AP MINISTER PERNI NANI GIVES CLARITY ON MOVIE THEATRES AND TICKET PRICE ISSUE IN THE STATE FULL DETAILS HERE PRN
AP Movie Theatres Issue: చెప్పినా వినలేదు.. అందుకే చర్యలు.. థియేటర్ల సమస్యపై పేర్ని నాని క్లారిటీ..
మంత్రి పేర్ని నాని
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సినిమా డిస్ట్రిబ్యూటర్ల అసోసియేషన్ ప్రతినిథులతో ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్నినాని (Perni Nani) సమావేశమయ్యారు. తమ సమస్యలు, టికెట్ ధరల వల్ల వచ్చే నష్టాల గురించి డిస్ట్రిబ్యూటర్లు మంత్రికి వివరించారు. అనంతరం సినిమా థియేటర్ల అంశంపై మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సినిమా డిస్ట్రిబ్యూటర్ల అసోసియేషన్ (Movie Distributers Association) ప్రతినిథులతో ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్నినాని (Minister Perni Nani) సమావేశమయ్యారు. తమ సమస్యలు, టికెట్ ధరల వల్ల వచ్చే నష్టాల గురించి డిస్ట్రిబ్యూటర్లు మంత్రికి వివరించారు. అనంతరం సినిమా థియేటర్ల అంశంపై మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. డిస్ట్రిబ్యూటర్ల నుంచి వచ్చిన వినతులు ప్రభుత్వ దృష్టిలో ఉన్నాయని.. అలాగే టికెట్ల ధరలపై హైకోర్టు సూచనతో కమిటీని కూడా నియమించినట్లు మంత్రి తెలిపారు. కమిటీలో హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు పలు శాఖల అధిపతులు, సినిమా పరిశ్రమ ప్రతినిథులు కూడా ఉన్నారన్నారు. డిస్ట్రిబ్యూటర్లు, వివిధ సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తులపై త్వరలోనే చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. సామాన్యులు ఇబ్బంది పడకుండా వినోదాన్ని అందించవచ్చనే అంశంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఓ మంచి నిర్ణయం తీసుకుంటుందన్నారు.
ప్రభుత్వం నియమించిన కమిటీ చర్చించిన ఇచ్చిన సిఫార్సుల మేరకు ప్రభుత్వం ముందుకు వెళ్తుందని పేర్ని నాని స్పష్టం చేశారు. కమిటీ పేరుతో కాలయాపన చేసే అవకాశం లేదని.. వీలైనంత త్వరగా సమస్య పరిష్కరిస్తామన్నారు మంత్రి. థియేటర్లలో తనిఖీలు, టికెట్ల ధరల విషయంలో ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. తెలుగు ఫిల్మ్ చాంబర్ తో సెప్టెంబర్లో జరిగిన సమావేశంలో సినిమా హాళ్లకు సంబంధించిన అనుమతులు, ఫైర్ డిపార్ట్ మెంట్ ఎన్ఓసీ పత్రాలు, రెవెన్యూ డిపార్ట్ మెంట్ నుంచి బీ ఫామ్ వంటివి యాజమాన్యాలు రెన్యువల్ చేయించుకోవడం లేదనే సంగతి గుర్తు చేశామన్నారు. నిబంధనలు పాటించాలని చెప్పినా రెన్యువల్ చేయించుకోనందుకే తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్ని నాని వివరించారు.
రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకున్నవారి జోలికి వెళ్లలేదని ఆయన స్పష్టం చేశారు. ఎవరి మీదో కక్షతో ఇలా చేయలేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 130 థియేటర్లపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. లైసెన్స్ లేని 22 థియేటర్లను యాజమాన్యాలే స్వచ్ఛందంగా మూసివేశారన్నారు. అయినా ఏప్రిల్ లో వచ్చిన టికెట్ల జీవోపై 9 నెలల తర్వాత థియేటర్లు నిరసన వ్యక్తం చేస్తున్నాయనడంలో అర్ధం లేదన్నారు మంత్రి పేర్నినాని.
సినిమా థియేటర్లో కలెక్షన్ల కంటే కిరాణా షాపులో కలెక్షన్లు అధికంగా వస్తున్నాయన హీరో నాని కామెంట్స్ పై మంత్రి నాని స్పందించారు. ఆయన ఎక్కడ ఉండి.. ఏ షాపును దృష్టిలో పెట్టుకోని అలాంటి కామెంట్స్ చేశారో తెలియదన్నారు. సీఎం జగన్ ప్రభుత్వానికి ఏది పడితే అది ఆపాదించడం సరికాదన్నారు. సమస్యలపై చర్చించేందుకు, సంప్రదింపులు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్ని నాని స్పష్టం చేశారు. ఇండస్ట్రీ సమస్యల గురించి ఎవరైనా, ఎప్పుడైనా తమను కలిసి వివరించవచ్చన్నారు. ఇదిలా ఉంటే ప్రాంతాల వారిగా ప్రభుత్వం నిర్ణయించిన టికెట్ ధరలను సవరించాలని డిస్ట్రిబ్యూటర్ల అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.