పవన్ కల్యాణ్ (Pawan Kalyan) భీమ్లా నాయక్ సినిమా (Bheemla Nayak Movie) టికెట్ల వివాదంపై ఏపీ మంత్రి పేర్ని నాని (AP Minister Perni Nani) స్పందించారు. దీనిపై వచ్చిన విమర్శలకు ఆయన ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. నిబంధనలు పాటించకుండా తమపై నిందలు వేయడం సరికాదన్నారాయన. సినిమా టికెట్ల ధరలు పెంచుకోవాలనుకుంటే సదరు థియేటర్ యాజమాన్యాలు జేసీకి దరఖాస్తు చేసుకోవాలని హైకోర్టు సూచించిందని.. కోర్టును, ప్రభుత్వాలను, జీవోలను గౌరవించని వారికి ఏం చెప్పినా అర్ధం కాదన్నారు. మైక్ పట్టుకుంటే నీతులు చెప్పే హీరోగారు.. నీతిమాలిన పనులకు పాల్పడటం లేదా అని ప్రశ్నించారు. ఏపీలో బ్లాక్ మార్కెటింగ్ ను ప్రోత్సహించే రాజకీయ పార్టీలుండటం దురదృష్టకరమన్నారు. బీజేపీ, జనసేన, టీడీపీలు బ్లాక్ లో టికెట్లు అమ్ముతున్నాయన్నారు. సీఎం జగన్ కు వ్యతిరేకంగా ఎంతటి కిరాతకంగా వ్వవహరించడానికేనా సిద్ధపడుతున్నారని మండిపడ్డారు.
కోర్టు తీర్పుకు అనుగుణంగా దరఖాస్తు చేసుకోవచ్చుకదా అని సూచించారు. టికెట్ ధరల పెంపుపై 21వ తేదీన రిపోర్ట్ ఇస్తే.. 22వ తేదీన పరిశీలించి.. 24న జీవో రావాల్సిన ఉందని పేర్ని నాని తెలిపారు. ఐతే మంత్రి గౌతమ్ రెడ్డి మరణించిన ఆవేదనలో తాము ఉంటే.. జీవో ఇవ్వలేదని రాద్దాందం చేయడాన్ని ఏమనాలని పేర్ని నాని ప్రశ్నించారు. గౌతమ్ రెడ్డి మరణం గురించి కూడా కొందరు అవాకులు చవాకులు పేలారని మంత్రి పేర్ని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గౌతమ్ రెడ్డి కోసం ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా వేసుకున్న వ్యక్తులు.. సినిమాను వాయిదా వేసుకోలేరా అని పవన్ కల్యాణ్ ను పేర్ని నాని ప్రశ్నించారు. సినిమా ఫ్రీగా చూపిస్తామన్నవారికి బ్లాక్ టికెట్లు అమ్ముకోవాల్సిన అవసరం ఉండదు కదా అని పేర్ని నిలదీశారు. పవన్ కల్యాణ్ సినిమా కోసం ఆతృతపడిన లోకేష్ కు.. జూనియర్ ఎన్టీఆర్ సినిమా గురించి ఎందుకు మాట్లాడలనిపించలేదన్నారు.
సినిమా బాగుంటే జనం చూస్తారని.. బాగోలేకపోతే సాయంత్రానికే ఎత్తేస్తారని పేర్ని నాని అన్నారు. గతంలో ఉప్పెన, పుష్ప వంటి సినిమాలను ప్రజలు ఆదరించారని.. ఇప్పుడు భయమెందుకని ప్రశ్నించారు. సినిమాలకు వైసీపీకి సంబంధం అంటగట్టి నిందలు వేయడం సరికాదన్నారు. మంత్రి మరణం కారణంగా జీవో రెండురోజులు ఆలస్యమైతే దిక్కుమాలిన విమర్శలు చేస్తున్నారని పేర్ని నాని మండిపడ్డారు.
చిరంజీవి, ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్ సినిమాలకు ట్వీట్ చేయని చంద్రబాబు, లోకేష్ లు.. పవన్ సినిమాలపై మాత్రం ట్వీట్లు చేస్తూ రాజకీయ లబ్ధిపొందాలను చూస్తున్నారని పేర్ని నాని ఆరోపించారు. అఖండ సినిమా నిర్మాతలు నూజివీడు ఎమ్మెల్యే, మరో ఇద్దరితో కలిసి తన అపాయింట్ మెంట్ అడిగారని.. తాను కూడా సమయం ఇవ్వగా.. అదే సమయంలో బాలకృష్ణ ఫోన్ చేసి సీఎం అపాయింట్ మెంట్ కోరినట్లు పేర్ని నాని అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap minister perni nani, Bheemla Nayak, Pawan kalyan