెండున్నరేళ్ల పదవీకాలం ఎప్పుడు పూర్తవుతుందా అని ఆయన ఎదురుచూస్తున్నట్లు కనిపిస్తోంది.

  ఏపీలో దేవాదాయశాఖ మంత్రులుగా ఎవరు ఉన్నా... తిరుమల, తిరుపతి దేవస్ధానం వ్యవహారాలపై పట్టు సాధించడం అంత సులువు కాదు. తమిళ తంబీల హవా ఎక్కువగా ఉండే తిరుమల కొండపై దేవాదాయ మంత్రైనా.. ఇతర రాజకీయ నేతలకైనా.. పూర్తిస్ధాయిలో పట్టు ఉండదనే ప్రచారం ఉండనే ఉంది. అధికార పార్టీలకు చెందిన నేతలకు టీటీడీ ఛైర్మన్‌గా  బాధ్యతలు కట్టబెట్టడం, పాలకమండలి నిర్ణయాలు మాత్రమే అమలయ్యే పరిస్ధితుల్లో దేవాదాయమంత్రుల పాత్ర నామమాత్రంగా ఉండటం సహజమే. అయితే ఈసారి ఏకంగా జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్ పదవిలో ఉండటంతో తిరుమల వ్యవహారాల గురించి మాట్లాడేందుకు సైతం దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి భయపడుతున్నారు. ఇక వాటిలో జోక్యం చేసుకోవడం అంటే తన పదవికి ముప్పు తెచ్చుకోవడమే అనే వాదన వినిపిస్తోంది.

  మరోవైపు గతంలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గంతో పాటు నగర పరిధిలో చాలా ఆలయాలు, ప్రార్ధనా స్ధలాలను టీడీపీ ప్రభుత్వం అభివృద్ధి పేరుతో కూల్చివేసింది. అప్పట్లో వైసీపీ తరఫున వెల్లంపల్లి శ్రీనివాస్ పలుమార్లు ఆందోళనలు, ధర్నాలు చేపట్టారు. తాము అధికారంలోకి రాగానే వాటిని పునర్ నిర్మిస్తామని హమీలు కూడా ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక మాత్రం వాటి గురించి మాట్లాడేందుకు సైతం ఆయన ఇష్టపడటం లేదు. ఇప్పుడు ప్రార్ధనా స్థలాలపై దృష్టిసారిస్తే విపక్షాలు రాజకీయం చేస్తాయని, అది చివరికి తన పదవికి ఎసరు పెడుతుందని వెల్లంపల్లి భయపడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే వివాదాలకు కాస్త దూరంగా ఉండాలని వెల్లంపల్లి నిర్ణయించుకున్నారట. కాంట్రవర్సీల జోలికి వెళ్లడం కంటే సీఎం జగన్ తనకు ఇచ్చిన రెండున్నరేళ్ల పదవీకాలాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకునేందుకే వెల్లంపల్లి మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.
  First published: