ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సమాచార, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని (Perni Nani) .. సినీ నటుడు మోహన్ బాబు (Mohan Babu) తో భేటీ అయ్యారు. శుక్రవారం మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడి వివాహం సందర్భంగా హైదరాబాద్ వెళ్లి పేర్ని నాని.. మోహన్ బాబు ఇంటికి వెళ్లి కలిశారు. ఈ భేటీలో సినీ పరిశ్రమకు చెందిన అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ సమస్యలపై ప్రభుత్వ వైఖరి, సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలను మంత్రి పేర్ని నాని.. మోహన్ బాబుకు వివరించినట్లు సమాచారం. ముఖ్యంగా సినిమా టికెట్ల ధరలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు టాక్. గురువారం చిరంజీవితో సహా స్టార్ హీరోలు మహేష్ బాబు, ప్రభాస్, డైరెక్టర్లు ఎస్ఎస్ రాజమౌళి, కొరటాల శివ, నటులు ఆర్.నారాయణ మూర్తి, ఆలీ, పోసాని కృష్ణమురళి సీఎం జగన్ తో భేటీ అయిన తర్వాతి రోజే పేర్ని నాని... మోహన్ బాబుతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇదిలా ఉంటే గురువారం సీఎం జగన్ తో సినీ ప్రముఖుల భేటీలో పలు కీలక అంశాలపై చర్చించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినిమా టికెట్ల ధరలు, రోజుకు ఐదు షోలు వేయాలన్న అంశంపై చర్చించారు. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి తమకు పూర్తి సహకారం ఉందని.. త్వరలోనే ఈ సమస్యలకు శుభం కార్డు పడుతుందని చిరంజీవి అన్నారు. దీంతో ఈ నెలాఖరుకు సినిమా టికెట్ల ధరలపై జీవో జారీ అవుతుందనే వార్తలు వస్తున్నాయి.
సినిమా టికెట్ల ధరలపై సముచిత నిర్ణయం తీసుకుంటామని సీఎం జగన్.. చిరు టీమ్ కు హామీ ఇచ్చారు. ముఖ్యంగా వంద కోట్లకు పైగా బడ్జెట్ తీసే సినిమాలకు పెట్టుబడి తిరిగి రావాలనే ఉద్దేశంలో వారం రోజుల పాటు రేట్లు పెంచుకునే అకాశాన్ని పరిశీలిస్తామని జగన్ పేర్కొన్నారు. ఇలాగే సినీ పరిశ్రమ విశాఖపట్నం రావాల్సిన అవసరముందని.. అక్కడ ఇళ్లు, స్టూడియోలు నిర్మించుకునేందుకు స్థలాలు కూడా ఇస్తామని జగన్ అన్నారు. సీఎం జగన్ ఇచ్చిన హామీల పట్ల చిరంజీవితో పాటు మహేష్, ప్రభాస్, రాజమౌళి కృతజ్ఞతలు తెలిపారు. గందరగోళంలో ఉన్న పరిశ్రమకు ఊతమిచ్చేలా నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
ఐతే ఇటీవల జగన్-చిరంజీవి భేటీపై మోహన్ బాబు తనయుడు, మా అధ్యక్షుడు మంచు విష్ణుని ప్రశ్నించగా.. అది వ్యక్తిగత సమావేశమని అభిప్రాయపడ్డారు. ఐతే సినిమా టికెట్లపై గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన జీవోలను పరిశీలించాలని.. తాజాగా ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోను కూడా చూడాలని మీడియాను కోరిన సంగతి తెలిసిందే..!
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap minister perni nani, Manchu mohan babu